ఆరోగ్య నీతి

Updated By ManamTue, 02/13/2018 - 22:23
health

public healthఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావు పట్టణంలో నకిలీ వైద్యుడు వాడిన సిరంజినే పదే పదే వాడటంతో చాలామంది ప్రాణాంతక హెచ్‌ఐవీ వైరస్ బారినపడ్డారన్న మీ డియా కథనం ప్రజల్లో ఆందోళన కలిగింది. అదే సమయంలో తెలంగాణలో ఒక గ్రామీణ ఆర్‌ఎంపీ డాక్టర్ చేసిన అబార్షన్ వల్ల పేగులు కుళ్లి యోని నుంచి చీము నెత్తురు కారుతున్న ఒక యువతి హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఉదంతం హృ దయాన్ని ద్రవింపచేసింది. వెలుగులోకి రాని ఇలాంటి ఉదంతాలు ఎన్నో గ్రామీణ భారతంలో నిత్యకృత్యమవుతున్నాయి. వైద్యంలో పట్టా పొందిన శిక్షిత డాక్టర్ల కొరత గ్రామీణులకు శాపంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక సంఘం స్థా నంలో ఏర్పడిన నీతి ఆయోగ్ సంస్థ మొట్టమొదటసారి జాతీయ స్థాయిలో ‘ఆరో గ్య సూచిక’ను రూపొందించింది. ఆరోగ్యరంగంలో కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉంటే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఒడిశా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజారోగ్యం అత్యంత ఘోరమైన స్థితిలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 11వ స్థానం లో నిలిచాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల ప్రకారం ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక డాక్టర్ అవసరముండగా, భారత్‌లో ప్రతి 11వేల మంది రోగు లకు ఒక డాక్టరే అందుబాటులో ఉన్నారు.

ప్రజారోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదైతే, ఆర్థిక, విధాన పరమైన సహకారం అందించడం మాత్రమే కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కీలకంగా ఆధారపడి ఉన్నాయి. దేశంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ అంశాల్లో ప్రజారోగ్య సమస్య లేకపోవడంతో అది ఘోర నిర్లక్ష్యానికి గురై నేడది భారీ సంక్షోభంగా తలెత్తింది. స్వాతంత్య్రానంతరం గ్రామీణ ప్రజానీకానికి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్‌ఎంపీ, పీఎంపీ వంటి అర్థ శిక్షిత డాక్టర్లు, నకిలీ డాక్టర్లు, నాటు వైద్యులు, భూత వైద్యులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఆర్‌ఎంపీ, పీఎంపీ వంటి అర్థ శిక్షిత స్వీయ పరిగణత ‘ప్రజావైద్యులు’ ప్రజారోగ్య పరిరక్షణలో చాలా కీలక పాత్ర పోషించిన మాట యదార్థమే. అయితే ప్రపంచీకరణ పర్యవసానంగా మారిన ప్రజల ఆహార అలవాట్లు, పర్యావరణ సమస్యలు, హరిత విప్లవ పర్యవసానంగా ప్రజారోగ్య క్షీణతల నేపథ్యంలో 1990ల తర్వాత నుంచి వారి పాత్ర క్రమంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రజారోగ్య రంగం నుంచి ప్రభుత్వం తప్పుకొని, ప్రజా ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వ్యవస్థను ధ్వంసం చేసింది. ప్రైవేట్ వైద్య రంగాన్ని (సాధారణ, కార్పొరేట్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో ఈ అర్థ గ్రామీణ వైద్యుల్లో అధికశాతం పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు గ్రామాల్లోని రోగులను సరఫరా చేసి, కమీషన్లపై ఆధారపడే పైరవీకారులుగా మారిపోవడం దురదృష్టకరం. అదే సమయంలో తెలిసీ తెలియని వైద్యంచేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బు సంపాదించుకునే నకిలీ డాక్టర్లు కూడా ప్రభుత్వ నిఘా, నియంత్రణ లేకపోవడంతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయారు. దాంతో ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థితులు దాపురించాయి. దాంతో ప్రజల కష్టార్జితంలో 70 శాతంపైగా ఖర్చు చేయాల్సి వస్తూ, రోగగ్రస్థతతో పాటు రుణగ్రస్థత కూడా ప్రజల్ని పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 సేవలు, ఆరోగ్యశ్రీ పథకాలు వంటి జనరంజక పథకాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. ప్రాథమిక ప్రజారోగ్య వ్యవస్థను ధ్వంసంచేసి, వాటికి ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టిన ఈ సేవలు కొందరు నిర్భాగ్యులుగా అండగా నిలిచినప్పటికీ, ఆ పథకం ప్రధానంగా కార్పొరేట్ వైద్య సంస్థలకు భారీ ఆదాయాలను చేకూర్చే పాడి గేదెలుగా మారిపోయాయి.

భారమవుతున్న వైద్య చికిత్స, పెరుగుతున్న వైద్య సేవల అవసరాలతో కుంగిపోతున్న ప్రజానీకానికి రాజ్యాంగంలోని 47 అధికరణం ప్రకారం సార్వత్రిక వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాంటి అత్యవసర వైద్య సేవారంగం పాలకుల కార్పొరేట్ అనుకూల విధానాల కారణంగా నిధుల కొరతతో కునారిల్లుతోంది. ప్రజారోగ్య సంక్షోభం నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వైద్యరంగాన్ని సంస్కరణలలో భాగంగా జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ దాదాపు ఏడున్నర లక్షల మందికి బ్రిడ్జి కోర్సుల ద్వారా ప్రాథమిక వైద్య శిక్షణ ఇచ్చి, పీహెచ్‌సీ పరిధిలో ఉప కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామీణ భారతానికి వైద్యాన్ని అందించాలని కేంద్రం బృహత్ ప్రణాళిక రచించింది. అదే సమయంలో జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం హోమియో, ఆయు ర్వేదం తదితర ప్రత్యామ్నాయ వైద్యం చేసేవారు సైతం అల్లోపతి విధానంలో ప్రజలకు వైద్యం చేయొచ్చు అనే అత్యంత వివాదాస్పద ప్రభుత్వ నిర్ణయం ప్రజా రోగ్యంతో చెలగాటమాడుతోందని పలు వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇత ర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఆపద్దర్మ ప్రజావైద్యుల ప్రయోగం విజయ వంతమైంది నిజమే. అయితే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించిన దేశాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటే గానీ అలాంటి ప్రయోగాలు విజయవంతం కాలేదు. ప్రైవేట్, కార్పొరేట్ వైద్యవ్యాపారం, వైద్య టూరిజం వం టివి అమలులో ఉన్న భారత్‌లో ‘మోదీకేర్’ ప్రయోగాలు కార్పొరేట్ ప్రయోజ నాలు నెరవేర్చే స్థానిక యంత్రాంగాలుగా అవతరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రయోజనాలు ఆశించి ప్రజారోగ్యంతో పాలకులు చేసే లోపభూయిష్ట నిర్ణయాలు ఆరోగ్య వైపరీత్యంగా మారే ప్రమాదం లేకపోలేదు.
 

English Title
Health ethics
Related News