అవెురికాకు మరో విపత్తు

Updated By ManamSun, 10/08/2017 - 18:33
hurricane nate
  • ముంచెత్తిన నేట్ హరికేన్.. కేటగిరి-1 తుఫానుగా గుర్తింపు

  • పెనుగాలులు,కుండపోత వర్షాలు.. 28 మంది మృతి

న్యూఆర్లిన్స్(యూఎస్), అక్టోబరు 8: వరుస విపత్తులతో అవెురికా అతలాకుతలం అవుతోంది. హరికేన్లు ఒకదాని తర్వాత మరోటి ప్రజలను వణికిస్తున్నాయి. ఒక తుఫాను దాటిపోయింది.. ఇక నిశ్చింతగా ఉండొచ్చని అనుకునేలోగానే మరోటి వచ్చిపడుతోంది. బాధితులను కోలుకోలేకుండా దెబ్బతీస్తున్నాయి. మొన్న ఇర్మా, నిన్న మరియా.. ప్రస్తుతం నేట్ తుఫాను మధ్య అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ హరికేన్ ప్రభావంతో గంటకు 140 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వరద నీరు పోటెత్తింది. మిసిసిపి సహా పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. తుఫాను కారణంగా ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం నేట్ హరికేన్‌గా మారి గల్ఫ్ తీరం దిశగా పయనించడంతో లూసియానా, మిసిసిపి, అలబామా రాష్ట్రాలను మయామి జాతీయ తుఫాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ సూచనల మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు జారీ అయ్యే సూచనలను పాటించాల్సిందిగా అభ్యర్థించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ సూచించారు. మిగతా ప్రదేశాల్లో ఉన్నవారు కూడా రెండు మూడు రోజులకు అవసరమయ్యే వంట దినుసులు, ఇతర నిత్యావసరాలను సిద్ధం చేసి పెట్టుకోవాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి నేట్ తీవ్రరూపం దాల్చడంతో పలుచోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో సాయంత్రం 7 గంటల నుంచి అత్యవసర స్థితిని విధించారు. నేట్‌ను కేటగిరీ-1 తుఫానుగా అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తత ప్రకటించారు. లూసియానాలోని మిసిసిపి నది వద్ద నేల భారీగా కోతకు గురైంది. నదీ తీరంలోని బిలాక్సో వద్ద కూడా భారీగా నేలకోతకు గురైంది. ఇప్పటికే లూసియానా, మిసిసిపి, అలబామా, ఫ్లోరిడాలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నికరాగ్వలో వర్షాల కారణంగా పలువురు మృతి చెందారు. మరికొంతమంది నీటిలో గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. నేట్ హరికేన్ వేగంగా కదులుతోందని వాతావరణ శాస్త్రజ్ఞు లు చెబుతున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. మరోపక్క లూసియానా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. నేట్ అత్యధికంగా ప్రభావం చూపించే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అమెరికా ఇంధన రవాణాకు కీలక ప్రాంతం. ఇక్కడి నుంచే చమురు ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం నేట్ హరికేన్ కారణంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించింది. 

English Title
hurricane nate land fall in US
Related News