ఎన్టీఆర్ కుమార్తెగా నితిన్ చెల్లెలు

Updated By ManamTue, 09/04/2018 - 14:41
NTR

Heroshini Komali ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్‌టిఆర్. బాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు ఇందూరి, బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి పాత్రలో కోమలి సిస్టర్ హిరోషినీ నటించనుంది. 

అంతేకాదు ఈ చిత్ర షూటింగ్‌లో కూడా తాను భాగం అయినట్లు ఆమె అధికారికంగా తెలిపింది. ఈ సందర్భంగా హిరోషినీ మాట్లాడుతూ.. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో తనకు అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొంది. అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో మిమిక్రీ షోలలో సందడి చేసిన హిరోషినీ.. ‘అ ఆ’ చిత్రంలో నితిన్ చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా.. రానా, సుమంత్, ప్రకాశ్ రాజ్, మంజిమా మోహన్, కల్యాణ్ రామ్, వెంకటేశ్, కీర్తి సురేశ్, అనుష్క, శ్రియ, మోహన్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Heroshini plays NTR's daughter role in N.T.R
Related News