విషాదాంతం: ప్రేమ.. పెళ్లి.. చావు!

Updated By ManamTue, 03/13/2018 - 17:48
marriage

marriageతేని: వారిద్దరికీ కొత్తగా పెళ్లైంది. కోటి ఆశలతో దాంపత్య జీవితానికి స్వాగతం పలికిన వారిని విధి వంచించింది. విలాసంగా గడపాలని వెళ్లిన వారిద్దరినీ విగతజీవులుగా మార్చింది. తమిళనాడులోని తేని జిల్లా కురంగణి పర్వత ప్రాంతంలోని అడవిలో రేగిన మంటల్లో చిక్కుకుని ఓ కొత్త జంట జీవితం విషాదాంతంగా ముగిసింది. పూర్తి వివరాల్లోకెళితే.. దివ్య(29), వివేక్(27) చిన్నప్పటి నుంచి స్నేహితులు. వారిద్దరి స్నేహం వారి వయసుతో పాటే పెరిగిపెరిగి ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అయినా సరే.. ప్రేమను చంపుకోలేని దివ్య, వివేక్ పెద్దలను ఎదిరించారు. దివ్య, వివేక్ చిన్ననాటి స్నేహితులు తమిళ్‌చెల్వన్, కణ్ణన్ ఈరోడ్‌లోని ఓ ఇంట్లో వీరిద్దరి పెళ్లిని ఘనంగా జరిపించారు. ఈరోడ్‌లోనే వీరిద్దరూ నివాసముంటున్నారు. హనీమూన్‌కు దుబాయ్ వెళ్లాలని ఈ కొత్త జంట ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈలోపు సరదాగా గడపాలని స్నేహితులతో కలిసి ఈ జంట కురంగణి పర్వతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. వీరు ట్రెక్కింగ్‌కు వెళ్లిన సందర్భంలోనే ఈ అటవీ ప్రాంతంలో మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న నవ దంపతులను మదురైలోని రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరి శరీరం 70శాతానికి పైగా కాలిపోయింది. వైద్యులు వీరిద్దరికీ ఐసీయూలో చికిత్సనందించారు. చికిత్స పొందుతూ వివేక్ సోమవారం మరణించాడు. దివ్య కాలిన గాయాలతో బాధపడుతూ మంగళవారం ఉదయం చనిపోయింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

English Title
How the Theni forest fire gave a tragic end to the love story of these newly-weds
Related News