ప్రగతి నివేదన సభకు లైన్ క్లియర్

Updated By ManamFri, 08/31/2018 - 11:49
High Court gives green signal for TRS Pragati nivedana sabha
High Court gives green signal for TRS Pragati nivedana sabha

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు లైన్ క్లియర్ అయింది. సభ నిర్వహణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ ఆపమంటూ న్యాయవాది పూజారి శ్రీధర్ నిన్న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా  సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్ వద్ద 25 లక్షల మందితో ప్రగతి నివేదన పేరుతో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ శ్రీధర్ కోర్టును ఆశ్రయించారు.

కాగా ప్రగతి నివేదన పేరుతో నిర్వహించునున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తి కావస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటుకు కావల్సిన పనులన్నీ యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్నారు. మంత్రులు. ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు కొంగరకలాన్‌లోనే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.

సభా ప్రాంగణంలో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, కటౌట్లు గుబాళిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ భారీ బహిరంగ సభకు 30 లక్షలపై చిలుకు జనాభా తరలిరానుండడంతో ఈ సభ  దేశ రాజకీయ చరిత్రలోనే పెను సంచలనం సృష్టించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోనికి ఎక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

భారీ బహిరంగ సభ లను నిర్వహించడం వెన్నెతో పెట్టిన విద్య అయిన టీఆర్‌ఎస్ పార్టీ ఈ ప్రగతి నివేదన సభను ఎన్నికలకు ముందు నిర్వహిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభకు అనుకున్న స్థాయిలో జనాభాను తరలించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సమాయత్తం అవుతున్నారు. కాగా సభా ప్రాంగాణాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోనికి తీసుకున్న పోలీసుశాఖ సభ జరుగబోయే రోజున 30 వేల మందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనుంది.

యుద్ధప్రాతిపాదికన పనులు పూర్తి
టీఆర్‌ఎస్ పార్టీ కొంగరకొలాన్‌లో నిర్వహించ నున్న భారీ బహిరంగ సభకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో సభా ప్రాంగణంలో పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తున్నారు. సభా వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు 500 మంది పార్టీ ముఖ్యులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తికాగా వర్షం వచ్చినా కుంగిపోకుండా ఉండేందుకు గట్టిదనం కోసం సభా వేదికను రెండు అడుగుల ఎత్తు వరకు కాంక్రీట్‌తో నిర్మించారు.

సుమారు 500 గజాల్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వర్షం వచ్చినా తడిచేందుకు వీలు లేకుండా వాటర్ ప్రూఫ్ సూపర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభా ప్రాంగణంలో 70 వేల కుర్చీలతో పాటు 50 లక్షల మీటర్ల గ్రీన్ కార్పేంట్‌ను వేస్తున్నారు. సభకు వచ్చే తరలివచ్చే వారి సంఖ్య లక్షల్లో ఉండబోతున్నందున ఫోన్లలో సిగ్నల్  సమస్య తలెత్తకుండా ఎయిర్‌టెల్, రిలయన్స్, ఐడియాతో పాటు ఆయా నెట్‌వర్క్ సంస్థలు హై ఫ్రీక్వెన్సీని పెంచారు. సీఎం కేసీఆర్ ప్రసగించే సభా స్థలి ముందు భాగంలో బందోబస్తు కోసం బారికేడ్లను నిర్మించారు. సీఎం కేసీఆర్ సభకు హెలికాప్టర్‌లో చేరుకోనున్నందున సభ వేదిక వెనక వైపు హెలిప్యాడ్ నిర్మించారు.

హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రత్యేక కాన్వాయ్‌లో సీఎం సభా వేదిక మీదకు చేరుకునేలా ఏర్పాట్లను సిద్ధం చేశారు. 1600 ఎకరాల భూమిని ప్రగతి నివేదన సభకు కేటాయించగా కొంగ రకలాన్ కలెక్టరేట్ పక్కన 480 ఎకరాల్లో ప్రగతి నివేదన సభ పరిసరాలు జాతరను తలపించనున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ కటౌట్లు, బెలూన్లు దర్శనమిస్తుడడంతో టీఆర్‌ఎస్ నాయకత్వంలో ఉత్సాహం మరింత రెట్టింపయింది.

English Title
High Court gives green signal for TRS Pragati nivedana sabha




Related News