ఖరీఫ్‌లో పెరగనున్న సాగు

Updated By ManamSat, 07/21/2018 - 23:36
paddy
  • సాగర్ ఆయకట్టుకు మహర్దశ.. జిల్లాలో అత్యధిక వర్ష పాతం..

  • జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు.. పనుల్లో నిమగ్నమైన రైతాంగం

paddyఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం యావత్తూ సంతోషంలో మునిగింది. ఖరీఫ్ సాగు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా కురియడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆయా ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పెరగనుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరిసాగు పెరిగే అవకాశం ఉంది. అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు సంతో షంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

నాలుగేళ్లుగా వరి పండడంలేదు..
ఖమ్మం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,32,707 హెక్టార్లు.. దీనిలో వరి సాధారణ విస్తీర్ణం 60వేల హెక్టార్లు, మొక్కజొన్న 4.3 వేల హెక్టార్లు, పత్తి 98 వేల హెక్టార్లు, చెరకు 4670 హెక్టార్లు, పెసర 8752 హెక్టార్లు, కంది 2200 హెక్టార్లలో సాగు అవుతుంది. అయితే, నాలుగేళ్లుగా సాగర్ ఆయకట్టు కింద వరి సాగు కావడంలేదు. నీటి లభ్యత లేకపోవడంతో మొక్కజొన్న, కంది తదితర పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షపాతం అత్యధికంగా నమోదు అయ్యింది. గత సంవత్సరం జూన్‌లో 234 మి.మి. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 183 మి.మి. వర్షం కురిసింది. జూలై నెలలో గత ఏడాది 200 మి.మి. వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది జూలై 21 నాటికి 240 మి.మి. వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ముమ్మరమైంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 133.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టం ఉంది.. ఇది 540 అడుగులు దాటితే ఒక పంటకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నిండితే అక్కడ నుంచి నాగార్జునసాగర్‌కు చేరే అవకాశం ఉంది. సాగర్ నిండితే జిల్లాలో రెండు పంటలు పండే అవకాశం ఉంది.

నిండిన చెరువులు..
ఇరవై రోజుల వర్షం కారణంగా జిల్లాలోని పెద్ద పెద్ద చెరువులన్నీ నిండాయి. ఇప్పటికే ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువుల మరమ్మత్తులను చేపట్టింది. దీంతో జిల్లాలో సుమారు 6వేల చెరువులలో పూడికతీత పూర్తయింది. ఈ పనులు ముగియడంతో తాజా వర్షాలకు ఆ చెరువులు నిండాయి. అలాగే జిల్లాలోని ప్రాజెక్టులు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి, పత్తి సాగు పెరగనుంది. ఇప్పటికే సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కూసుమంచి, కొండపల్లి తదితర మండలాల్లో వరినాట్లు మొదలయ్యాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్ల నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.  నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో వరిసాగు లేకపోవడంతో నష్టపోయామని, ఈ ఏడాది సజావుగా సాగితే అప్పులు తీరుతాయని రైతులు పేర్కొంటున్నారు.

Tags
English Title
Harvesting in Kharif
Related News