‘జంబ‌ ల‌కిడి పంబ‌’ రివ్యూ

Updated By ManamFri, 06/22/2018 - 14:43
Jamba Lakidi Pamba
Jamba Lakidi Pamba

బ్యాన‌ర్స్‌:  శివ‌మ్ సెల్యులాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడ‌క్షన్స్
న‌టీన‌టులు:  శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని,  వెన్నెల కిశోర్‌, హ‌రితేజ‌, పోసాని కృష్ణ ముర‌ళి,స‌త్యం రాజేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, ష‌క‌ల‌క శంక‌ర్‌, ధ‌న్‌రాజ్‌,  రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌త‌దిత‌రులు
ఆర్ట్:  రాజీవ్ నాయ‌ర్‌
సంగీతం:  గోపీసుంద‌ర్‌
కెమెరా: స‌తీశ్ ఉత్యాల‌
స‌హ నిర్మాత‌:  బి. సురేశ్ రెడ్డి
నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, ఎన్ . శ్రీనివాస‌రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను)

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `జంబ‌ల‌కిడి పంబ‌` ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఓ బెంచ్ మార్కును క్రియేట్ చేసిన చిత్ర‌మ‌ది. అలాంటి సినిమా టైటిల్‌ను ఉప‌యోగిస్తేనే చేయ‌బోయే కొత్త సినిమాపై క‌చ్చితంగా ఓ అంచ‌నా ఏర్ప‌డి పోతుంది. అలాంటి అంచ‌నాతో `జంబ‌ల‌కిడి పంబ‌` ఇప్ప‌టి సినిమా తెర‌కెక్కింది. క‌మ‌డియ‌న్‌గా న‌టిస్తూ రెండు చిత్రాల్లో హీరోగా న‌టించిన శ్రీనివాస‌రెడ్డి ఈ చిత్రంలో హీరోగా న‌టించారు. ఆత్మ‌లు మార్పు చెందితే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మిది. మ‌రి అప్ప‌టి `జంబ‌ల‌కిడి పంబ‌`తో పోల్చితే లేటెస్ట్ `జంబ ల‌కిడి పంబ‌` ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం.
క‌థ‌:
వ‌రుణ్(శ్రీనివాస‌రెడ్డి) ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌.. ప‌ల్ల‌వి(సిద్ది ఇద్నాని) బోటిక్ నిర్వ‌హిస్తుంటుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి .. అది కాస్త ప్రేమ‌గా మారి, పెళ్లికి దారితీస్తుంది. ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డ‌టంతో రెండు కుటుంబాల పెద్ద‌లు పెళ్లి చేస్తారు. ఇద్ద‌రూ ఓ ఇల్లు కూడా కొనుక్కుంటారు. అయితే ప‌ల్ల‌వికి వ‌రుణ్‌కి త‌న ఆఫీస్‌లో ఎవ‌రితోనూ రిలేష‌న్‌షిప్ ఉంద‌ని అనుమానిస్తుంది. రోజు రోజుకీ అనుమానం బ‌ల‌ప‌డుతుంది. దాంతో ఇద్ద‌రూ విడిపోవాల‌నుకుంటారు. విడాకుల కోసం లాయ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌(పోసాని కృష్ణ‌ముర‌ళి)ని సంప్ర‌దిస్తారు. వీరిద్ద‌రికీ విడాకులు ఇప్పిస్తే వంద జంట‌ల‌కు విడాకులు ఇప్పించిన లాయ‌ర్‌గా గిన్నిస్‌బుక్ ఎక్కుతాన‌ని హ‌రిశ్చంద్ర ప్రసాద్ సంబ‌ర‌ప‌డుతుంటాడు. అదే స‌మ‌యంలో గోవా టూర్‌కి వెళ్లిన హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు. చివ‌ర‌కు హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ ఆత్మ‌ను దేవుడు క్ష‌మించ‌డు. పాపానికి ప్రాయ‌శ్చిత్తంగా వ‌రుణ్, ప‌ల్ల‌విల‌ను క‌ల‌ప‌మ‌ని కోరుతాడు. అప్పుడు హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ ఆత్మ ఎన్ని క‌ష్టాలు ప‌డింది?   చివ‌ర‌కు వ‌రుణ్‌, ప‌ల్ల‌విలు క‌లుస్తారా? అస‌లు ఇద్ద‌రి ఆత్మ‌లు ఎందుకు ఎక్సేంజ్ అవుతాయి?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేష‌ణ‌:
