హీరో మారుతున్నాడు (స్పెష‌ల్ స్టోరీ)

Updated By ManamTue, 04/03/2018 - 17:43
article

articleఇటీవ‌ల కాలంలో మ‌న ద‌ర్శ‌కులు త‌మ క‌థానాయ‌కుల కోసం కొత్త కొత్త పాత్రలు సృష్టిస్తున్నారు. ఆ కొత్త‌ద‌నంలో భాగంగా.. కాస్త ముందుకెళ్ళి మ‌న హీరోల పాత్ర‌ల్లో ఏదైనా అవ‌య‌వ లోప‌మో, లేదంటే ఒక కొత్త త‌ర‌హా రుగ్మ‌తో ఉండేలా క్యారెక్ట‌ర్స్ డిజైన్ చేసుకుంటున్నారు. ఇదివ‌ర‌కు హాస్యం కోస‌మే క‌మెడియ‌న్ల‌కు ఇలాంటి లోపాల్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింది. ఈ లోపాల‌తో వినోదాన్నే కాదు, హీరోయిజాన్నీ పండించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అభిమానులు కూడా మూస‌కు భిన్నంగా క‌నిపిస్తున్న త‌మ హీరోల క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఆమోదిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ 'రంగ‌స్థ‌లం'. ఇందులో రామ్ చ‌ర‌ణ్.. సౌండ్ ఇంజ‌నీర్ (చెవిటి) చిట్టిబాబుగా తెర‌పై చేసిన సంద‌డికి వ‌సూళ్ళ వ‌ర్షం కురుస్తోంది.  అలాగే గ‌త మూడేళ్ళుగా..  'రాజా ది గ్రేట్', 'మ‌హానుభావుడు', 'జై ల‌వ‌కుశ‌', 'ఊపిరి', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' వంటి చిత్రాల్లో క‌థానాయ‌కుల పాత్ర‌లు కూడా ఇలాగే రూపొంది ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. మొత్తానికి.. ఇప్పుడు ఇది ఓ ట్రెండ్‌లా మారుతోందని ఇప్ప‌టికే విడుద‌లైన సినిమాల‌తో పాటు రానున్న మ‌రికొన్ని సినిమాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. కాస్త గ‌తంలోకి వెళితే..

నాని కెరీర్‌ను మార్చివేసిన చిత్రం.. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' (2015). వ‌రుస ప‌రాజ‌యాల‌తో ట్రాక్ త‌ప్పిన నాని కెరీర్‌ను.. మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకు వ‌చ్చిన ఈ చిత్రంలో.. మతిమ‌రుపు ఉన్న యువ‌కుడిగా నాని పండించిన వినోదం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. త‌న మ‌తిమ‌రుపు వ‌ల్ల ఎదుటివారిని ఇబ్బందుల్లోకి ప‌డేసే ఈ పాత్ర‌లో నాని అభిన‌యం గుర్తుండిపోతుంది.

త‌ల త‌ప్ప మిగ‌తా శ‌రీర‌మంతా చచ్చుబ‌డిపోయి, వీల్ ఛైర్‌కే ప‌రిమిత‌మైన పాత్ర‌లో నాగార్జున క‌నిపించిన చిత్రం 'ఊపిరి' (2016). ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే మ‌రోవైపు కంట త‌డిపెట్టించే ఈ పాత్ర‌లో నాగ్ జీవించారు.

2017లో అయితే ఈ ర‌క‌మైన సినిమాలు మూడు.. 'జై ల‌వ‌కుశ‌', 'మ‌హానుభావుడు', 'రాజా ది గ్రేట్' వ‌చ్చాయి. 'జై ల‌వ‌కుశ' సినిమాలోని జై పాత్ర కోసం కొత్త లుక్‌లో క‌నిపించారు ఎన్టీఆర్‌. ముఖ్యంగా.. న‌త్తి ఉన్న ఆ పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు అభిమానుల‌నే కాదు స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను సైతం అల‌రించింది. ఇక ఓసీడీ (అతి శుభ్ర‌త‌) ఉన్న‌ యువ‌కుడి పాత్ర‌లో శ‌ర్వానంద్ న‌టించిన 'మ‌హానుభావుడు' వినోదాన్ని అందించ‌డ‌మే కాకుండా.. మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

ర‌వితేజ అంధుడిగా న‌టించిన 'రాజా ది గ్రేట్' కూడా వినోదానికి చిరునామాలా నిలిచింది. అంధ‌త్వం ఉన్నా.. దాన్ని లోపంగా తీసుకోకుండా ఆత్మవిశ్వాసంతో సాగే ఈ పాత్ర‌ని ర‌వితేజ చాలా ఈజ్‌తో చేసి.. చాన్నాళ్ళ త‌రువాత మంచి విజ‌యం అందుకున్నారు.

ఈ ఏడాది కూడా ఈ త‌ర‌హా పాత్ర‌లు తెర‌పైకి రానున్నాయి. తాజాగా విడుద‌ల అయిన 'రంగ‌స్థ‌లం' లో వినికిడి లోపం ఉన్న యువ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ చేసిన సంద‌డికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌న‌కున్న లోపంతో ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే.. మ‌రోవైపు అన్న‌ను చంపిన వారిపై ప‌గ తీర్చుకునే ఈ క్యారెక్ట‌ర్‌లో చ‌ర‌ణ్ జీవించేశార‌ని ప్రేక్ష‌కుల నుంచి సెల‌బ్రిటీల దాకా అంతా కొనియాడుతున్నారు.

ఇక మే నెల‌లో విడుద‌ల కానున్న 'రాజుగాడు' లో ఓ విచిత్ర‌మైన రుగ్మ‌త ఉన్న కుర్రాడిగా రాజ్ త‌రుణ్ సంద‌డి చేయ‌నున్నారు. ఇందులో క్లెప్టోమేనియా అనే జ‌బ్బున్న యువ‌కుడిగా రాజ్ క‌నిపించ‌నున్నారు. త‌న‌కు తెలియ‌కుండానే దొంగ‌త‌నం చేసేటువంటి విచిత్ర‌మైన పాత్ర ఇద‌ని ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌లో చూపించారు. ఇక ఉగాది రోజున ప్రారంభ‌మైన శ‌బ్దం' చిత్రం కోసం పూర్తిస్థాయి మూగ‌వాడి పాత్ర‌లో నారా రోహిత్ క‌నిపించ‌నున్నారు.

మొత్తానికి.. లోపం, జ‌బ్బు ఉన్న‌వాళ్ల‌ను త‌క్కువ‌గా చూడొద్ద‌నీ, వారు కూడా హీరోలేన‌నీ చెబుతూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నారు మ‌న క‌థానాయ‌కులు. వ‌ర్థ‌మాన హీరోలే కాకుండా స్టార్ హీరోలు కూడా ఈ పాత్ర‌ల వైపు మొగ్గు చూపుతుండ‌టం ఆహ్వానించ‌ద‌గ్గ‌ ప‌రిణామం.                             - మ‌ల్లిక్ పైడి

English Title
hero is changing in tollywood (special story)
Related News