డబ్బులు పోయాయా.. ఎందుకు.. ఎలా?

money
  • బ్యాంకు ఖాతాలో సొమ్ము ఉన్నట్టుండి మాయం

  • మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నెలవారీ కోత

  • నిర్వహణ చార్జీల పేరుతోనూ మనకే వాతలు

  • ఏటీఎంల వాడకంలో తస్మాత్ జాగ్రత్త..!

  • ఖాతా బదిలీ.. లేదా రద్దు చేస్తేనే నయం

  • వేరే బ్రాంచిలో డబ్బులు వేసినా చార్జీలు

  • బ్యాంకు వినియోగదారులూ.. బహుపరాక్

రోజు రోజుకీ.. ఆర్థిక విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థికరంగాల సేవలూ పూర్తిగా వాణిజ్యపంథాను అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో వినియోగదారునిపై అదనపు ఆర్థికభారం పడుతోంది. సాధారణ ఖాతాలు నిర్వహించే వినియోగదారులూ లేనిపోని బ్యాంకు చెల్లింపుల విషయంలో నష్టపోతున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుంటేనే మంచిది. ఈ రోజుల్లో బ్యాంకు అకౌంట్ లేనివాళ్ళను వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. పేద, ధనిక, ఉద్యోగులు, కార్మికులు, చిన్నచితకా వ్యాపారస్తులు ఇలా అందరికీ బ్యాంకు ఖాతా ఉండటం అనివార్యమైంది. అయితే, మన ఖాతాలో అంతో ఇంతో మన ప్రమేయం లేకుండా డబ్బులు తగ్గిపోవడం.. ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇందుకు కారణం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడమే అని బ్యాంకులు చెబుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఏ పరిస్థితుల్లో బ్యాంకులు సర్వీసు ఛార్జీల రూపంలో కోత విధిస్తున్నాయి? ఆయా విషయాలు ఏంటో సమగ్రంగా తెలుసుకుందాం!!
ఇటీవల కాలంలో.. తమ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బుల విషయంలో ఖాతాదారులకు రకరకాల ఆందోళనలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. సర్వీస్ ఛార్జీల పేరుతో ఖాతాలోంచి కొంత డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంకులు లాగేసుకోవడంతో ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ఆయా బ్యాంకులు ‘నిర్వహణ ఛార్జీలు’ అంటూ సమాధానం చెప్పడం రివాజుగా మారింది. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందనేది ఖాతాదారులు తెలుసుకోవాలి. 

కనీస నిల్వలు ఉన్నాయా?!
తాజా పరిస్థితుల్లో బ్యాంకు పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఉంచడం తప్పనిసరి. లేకుంటే రుసుముల భారం తప్పదు. అంతేకాదు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు నిర్వహించినా కొంత రుసుము భరించాల్సిందే.. బ్యాంకులు తీసుకున్న ఈ నిర?యాలతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. అందుకే పెరిగిన సేవా రుసుములు భారం కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. 

పాతపద్ధతే.. కొత్తగా
బ్యాంకు పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకుంటే అపరాధ రుసుము విధించే విధానం ఎప్పటి నుంచో ఉంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో ఆంధ్రాబ్యాంకు, వైశ్యాబ్యాంకు ఇలా కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాలో కనీస నిల్వ అవసరం లేకుండా కొన్నేళ్లపాటు వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం దీన్ని తీసేశాయి. 

కనీస సగటు నిల్వ ఉండాల్సిందే! 
కొన్ని బ్యాంకులు, నెలవారీ సగటు నిల్వను (యావరేజ్ బ్యాలెన్స్), మరికొన్ని త్రైమాసిక సగటు నిల్వలను ప్రాతిపదికగా తీసుకుంటు న్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ కనీస సగటు నిల్వను పరిగణనలోకి తీసుకుంటుండగా, ఆంధ్రాబ్యాంకు మూడు నెలల సగటు నిల్వలను లెక్కిస్తోంది. 

రద్దే.. బెటర్!
ఉద్యోగం, వ్యాపారం మరే ఇతర కారణాలవల్లనో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారారనుకోండి. అప్పుడు పాత ఖాతాను నిర్వహించకుండా ఉండే సందర్భాల్లో దాన్ని రద్దు చేసుకోవడమే మంచిది. లేకుంటే ఆ ఎకౌంట్‌లో డబ్బులు వేసిన ప్రతిసారీ అనవసరంగా అపరాధ రుసుముల భారం భరించాల్సి ఉంటుంది.

ఏటీఎంలను ఎలా వాడాలి! 
ఏటీఎం లావాదేవీల విషయంలోనూ బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర నగరాల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. కాబట్టి, ఉద్యోగులు తమ జీతం రాగానే తమ పొదుపు ఖాతా నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని తన జీవిత భాగస్వామి, పిల్లల పేరుతో ఉన్న ఖాతాలోకి మళ్లించాలి. దీనికోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఖాతాలైతే నామమాత్రపు రుసుములు ఉంటాయి. అదే బ్యాంకు ఖాతాకు ఎలాంటి రుసుములూ ఉండవు. దీనివల్ల ఏటీఎం లావాదేవీలను గరిష్టంగా ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. ఎస్‌బీఐలో నెలవారీ సగటు నిల్వ రూ.25 వేల కంటే ఎక్కువ ఉన్నవారికి అపరిమిత లావాదేవీలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇలాంటి అవకాశం మీ బ్యాంకు కల్పిస్తోందా? లేదా అనే విషయం.. ఒకసారి మీ బ్యాంకు శాఖను సంప్రదిస్తే మంచిది. 

పట్టణ, గ్రామ ప్రాంతాల్లో అయితే? 
పట్టణం, గ్రామ ప్రాంతాల్లో పొదుపు ఖాతా ఉన్నవారు నెలవారీ సగటు నిల్వ రూ.1,000 ఉంచినా చాలు. చాలా బ్యాంకుల్లో ఇదే విధానం అమల్లో ఉంది. అంటే, ఒక్కరోజు రూ.30,000 లేదా రెండు రోజులపాటు రూ.15,000, నాలుగు రోజులపాటు రూ.8,000, ఎనిమిది రోజులపాటు రూ.4,000 ఉన్నా చాలు. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులూ కార్పొరేట్ శాలరీ అకౌంట్లను అందిస్తున్నాయి. ఈ తరహా ఖాతాల్లో ఎలాంటి సగటు నిల్వ అవసరం లేదు. పలు ప్రైవేటు బ్యాంకులు కనీస నిల్వ నిబంధన పాటించని ఖాతాదారులకు రూ.100 నుంచి రూ.600 వరకూ రుసుములు విధిస్తున్నాయి. 

Tags

సంబంధిత వార్తలు