జంబ ల‌కిడి పంబ సినిమాలో ఆడ‌వాళ్లు మ‌గ‌వాళ్లుగా.. మ‌గ‌వాళ్లు ఆడ‌వాళ్లుగా మారుతారు. ఆ కామెడీ ట్రాక్ వేరేలా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయానికి వ‌స్తే.. భార్య భ‌ర్త‌ల ఆత్మ‌లు మాత్రం మారుతాయి. ఓ మ‌గ‌వాడు ఆడ‌పిల్ల‌లా ప్ర‌వ‌ర్తించ‌డం.. అలాగే ఆడ‌పిల్ల, మ‌గ‌పిల్లాడిలా ప్ర‌వ‌ర్తించ‌డానికి .. స్క్రీన్‌పై న‌ట‌న‌ను పండించ‌డం చాలా క‌ష్ట‌మైన విషయం. టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై ఓ ఆస‌క్తిని పెంపొందించ‌డంతో యూనిట్ స‌క్సెస్ అయ్యింది. పాత క్లాసిక్ సినిమాలు గీతాంజ‌లి, జ‌య‌మ్మునిశ్చ‌య‌మ్మురా వంటి సినిమాల పేర్ల‌ను తన సినిమా టైటిల్స్‌గా పెట్టుకుంటూ న‌టించిన శ్రీనివాస‌రెడ్డికి ఈ సినిమా టైటిల్ కూడా క‌లిసొచ్చే అంశ‌మే. అయితే పాత సినిమాకు, దీనికి సంబంధం లేదు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా సాగుతుంది. శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న ప‌రంగా మెప్పించే ప్ర‌య‌త్నం చేసినా.. క‌థ‌లో గ్రిప్ లేక‌పోవ‌డంతో సినిమా వీక్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పిస్తుంది. అలాగే తొలి చిత్ర‌మే అయినా సిద్ది ఇద్నాని న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. కామెడీ పండించే న‌టుల బ్యాచ్‌లో పోసాని, వెన్నెల‌కిశోర్‌, ధ‌న‌రాజ్‌, ర‌ఘుబాబు, స‌త్యం రాజేశ్‌, చిత్రంశ్రీను త‌దితరులు ఉన్నా కామెడీ ప్రేక్ష‌కులను మెప్పించలేక‌పోయింది. ఇక ద‌ర్శ‌కుడు మ‌ను ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌ను అల్లుకుంటూ క‌థ‌ను రాసుకోలేదు. దాంతో ప్రేక్ష‌కుడికి సినిమా కాసేప‌టికే బోర్ కొట్టేస్తుంది. రెండు ఆత్మ‌లు మార్పు చెందిన‌ప్పుడు వారెలా ప్ర‌వ‌ర్తిస్తార‌నే దానిపై ద‌ర్శ‌కుడు ఫోక‌స్ పెట్టాడు. వినోదం మెప్పించే స్థాయిలో లేదు. చాలా వ‌ర‌కు సన్నివేశాలు లాగిన‌ట్లు అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్న‌ట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ నాట‌కీయంగా అనిపిస్తుంది. సాంకేతికంగా టీం ద‌ర్శ‌కుడికి బాగానే స‌పోర్ట్ చేసింది. పాత సినిమా రేంజ్‌లో కాక‌పోయినా.. కామెడీతో కాసేపు న‌వ్వుకోవ‌చ్చు క‌దా! అని థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుడికి నిరాశే. 

చివ‌ర‌గా.. జంబ‌ల‌కిడి పంబ‌... భంభోళ జంబే
రేటింగ్‌:1.75/5

English Title
Jambalakidi Pamba review
Related News