బీమాకు రైడర్స్ తోడైతే...

Updated By ManamSun, 09/23/2018 - 22:38
insurance riders
  • చెల్లిపు తక్కువ ఎక్కువ.. అనుకోని ప్రమాదాలకు అండగా రైడర్స్

బీమా పాలసీలంటేనే పాలసీదారుడికి, అతడి కుటుంబానికి ఆపద సమయంలో ప్రయోజనాలను అందించే పథకాలని ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. మరి ఈ మధ్య కాలంలో పాలసీలకు తోడు రైడర్స్ అనే మాట ఎక్కువగా వింటున్నాం. అసలీ రైడర్స్ అంటే ఏమిటీ? వాటితో ప్రయోజనాలు ఎలా ఉంటాయి? వంటి సందేహాలకు సమాధానం చూద్దాం.. సంప్రదాయ బీమా పాలసీకి అనుబంధంగా, దానికి అదనంగా స్వల్పమొత్తంలో చెల్లింపు చేస్తూ వస్తుంటే, అసలు పాలసీకి దక్కే ప్రయోజనాలతోపాటు అదనపు లాభాలను, రక్షణని అందించేవే రైడర్స్

image

 

 

అవసరమేంటీ? 
బీమా, ఆరోగ్య బీమాపాలసీలంటేనే అనుకోని ప్రమాదం, అనారోగ్య సమయాల్లో ఆపద్బంధువుగా ఆదుకునేవి. అయితే ఇవి అన్ని సమయాల్లోనూ పాలసీదారుడికి నూరు శాతం అక్కరకు రావు. తీవ్రమైన ప్రమాదాలు, మరణం సంభవించినప్పుడే ఆయా పాలసీల ప్రయోజనం సంపూర్ణంగా అందుతుంటుంది. కానీ ‘రైడర్’ తోడైతే యాక్సిడెంట్ డెత్ అడిషనల్ కవర్, డిజేబిలిటీ కవర్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్, హాస్పిటలైజేషన్ కవర్ వంటి ప్రయోజనాలు అదనంగా చేరతాయి. దీనివల్ల అనుకోని సందర్భాల్లో రైడర్‌తో కూడిన బీమా పాలసీ రక్షణగా ఉందనే భరోసా ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి అనుగుణంగా జీవిత పాలసీలకు ఏ రైడర్‌ని ఎంచుకుంటే బావుంటుందో పరిశీలించి, రైడర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. 

తక్కువ చెల్లింపుతో అధనపు లాభాలు
సాధారణ బీమా పాలసీలతో పోల్చితే రైడర్లపై చెల్లించాల్సిన ప్రీమియంలు చాలా నామినల్ (స్వల్పం)గానే ఉంటాయి. అసలు బీమా పాలసీ కాలపరిమితికి సమానంగా రైడర్లకు చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. వ్యక్తిగత జీవితానికి తగ్గట్టుగా ఫలానా కాలంలో రైడర్స్ ఉండాలి. ఫలానా సమయంలో పెద్దగా అవసరం ఉండదు.. అని బేరీజు వేసుకుని, రైడర్స్‌ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. 

అదనంగా ఇచ్చేదేమి?
ఎల్‌ఐసీతో సహా అనేక బీమా కంపెనీలు రైడర్లను వివిధ రూపాల్లో ఖాతాదారులకు అందిస్తున్నాయి. మన వైద్య, ఆరోగ్య, జీవితావసరాలకు అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వాటిల్లో ముఖ్యంగా యాక్సిడెంటల్ రైడర్స్, హెల్త్ రైడర్స్, టెర్మ్ రైడర్స్, ప్రీమియం రద్దు రైడర్స్, ట్యాక్స్ రైడర్స్ ఇలా అనేక పేర్లతో అయా బీమా కంపెనీలు రైడర్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. 

చాయిస్ మీదే..!
బీమా పాలసీలంటేనే వయసు, ఆరోగ్యాన్నిబట్టి ఏ పాలసీ అనువుగా ఉంటుందో చూసుకుని, ఎంపిక చేసుకోవాలి. ఆయా కంపెనీలు కూడా ఖాతాదారుడు కోరుకునే బీమా పాలసీలను ఇబ్బడిముబ్బడిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు. వయసు పైబడిన వారికి బీమా పాలసీలు ఇవ్వడానికి అనేక ఆరోగ్యపరమైన నియమ, నిబంధనల్ని పరిగణనలోకి తీసుకుంటాయి. అవన్నీ తృప్తికరంగా ఉంటేనే ఖాతాదారుల్ని ప్రోత్సహిస్తాయి. రైడర్స్ విషయంలోనూ అలాంటి కఠిన నిబంధనలు పెద్దగా ఉండకపోయినాగానీ వయసు అవసరాలు, జీవనశైలి, లైఫ్‌స్టైల్ అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఇలా అనేక ఆరోగ్య, వైద్య అంశాలను పరిగణనలోకి తీసుకుని, అందుకుతగ్గ అదనపు ప్రయోజనాలు కలగడానికి రైడర్స్ బాగా ఉపయోగపడతాయి. అందుకోసం బీమా పాలసీలు తీసుకునేటప్పుడు రైడర్ గురించి మరీ అడిగి, వాటిని జోడించి బీమా అదనపు బలం సమకూర్చుకోండి!!

 

English Title
If insurance is with riders ...
Related News