అన్నా నిరశన

Updated By ManamWed, 03/28/2018 - 01:37
anna hajare

సామాజిక కార్యకర్త కిసాన్ బాబూరావ్ హాజరే అలియాస్ అన్నా హజారే ఏడేళ్ల తర్వాత అదే రామ్‌లీలా మైదానంలో మళ్లీ నిరవధిక నిరశన దీక్షకు సిద్ధమయ్యారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి దీక్షకు ఉపక్రమించగా, మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధి గ్రామస్తులు అనూహ్య రీతిలో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి తమ మద్దతు తెలి పారు. 2011లో ఇదే రాంలీలా మైదానంలో లోక్‌పాల్ లేదా జాతీయ స్థాయి అంబుడ్స్‌మన్ (తీర్పరి వ్యవస్థ)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో యూపీ ఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అన్నా దీక్షకు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. అయితే ఆనాడు పరోక్షంగా మద్దతు ఇచ్చిన బీజేపీ సారథ్యంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం హజారే డిమాండ్ల పరిష్కార సాధన కోసం కృషిచేయకపోగా దీక్షను అన్నివిధాల అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రామ్‌లీలా మైదానానికి తరలివస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి రైళ్ళను రద్దుచేయడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను అడ్డు కొని హజారే దీక్షకు పెద్దగా ప్రజా మద్దతు లేదనే వాతావరణాన్ని సృష్టిం చేందుకు మోదీ ప్రయత్నం శతథా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అవినీతి కేసులు పెచ్చు పెరిగిపోతున్నప్పటికీ లోక్‌పాల్ నియమించకుండా మోదీ ప్రభుత్వం జాప్యం చేస్తుండడమేకాక, రాష్ట్రాల్లో లోకా యుక్తలను ఏర్పాటు చేసే ప్రక్రియను నిర్వీర్యం చేస్తోంది. అదేవిధంగా 2014 ముందు స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ దాని ఊసే ఎత్తకపోవడంతో వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రతరమై రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వ్యవసాయ సంక్షో భాన్ని పరిష్కరించే డిమాండ్లతో మహారాష్ట్ర రైతాంగం ఇటీవల నిర్వహించిన లాంగ్ మార్చ్ నిరసన ప్రదర్శన సహా దేశవ్యాప్తంగా అనేకచోట్ల అన్నదాతలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిటీ సిఫా రసులను అమలుచేయాలని హజారే తలపెట్టిన నిరశన దీక్ష అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. 

గత ఆగస్టులోనే అన్నా హజారే తన డిమాండ్లు ప్రభుత్వానికి విన్నవిస్తూ లేఖలు రాశారు. 2013లో యూపీఏ ప్రభుత్వం లోక్‌పాల్-లోకాయుక్త చట్టం చేయడం, ఇప్పటివరకూ వాటి నియామకాలు జరగకపోవడంతో గతంలో మాదిరిగానే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని సృష్టించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి హజారే దీక్ష ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇదివరకటిలా సుప్రీంకోర్టు చొరవ చూపి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించే విషయం ప్రభుత్వం పరిధిలో ఉన్నవే అయినప్పటికీ అవి భస్మాసుర హస్తాల్లాగా తమను దహించి వేస్తాయని యూపీ ఏ, ఎన్డీఏ పాలకులు భయపడటం మూలాన అవి మూలన పడిన విషయం తెలిసిందే. అదే సమయంలో అవినీతి పరులైన ప్రజాప్రతినిథులను తిరస్క రించే, వెనక్కు పిలిపించే హక్కును కల్పిస్తూ ఎన్నికల సంస్కరణలు రూపొం దించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, కమిషన్ ఫర్ అగ్రి కల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ)కి రాజ్యాంగ హోదాను, ప్రత్యేక ప్రతి పత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ అత్యంత సముచితమైనది. వ్యవసాయ సంక్షోభం కారణంగా దేశ రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఆత్మహత్యల బాట నుంచి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించే దిశగా పరిణామం చెందుతున్నా యి. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్ల మాట ఎలా ఉన్నా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్న డిమాండ్‌పై అన్నా హజారే నిరవధిక నిరశన దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే ఉద్యమించేందుకు సన్నద్ధమవు తున్న రైతులు ప్రేక్షకులుగా మారే ప్రమాదం ఉంది.

గతంలో బ్రిటిష్ సామ్రా జ్యవాద వ్యతిరేక ప్రజాపోరాటం తీవ్రతరమైన ప్రతి సందర్భంలోనూ గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం దేశం దృష్టిని తనవైపు మరల్చడంతో ప్రజా గ్రహాన్ని సద్దుమణిగిన చారిత్రక అనుభవమే హజారే ఉద్యమంలో పునరా వృత్తమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే పునరావృత్తమయ్యే ప్రతి చారిత్రక సందర్భం తొలిసారి విషాదాంతంగాను, మలిసారి ప్రహసనంగా మారుతుం దనేది చారిత్రక నియమం. హజారే ఉద్యమంలో నిజాయితీ లేదని కాదు, అవి ఉద్యమించవలసిన అవసరం లేని డిమాండ్లనీ కాదు. అయినప్పటికీ ఒక మిలి టెంట్ రైతాంగ ఉద్యమం పురుడుపోసుకుంటున్న సమయంలో హజారే తల పెట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఉద్యమాన్ని మోదీ ప్రభుత్వం ఒక చారిత్రక ప్రహసనంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. హజారే దీక్ష ఏ మేరకు కేంద్రంలో కదలిక తీసుకురాగలదన్నది సమస్య కాదు, దానికి మద్దతుగా, సమాంతరంగా దేశవ్యాప్త కర్షక, కార్మిక, ప్రజాస్వామిక ఉద్యమాలు ఉనికిలోకి వస్తే మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పదు.

English Title
Hunger strike of anna hajare
Related News