చల్లారని అసమ్మతి

Updated By ManamWed, 10/24/2018 - 03:57
TRS
  • ఏండ్లుగా పనిచేస్తున్నా.. గుర్తించరా..

  • టీఆర్‌ఎస్ నేతల్లో పెరుగుతున్న ధిక్కారం

  • కొత్తగా చేరుతున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన

trsహైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఇంకా అసమ్మతి చల్లారనే లేదు. 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన వెంటనే అసమ్మతి జ్వాల రాజుకుంది. టికెట్ దక్కని నేతలంతా అధిష్టానంపై ఇంకా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లే కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన తమకు కాదని బయటినుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే, ఎట్లా అంటూ హై కమాండ్‌ను నిలదీస్తున్నారు.టికెట్టు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేకుంటే పార్టీ ఆభ్యర్థిని ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. మరికొందరైతే పార్టీపై తిరుగుబావుటా చేశారు. తాజగా పార్టీ సస్పెండ్ చేసిన రాములు నాయక్‌తో పాటు, గాలి అనిల్ కుమార్, కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, గణేష్ అప్పాల, రమేష్ రాథోడ్, సత్యవతి రాథోడ్, బాబుమోహన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ ఆరీఫ్ ఇక్భాల్ వంటి నేతలంతా పార్టీ నుంచి ఏదోక కారణంతో భయటకు వెళ్ళిన వారే. అధిష్టానంపై తిరుగుబాటు చేసిన వారే. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి పార్టీలో అసమ్మతి రాజుకుంటూనే వుంది.  కొంత మంది అసంతృప్తులను అధిష్టానం పిలిపించుకుని బుజ్జగించింది. ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వంటి నేతలు  అసమ్మతి నేతలను బుజ్జగించినా ఫలితం లేకపోయింది. అయితే, అలకబూనిన నేతల్లో...పార్టీ పుట్టిన దగ్గరినుంచి పని చేస్తున్న వారు కొందరుంటే...ఇంకొందరు నేతలు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారున్నరూ. మరికొందరిని గత ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలో చేర్చుకున్నారు. ఏదోక కారణంతో టికెట్ దక్కని వారిలో చొప్పదండి నుంచి బోడిగె శోభ, చెన్నూరు నుంచి నల్లాల ఓదేలు, మేడ్చల్ నుంచి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి కనకారెడ్డి వంటి నేతలున్నారు.  ఇదిలా ఉంటే... సిట్టింగ్ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. తాండూర్‌లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డ ఇలాకాలోసహా మేడ్చల్, చెన్నూర్, జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, వైరా, సత్తుపల్లి, తుంగతుర్తి, ఉప్పల్, ఆందోల్, కూకట్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, నల్లగొండ, దుబ్బాక, మిర్యాలగూడ, రాజేంద్రనగర్, బంజారహిల్స్, జూబ్లిహిల్స్, ఖుత్బుల్లాపూర్,వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాలపల్లి, మహబూబబాద్, అచ్చంపేట, చొప్పదండి, మానకొండూర్, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, గోషామహల్, ఇల్లందు, పాల్వంచ, మునుగోడు,ఆలేర్, కొత్తగూడెం వంటి నియోజక వర్గాల నుండి పెద్ద ఎత్తున తీవ్రంగా నిరసనలు చెలరేగుతున్నాయి. 

నెలన్నర క్రితమే మొదలైన ఈ అసమ్మతి సేగలు టీఆర్‌ఎస్‌ను  వీడెలా లేదనిపిస్తోంది.  పార్టీ వీడే ముందు మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అధిష్టానంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారి అనంతరం తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బలే ఎక్కువగా తగిలాయి. మరికొందరు కూడా అధిష్టానంపై తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారని టికెట్ అశించి భంగపడ్డ వారి దగ్గరి అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు చెప్తున్నారు. ప్రచారానికి వెళ్లిన నేతలను అడ్డుకున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయా స్థానాల్లో ఇప్పటికైనా వారిని మార్చాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. టికెట్టు ఆశించిన భంగపడ్డ నాయకులు తమ అనుచరగణంతో పలు చోట్లా ఆందోళనలను చేయించిన ఘటనలు టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారాయి. పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా ఉంటున్న తమకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంపై అసంతృప్తిలో ఉన్నారు. రాజకీయంగా జీవితం ఇచ్చిన వారికి పూర్తి అండగా, ఉంటూ తమకు కూడా అవకాశం వచ్చినప్పుడు సీటు ఇస్తారని...తమకు ఓ మంచి భాట చూపిస్తారనుకున్నాం..కానీ, ఇన్నేళ్లు పార్టీలో పని చేశాక మాలాంటి వారిని పక్కన పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని కొందరు నేతలు అధిష్టానాన్ని నేరుగానే ప్రశ్నిస్తున్నారు.

Tags
English Title
Indefatigable disagreement
Related News