ద్రవ్యోల్బణంలో స్వల్ప క్షీణత

Updated By ManamMon, 02/12/2018 - 21:57
India’s inflation

India’s inflationన్యూఢిల్లీ: కూరగాయలు, పండ్లు, ఇంధన కంపొనెంట్ల ధరలు సడలడం వల్ల జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతానికి తగ్గింది. వినియోగదార్ల ధరల సూచి (సి.పి.ఐ) ఆధారంగా దీన్ని లెక్కగడతారు. ద్రవ్యోల్బణం 2017 డిసెంబరులో అప్పటికి 17 నెలల్లో ఎన్నడూ లేనంత గరిష్ఠంగా 5.21 శాతంగా ఉంది. దాన్నుంచి జనవరిలో అది స్వల్పంగా 5.07 శాతానికి తగ్గింది. గత ఏడాది జనవరిలో ద్రవ్యోల్బణం 3.17 శాతంగా మాత్రమే ఉంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదల రేటు డిసెంబరులో ఉన్న 4.96 శాతం నుంచి జనవరిలో 4.7 శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సి.ఎస్.ఓ) విడుదల చేసిన డాటా వెల్లడించింది. కూరగాయల ద్రవ్యోల్బణం డిసెంబరులో 29.13 శాతంగా ఉన్నది జనవరిలో స్వల్పంగా తగ్గి 26.97 శాతంగా ఉంది. పండ్ల ధరలు కూడా జనవరిలో స్వల్పంగా 6.24 శాతం పెరిగాయి. అవి డిసెంబరులో 6.63 శాతంగా నమోదయ్యాయి. ఇంధనం, లైట్ల విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.90 శాతంగా ఉన్నది గత నెలలో 7.73 శాతానికి స్వల్పంగా తగ్గింది. ఎన్.ఎస్.ఎస్.ఓకు చెందిన క్షేత్రస్థాయి కార్యకలాపాల విభాగం ఎంపిక చేసిన పట్టణాలు, తపాలా శాఖ ఎంపిక చేసిన గ్రామాల నుంచి ధరల డాటా సేకరించారు. 

English Title
India’s inflation in January eases to 5.07%, IIP for December at 7.1%
Related News