అది నిజంగా శోచనీయం!

Updated By ManamTue, 02/13/2018 - 23:04
supreme-court
  • దోషి పార్టీ అధిపతిగా కొనసాగడమేమిటి?

  • అభ్యర్థులను ఎంపిక చేయడం అసమంజసం

  • ‘పిల్’ విచారణలో సుప్రీం కోర్టు ధర్మాసనం

supreme-courtన్యూఢిల్లీ: దోష నిరూపణవల్ల ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హులైన నాయకులు రాజకీయ పార్టీల అధిపతులుగా కొనసాగడం శోచనీయమని సుప్రీం కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. అంతేగాక ఎన్నికల తర్వాత పాలనలో భాగస్వాములు కాగల అభ్యర్థులను ఎంపిక చేయడం చింతించాల్సిన అంశమని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టులో దోషులుగా ప్రకటితులైన నాయకులు పార్టీ అధిపతులుగా వ్యవహరించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణలో ఈ మేరకు ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తమ న్యాయవాది అమిత్‌శర్మ ద్వారా ఈ వ్యాజ్యానికి మద్దతివ్వడం విశేషం. కమిషన్ 1998 నుంచి ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ నేరచరిత నేతలను నిషేధించే తిరుగులేని అధికారం దానికి లేదని శర్మ ఈ సందర్భంగా ధర్మాసనానికి వివరించారు. పార్లమెంటులో రాజ్యాంగాన్ని సవరించి అటువంటి నిబంధనను ప్రవేశపెడితే దాని అమలుకు కమిషన్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను కాపాడాల్సిందే
స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియ నుంచి అవినీతి నిర్మూలన అన్నది చట్టానికిగల అంగీకృత లక్ష్యమని ధర్మాసనం ఆయనతో ఏకీభవించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన వరుస తీర్పులే ఈ లక్ష్యం విస్తరణకు గీటురాళ్లని పేర్కొంది. ‘‘వ్యక్తిగతంగా ఎన్నికల్లో పోటీనుంచి నిషేధితులైనందున వారు ఏదో ఒక పార్టీ అధినేత హోదాలో అభ్యర్థులను సామూహికంగా ఎంపిక చేయడానికి అనుమతించరాదు’’ అని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఓ కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనను తోసిపుచ్చుతూ లోగడ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉటంకించింది. దీని ప్రకారం దోషిగా తేలిన ఎంపీ లేదా ఎమ్మెల్యే సదరు తీర్పును ఎగువ కోర్టులో సవాలు చేస్తే పదవిలో కొనసాగవచ్చు. తదనంతరం కాలంలో ఈ రక్షక నిబంధనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ప్రస్తుతం దోషులుగా నిరూపితులైన ప్రజా ప్రతినిధులకు రెండేళ్లు అంతకుమించి శిక్ష పడినట్లయితే అనర్హత తక్షణం అమల్లోకి వస్తుంది. దీని ఆధారంగా ఇలాంటివారిని పార్టీ అధినేతలుగా కొనసాగించరాదని, వారు అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని నిషేధించాలని కోరుతూ నిరుడు డిసెంబరులో తాజా ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆ సందర్భంగా ‘‘కోర్టులు ఎంతవరకని ముందుకెళ్లగలవు? ప్రభుత్వం, పార్లమెంటు ఈ విషయంపై దృష్టి సారించాలి. దోషిగా తేలిన నాయకుడు పార్టీకి నాయకత్వం వహించకుండా మేం ఆపగలమా? వాక్ స్వాతంత్య్రానికి ఇది భంగకరం కాదా? దోషముద్ర పడినంతమాత్రాన వారు రాజకీయ అభిప్రాయాలను ప్రచారం చేసుకోకుండా కోర్టు నిరోధించగలదా?’’ అని ఇదే ధర్మాసనం ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఓంప్రకాష్ చౌతాలా, వి.కె.శశికళ వంటివారు తీవ్ర నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నా పార్టీ పగ్గాలు మాత్రం వారి చేతిలోనే ఉండటాన్ని పిటిషనర్ ఈ సందర్భంగా ఉదాహరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ- ‘‘దోషిగా తేలిన వ్యక్తి వితరణశీలిగా ఉండవచ్చు. విద్యాదాతగా ఓ పాఠశాలను కూడా ప్రారంభించవచ్చు. కానీ, పాలన క్షేత్రంలో మాత్రం వారి ప్రమేయం శోచనీయమే’’నని వ్యాఖ్యానించింది.

‘బోఫోర్స్’ విచారణకు జస్టిస్ ఖన్విల్కర్ దూరం
రాజకీయంగా సున్నితమైన రూ.64 కోట్ల బోఫోర్స్ కుంభకోణం కేసు విచారణ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ వైదొలగారు. అయితే, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంలో సభ్యుడుగా ఉన్న ఆయన ఇందుకు దారితీసిన కారణాలేమిటో వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని మరో న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రకటించారు. కాగా, ఈ కేసులో నిందితులందరినీ అభియోగ విముక్తుల్ని చేస్తూ 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ నేత అజయ్ అగ్రవాల్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు.

English Title
It's really sad!
Related News