మానవ మనుగడే మహాకవిత్వం

Updated By ManamMon, 09/24/2018 - 01:03
manabadi

badiనేను అనేక సమావేశాల్లో ముఖ్యంగా పాఠశాలలకెళ్ళినపుడు ఇలా చెబుతుంటాను. మేము, మా తరం 1960 ప్రాంతాల్లో జన్మించిన వారంతా దాదాపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివినవాళ్లమే. చదుకునేప్పుడే పుస్తకాల మీద పేరు, తరగతి, జి.ప.ఉన్నత పాఠశాల అని వ్రాసుకుంటుండేవాళ్ళం. ఇప్పుడు పెరిగిన తర్వాత జీవన యాత్రలో సుదీర్ఘంగా ప్రయాణించాక జి.ప. ఉన్నత పాఠశాలను నాకు తోచిన రీతిలో నిర్ణయించుకున్నాను ఇలా. జి.ప. ఉన్నత పాఠశాలంటే జీవితాన్ని పరిచయం చేసే ఉన్నత పాఠశాల. ఎలాగంటే ఈ ప్రతి పాఠశాల వెనుక ఒక పల్లె వుంటుంది. అది మట్టిని, మనిషితనాన్ని పరిచయం చేస్తుంది. సెలయేటిని, చెరువు గట్టుని, తోటను, దొడ్డిని, పాడియావును, పశు సంపదను చూసేలా ప్రకృతిలో మమేకమయ్యేలా చేస్తుంది. అత్త, మామ, తాత, అవ్వ, చిన్నాయన, పెదనాయన, మేనత్త లాంటి ఎన్నో వావి వరసలు గల బంధాల్ని ముడివేస్తుంది. కుమ్మరి, కుమ్మరి, గీతగాడు, మంగలి, చాకలి, నేతకాడు, వ్యవసాయదారుడు లాంటి ఎన్నో కుల వృత్తుల్ని స్పర్శించేలా అనుభవమిస్తుంది. ఇవన్నీ ఒక మనిషి తదనంతర జీవితంలో సంస్కారవంతమైన, బాధ్యతా యుతమైన పౌరులుగా మెలిగేందుకు కావాల్సిన అన్ని బీజాల్ని పిల్లల మెదళ్ళలో నాటుతుంది. ఇవాళ లక్షలు పోసి కొంటున్న కార్పొరేట్ విద్యావిధానంలో ఈ ‘జీవిత పరిచయం’ తప్పి పోతుంది. అందుకే అతి చిన్న చిన్న సంక్షోభాలు కూడా పరిష్కరిం చకోలేక సమస్యల చిక్కుముళ్లు విడదీసుకోలేక సతమతమై, చివరకు అర్థాంతరంగా బతుల్ని ముగించే పరిస్థితికి చేరుకుం టున్నారు. మట్టితో పరిచయ నిర్మాణం కలిగిన వారిలో ‘తడి’ కనిపిస్తుంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా వారు ఎంత తడిగా వుంటారో ఇట్టే తెలిసిపోతుంది. అది వారిలో సౌమ్యత, లాలిత్యం, సశీలత్వం, సున్నితత్వం, స్పందన గుణం లాంటి విశేషాలతో పరిమళిస్తుంటుంది. ఇలాంటి తడి హృదయం గల చిరకాల మిత్రలు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కవిత్వం ‘బడి’ గురించి తెలియచెప్పేందుకే ఈ ఉపోద్ఘాతం. అతనిది తడి హృదయ మనేందుకు పుస్తకం ఆరంభంలోనే ‘అదను కాలాలన్నా, పదను మేఘాలన్నా’, అని రెండు ఎద్దులుగా కాడిదున్నే మెట్టనేలల సేద్యమన్నా చెప్పలేనంత ఇష్టం అనడమే అందుకు సాక్ష్యం. 

    వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా ప్రవృత్తి రీత్యా కథకుడిగా, నవలాకారుడిగా, కవిగా మూడు దశాబ్దాలు ప్రయాణం చేసి తెలుగు సాహితీ లోకంలో సుస్థిర స్థానం సాధించుకున్న సున్నిత మనస్కుడు, గట్టి రైతు సన్నపురెడ్డి. కరువుసీమ రాయలసీమ అస్తిత్వాన్ని అనేక రకాలుగా తన రచనల్లో ప్రకటించిన ప్రతిభాశాలి. ఇన్నాళ్ళకు తన తొలి కవితా సంపుటి ‘బడి’ వెలువరించి కవిత్వంలో కూడా మొనగాడని సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, కబీర్ సమ్మాన్ గ్రహీత కె. శివారెడ్డి చేత భేష్ అనిపించుకున్నారు. నిజానికి 90వ దశకంలోనే ఇందులోని కవితలు పలు ప్రధాన దినపత్రికల సాహిత్య శీర్షికలలో ప్రచురించబడి శభాష్ అన్పించుకున్నావ్. ఏ రచన చేసినా మట్టి వాసన వేసేలా చేయడం ఈ రచయితకు వెన్నతో పెట్టిన విద్య. అతని నిరంతర ధ్యాస శ్వాస పల్లె, పొలం లాంటి వాటితో ముడిపడి వుండబట్టే. ఆయన అనుభవించింది, అనుభవిస్తున్నది పల్లెతనం కాబట్టే. కడప జిల్లాలో ఒక మారుమూల పల్లెలో కుటుంబం, పుస్తకం మాత్రమే లోకంగా జీవించే ఈ కవి పాండవ బీడు, సాలెగతె్త, తోలుబొమ్మలాట, చినుకుల సవ్వడి, లాంటి ఆవార్డు నవలల రచయితగా లోవిదితుడు. బోధన, సాహిత్య సాధన రెండు కళ్లుగా కలిగి సామాజిక ప్రయాణం చేస్తున్నాడు. ఈ కవిత్వ సంపుటి ద్వారా ఆయన జీవితం, ఆయన ప్రాంతంలోనే మనల్ని విహరింపచేస్తాడు. ఆ జీవితంలోని తాజాతనాన్ని మనల్ని ఆస్వాదింప చేస్తాడు. జ్ఞాపకాల మట్టి పరిమళం మనకు అద్దుతాడు. బడి చుట్టూ పల్లె చుట్టూ ముడిపడివున్న పదాల గుభనంతో కవితమై అలరిస్తాడు. పుస్తకం చదివినంత సేపు మన్ను కాలాన్ని చాక్లెట్లులా చప్పరించే బడి పిల్లల్ని చేస్తాడు. రండి మీరు, నేను, మనం పొలం పలక మీద నాగలి బలపాన్ని దిద్దిన వాళ్ళను, పల్లెను చిత్రించిన వాళ్ళను ఒకేసారి దర్శించి ధన్యులమవుదాం! జోలపాడి లాలించే అమ్మ ఒడి మరోసారి చేరుదాం!!
పెరుగు రామకృష్ణ 
98492 30443

Tags
English Title
Human survival is great
Related News