పేదల గూటికి ఆరోగ్య సంరక్షణ 

Updated By ManamTue, 02/13/2018 - 06:25
Health_art

Health_artఅందరికీ  ఆరోగ్యం విషయం లో ప్రధానమంత్రికి ఓ దృఢమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం ఓ బహుళార్థ సాధక విధానం రూపంలో ఆయన అనేక సమూలమైన మార్పులకు శ్రీకారం దిద్దారు. ఇది ప్రతి ఒక్కరికీ నివారక, నిరోధక, చికిత్సా రూపంలో ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది. అంతేకాక, వివిధ స్థాయిల్లో చికిత్సా సౌకర్యాలు కల్పించి ఆరోగ్య సంరక్షణకు మార్గం సుగమం చేస్తుంది. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని దీని అమలుకు వ్యూహాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. తన స్తోమతకు మించి ఆరోగ్యం మీదా, చికిత్స మీదా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా చేయడమే దీని పరమార్థం. ప్రతి ఏటా ఏడు లక్షల మంది తమ ఆరోగ్యం కోసం, చికిత్స కోసం పెట్టే భారీఖర్చుతో పేదరికంలోకి కూరుకుపోతున్నట్టు అంచనా. ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఇందుకు సంబంధించిన ప్రాథమిక అవసరాలను తీర్చుకునేందుకు ఇప్పుడున్న ఆరోగ్య విధానాలనే పునర్నిర్మించి వాటికి కొత్త  దిశానిర్దేశం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగం.

ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీల) ద్వారానే నివారక, నిరోధక ఆరోగ్య సంరక్షణ లభిస్తోంది. అయితే, పీహెచ్‌సీలకు వైద్యుల కొరత అధికంగా ఉంది. వారి పంపిణీ కూడా అరకొరగా ఉంది. సరైన వైద్యుని కోసం రోగులు ఒక్కోసారి 25 కిలోమీటర్ల వరకూ నడిచి వెళ్లాల్సి వస్తోంది. పీహెచ్‌సీలు కేవలం 5 శాతం ఔట్ పేషెంట్లకు మాత్రమే చికిత్సను అందించగలుగుతున్నాయి. చివరికి వారు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా ఔట్‌పేషెంట్లు సైతం తమ జేబుల నుంచి అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. భారతదేశంలో ఈ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఇతర దేశాలతో పోలిస్తే స్తోమతకు మించి ఖర్చు చేయడమనే ది భారతదేశంలో 64 శాతం వరకూ ఉంది. స్తోమతకు మించి ఖర్చు చేసే స్థాయిలను అధ్యయనం చేస్తే మొత్తం 192 దేశాలలో భారతదేశం 182వ స్థానంలో ఉంది.

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తీసుకురావడం అత్యంత అవసరం. పీహెచ్‌సీల స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉప కేంద్రాలను అందుబాటులోకి తేవడానికి అవకాశం కల్పించాలి. పీహెచ్‌సీలు 25 గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుండగా ఉప కేంద్రాలు కనీసం నాలుగు గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణను భుజాలకెత్తుకోవాల్సి ఉంటుంది. అంటే కొత్త విధానంలో, ఉప కేంద్రాల ద్వారా ప్రాథమిక, నివారక ఆరోగ్య సంరక్షణ కల్పించడం ప్రధానం. ఆరోగ్య సంరక్షణలో ఉప కేంద్రం అనేది నాలుగవ స్థాయిలో ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంటువ్యాధులను, జీవనశైలి వ్యాధులను గుర్తిస్తూ వారికి చికిత్స అందించడం వీటి ప్రధాన ఉద్దేశం. అంతేకాక, ఈ విధానంలో ఏఎన్‌ఎంలు, ఎంపీడబ్ల్యూలు, ఆశా లు, అంగన్‌వాడీ కార్యకర్తలంతా ఒకేచూరు (ఉప కేంద్రం) కింద ఉంటారు. దీనివల్ల ఇంటిస్థాయి నుంచి ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, పౌష్టికాహారం వంటి అంశాల మీద సమన్వయంతో పనిచేయడానికి వీలు కలుగుతుంది. 

డిజిటల్ టెక్నాలజీ వినియోగం
ఇక ఈ విధానాన్ని సక్రమంగా, సమర్థంగా అమలు చేయడానికి డిజిటల్ టెక్నాలజీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, 70 శాతానికి పైగా రోగులు పీహెచ్‌సీ స్థాయిలో చికిత్స కోసం వస్తుంటారు. రోగులు అసలు పీహెచ్‌సీలకు రావాల్సిన అవసరమే లేకుండా ఇటువంటి వ్యాధి లక్షణాలను గుర్తించడానికి, నిర్ధారించడానికి డిజిటల్ టెక్నాలజీ ఉపయోగపడే పక్షంలో ఇది అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. (ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాలను జోడించడం ద్వారా) తపాలా ద్వారానో, కొరియర్ ద్వారానో ఔషధాలను ఇంటి వద్దకే వెళ్లి అందజేయడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. ఇది పీహెచ్‌సీ స్థాయిలో రద్దీని తగ్గించడానికి కూడా వీలు కల్పిస్తుంది. నివారక ఆరోగ్య సంరక్షణలో మరో ముఖ్య మైన అంశం అంటువ్యాధులు కానటువంటి వ్యాధులను ముందే గుర్తించడం. ఇందుకోసం తరచూ సార్వజనిక హెల్త్ చెకప్ చేయించడం అనివార్యమవుతుంది. సాయిల్ హెల్త్ కార్డు మాదిరిగానే దీని కోసం డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డు జారీ చేయాల్సి ఉంటుంది. 
ఇవన్నీ జరగాలంటే దేశంలో పీహెచ్‌సీల కంటే తక్కువ స్థాయిలో ఉన్న సుమారు 1,53,655 ఉప కేంద్రాలకు అప్‌గ్రేడ్ చేయాలి. దాదాపు 1.3 లక్షల ఉప కేంద్రాలు ప్రభుత్వ ఆధీనంలోనో, పంచాయతీ భవనాల్లోనో ఉన్నందువల్ల ప్రాథమిక సదుపాయాల మీద పెట్టాల్సిన ఖర్చు చాలావరకు తగ్గుతుంది. మరో సవాలు ఏంటంటే, అసలే వైద్యుల కొరత ఉన్న స్థితిలో ఉప కేంద్రాలను నిర్వహించేదెవరు? ఇక్కడో అవకాశం ఉంది. దేశంలో సుమారు 7.4 లక్షల మంది ఆయుష్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఆయుష్ డాక్టర్లు ఉప కేంద్రాలను నిర్వహించవచ్చు. చైనాలో మాదిరిగా దీనివల్ల సంప్రదాయిక వైద్యం, ఆ ధునిక వైద్యం సమన్వయంతో పనిచేయడానికి వీలుంది. అంతేకాదు, యోగా లాంటి సంప్రదాయిక ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించవచ్చు. 

దేశంలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. రాష్ట్రీయ స్వస్థ్ బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకాలను సమీక్షించినప్పుడు, స్తోమతకు మించిన వైద్య ఖర్చులను ఈ పథకాలు తగ్గించలేకపోతున్నాయనే విషయం స్పష్టమైంది. ఈ ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 2004లో 5,752 రూపాయలు ఉండగా, 2014 నాటికి 5,904 రూపాయలకు పెరిగింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 8,217 రూపాయల స్థాయి నుంచి 10,866 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చేరినప్పుడు మాత్రమే పథకాలు వర్తిస్తున్నాయనే సంగతి కూడా ఈ సమీక్షలో బయటపడింది. బీమా పథకాలు గానీ, ఆరోగ్య రక్షణ పథకాలు గానీ ప్రాథమిక స్థాయిలోనో, నివారణ సాథయిలోనో, జీవనశైలి వ్యాధులను నిర్ధారణ స్థాయిలోనో పట్టించుకోకుండా ఆస్పత్రులలో చేరిన తర్వాత చికిత్స ప్రారంభించిన తరువాత మాత్రమే అంటే సెకండరీ స్థాయిని దాటిన తర్వాత మాత్రమే పట్టించుకోవడం జరుగుతోంది.
పేద కుటుంబాలన్నిటికీ ఆరోగ్య సంరక్షణను సమకూర్చాల్సిన అవసరం ఉంది. అదనంగా, మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఆరోగ్య సంరక్షణ పథకాల్లో అవకాశం కల్పించాలి. మధ్యతరగతివారు మాత్రం పూర్తిస్థాయిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గనుక చేస్తే, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా తక్కువ ఖర్చుతో సరైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయవేుమిటంటే, అటు ప్రభుత్వ ఆస్పత్రులలోనూ, ఇటు ప్రైవేట్ ఆస్పత్రులలోనూ అందిస్తున్న చికిత్స, ఆరోగ్య సంరక్షణకు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి. అంటే సరైన పర్యవేక్షణ ఉండాలి. ఈ పథకాలను సమన్వయ పరచడానికి, అమలు చేయడానికి రాష్ట్రస్థాయి హెల్త్ అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలకు తమకు వీలైన, సౌకర్యవంతమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి స్వేచ్ఛను కలిగి ఉండాలి. 
 
రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ
అవసరమైతే రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న ట్రస్ట్, సొసైటీ, లాభేతర కంపెనీ, రాష్ట్ర నోడల్ ఏజెన్సీల ద్వారా ఈ పద్ధతిని అమలు చేయవచ్చు లేదా కొత్త మరో సంస్థను ఏర్పాటు చేయవచ్చు. జాతీయ స్థాయి లో, ఈ పథకాలను నిర్వహించడానికి జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయవచ్చు. ఆస్పత్రుల ఎంపికకు, ధరల నిర్ణయానికి, చికిత్సా సౌకర్యాల కల్పనకు, పర్యవేక్షణకు, నాణ్యమైన హామీని ఇచ్చేందుకు, రోగుల భద్రతకు, ప్రమాణాలకు కావాల్సిన నియమ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. 
   2018-19 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ పథకం, ఉప కేంద్రాల అప్‌గ్రేడ్ వంటివి పేదల ఆరోగ్య సంరక్షణ మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా పేదల జీవితాలను, జీవనాలను కాపాడడం దీని ఉద్దేశం. ఆరోగ్య సంరక్షణ మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండడం వల్ల పేదలు ఆహారం, విద్య వంటి ప్రధాన అంశాల మీద ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తోంది. తరచూ ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం, ఆస్పత్రులలో చేరాల్సి రావడం వంటి వాటివల్ల ఖర్చులు పెరిగిపోతుండడంతో పేదలకు ఆరోగ్య సంరక్షణ అనేది ఓ ఉత్పాతం కింద అనుభవానికి వస్తోంది. ఈ భారీ ఖర్చులు వారి జీవనాన్ని కూడా దెబ్బ తీస్తున్నాయి. ఒక్కోసారి శాశ్వతంగా ఆర్థికంగా చితికిపోవాల్సి వస్తోంది కూడా. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమలుతో ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ల ఖర్చులు గణనీయంగా తగ్గి, పేద ప్రజల జీవనాల మీద పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని సాధ్యమైనంత నివారించే అవకాశం ఉంది. 
(వ్యాసకర్త కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ
అదనపు కార్యదర్శి. ఇందులోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.)

Tags
English Title
Health care for peasants
Related News