తొలి మ్యాచ్‌లో భారత్‌తో హాంకాంగ్ చైనా ఢీ

Updated By ManamMon, 07/16/2018 - 23:28
ASIA-GAMES
  • ఆసియా గేమ్స్ హాకీ షెడ్యూల్ విడుదల

ASIA-GAMESన్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు తన టైటిల్ డిఫెన్స్‌ను పసికూన హాంకాంగ్ చైనాతో ప్రారంభించనుంది. ఇండోనేషియాలో వచ్చే నెల 22 నుంచి జరగనున్న ఆసియా కప్ హాకీ టోర్నీ షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. పురుషుల విభాగం గ్రూప్-ఎలో భారత్‌తో పాటు కొరియా, జపాన్, శ్రీలంక, హాంకాంగ్ చైనా జట్లు ఉండగా.. గ్రూప్-బిలో మలేసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఒమన్, థాయ్‌లాండ్, ఆతిథ్య ఇండోనేషియా జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ తర్వాత ఆగస్టు 24న జపాన్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. తర్వాత 26న కొరియాతో, 28న శ్రీలంకతో తలపడుతుంది. ఇక మహిళల విభాగానికొస్తే.. గ్రూప్-బిలో భారత్‌తో పాటు కొరియా, థాయ్‌లాండ్, కజకిస్థాన్, ఇండోనేషియా జట్లు ఉన్నాయి. గ్రూప్-ఎలో చైనా, జపాన్, మలేసియా, హాంకాంగ్ చైనా, చైనీస్ తైపీ జట్లు తలపడతాయి. ఆగస్టు 19న ఇండోనేషియాతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ మహిళల జట్టు పోరు ప్రారంభమవుతుంది. తర్వాత 21న కజకిస్థాన్‌తో, 25న కొరియాతో, 27న థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. హాకీ చరిత్రలోనే ఈసారి చాలా జట్లు బరిలోకి దిగనున్నాయి. 14 దేశాలకు చెందిన 21 పురుష, మహిళల జట్లు ఆడబోతున్నాయి. 14 రోజుల పాటు కొనసాగే ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన పురుష, మహిళల జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లన్నీ జకార్తాలోని గెలోర బంగ్ కర్నో (జీబీకే) స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. పురుషుల 25 మ్యాచ్‌లు, మహిళల 20 మ్యాచ్‌ల అనంతరం 29 నుంచి వర్గీకరణ మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ఫైనల్ ఆగస్టు 31న జరగనుండగా.. పురుషుల ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 1న జరుగుతుంది. తొలిసారిగా ఈ గేమ్స్‌లో వీడియో  రెఫరల్ సిస్టమ్‌ను ప్రవేశ పెడుతున్నారు. 

Tags
English Title
Hong Kong with China in the first match
Related News