తప్పుల తడకగా ఐఓఏ సన్మాన సభ

Updated By ManamSun, 09/23/2018 - 23:24
 Rajyavardhan Singh
  • క్షమాపణ కోరిన అధ్యక్షుడు నరేంద్ర బాత్రా  

imageన్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను నగదు పురస్కారంతో సన్మానించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) భావించింది. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ సన్మాన సభలో అనేక తప్పులు దొర్లాయి. అథ్లెట్లకు అందించే చెక్‌లపై పేర్లు తప్పులుగా ఉండటంతో కేవలం బొకేలతో సరిపెట్టారు. కాంపౌండ్ ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, అభిషేక్ వర్మలతో పాటు దాదాపు 15 మంది అథ్లెట్ల పేర్లు ఆ చెక్‌లపై తప్పుగా ప్రింట్ అయింది. టీమ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన వారికి రూ. 3 లక్షలు, రజతం గెలిచిన వారికి రూ. 2 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ. 1 లక్ష ఇస్తున్నట్టు ఐఓఏ ప్రకటించింది. వ్యక్తిగత విభాగాల్లో పతకాలు సాధించిన వారు రూ. 5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షలు అందుకున్నారు. ‘ముందుగా జరిగిన తప్పుకు క్షమాపణ కోరుతున్నాను. దా దాపు 14 నుంచి 15 మంది అథ్లెట్ల పేర్లు చెక్‌లపై తప్పుగా ప్రింట్ అయ్యాయి. అందుకే బొకేలతో సరిపెట్టాం. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి చెక్‌లు వారికి అందుతాయి. తప్పుడు పేర్లతో ఉన్న చెక్‌లను అందించడం నాకు ఇష్టం లేదు’ అని ఐఓఏ అధ్యక్షుడు నరేంద్ర బాత్రా అన్నారు. మరో దారుణమైన సంఘటన ఏంటంటే.. కాంస్య పతకం గెలిచిన రెజ్లర్ దివ్య కక్రన్ పేరును నిర్వాహకులు మర్చిపోయారు. ఈ సన్మాన సభ ముగిసిన తర్వాత కక్రన్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాత్రా దృష్టికి తీసుకెళ్లారు. 

అప్పటికే కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వేదిక వదిలి వెళ్లిపోయారు. ‘మేము మా కూతురు పేరు కూడా ఇచ్చాం. కానీ ఆమె పేరు జాబితాలో లేదని వారంటున్నారు. ఏం జరిగిందో తెలియడం లేదు’ అని కక్రన్ తల్లి మీడియాతో చెప్పారు. ‘తొలిసారి ప్లేయర్స్ అద్భుత ప్రతిభ కనబరిచారు. దీంతో ప్లేయర్స్‌కు నగదు పురస్కా రాలిచ్చి వారిని ప్రోత్సహించాలనుకున్నాం. ఒక ముందు కూడా ఒలింపిక్స్‌లో గానీ, కామన్వెల్త్ గేమ్స్‌లో గానీ, ఆసియా గేమ్స్‌లో గానీ పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సహకాలు ఇస్తాం’ అని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా చెప్పారు. ప్లేయర్స్‌కు ఈ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు స్పాన్సర్లు నిధులు సమకూర్చారని ఆయన చెప్పారు. అయితే సన్మాన కార్యక్రమానికి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, టెన్నిస్ ప్లేయర్స్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేష్ పొగట్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ రాలేకపోయారు. 

English Title
IOA Sanmana sabha
Related News