ఇదే అసలైన బ్లాక్ డే

Updated By ManamTue, 03/13/2018 - 12:40
Janareddy Fires On TRS Act In Assembly
  • ప్రతిపక్షాన్ని మొత్తం సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, నియంతృత్వం

  • గవర్నర్ పరిధిలో ఆ నిర్ణయం ఉంటుంది.. అలాంటిది స్పీకర్ ఎలా చర్యలు తీసుకుంటారు?

  • మరి, పార్లమెంటులోనూ టీఆర్ఎస్‌ను సస్పెండ్ చేయాలేమో: జానారెడ్డి మండిపాటు

Janareddy Fires On TRS Act In Assembly

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ అనంతరం మీడియా పాయింట్‌లో కాంగ్రెస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా, చట్టంలో ఉన్న విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా అసెంబ్లీ నుంచి మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం, నియంతృత్వమని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటన చీకటి రోజు అని అధికార పక్షం చెబుతోందని, అయితే, దానికన్నా బ్లాక్ డే ప్రతిపక్షం మొత్తాన్ని సభ నుంచి సస్పెండ్ చేయడమేనంటూ దేశ ప్రజానీకం మొత్తం భావిస్తోందని ఆయన అన్నారు. తమకు తెలిసినంత వరకు సోమవారం సభలో జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలో ఉంటుందన్నారు. ఆ సంఘటనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, చట్టప్రకారం ఆయనే చర్యలు తీసుకోవాలని జానారెడ్డి అన్నారు.

గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగే సభల్లోనే.. సభ మొత్తం స్పీకర్ అధీనంలో ఉంటుందని, కాబట్టి మంగళవారం సభ ప్రారంభమై ఏవైనా సంఘటనలు జరిగినా, క్రమ శిక్షణా ఉల్లంఘనలు జరిగినా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినా.. స్పీకర్‌కు చర్యలు తీసుకునే అధికారం ఉందని ఆయన అన్నారు. అంతేగానీ, గవర్నర్ ప్రసంగ సమయంలో జరిగే ఘటనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు లేదని జానారెడ్డి తెలిపారు. అయినా కూడా స్పీకర్ చర్యలు తీసుకున్నారన్నారు. తమ విజ్ఞప్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా సస్పెండ్ చేయడం రూల్స్‌కు అనుగుణంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇలాంటి విషయాలను సభ దృష్టికి తీసుకొచ్చి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. నిజానిజాలను విచారించి వివరించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని అన్నారు. తమకు, ప్రజలకు, రాజ్యాంగ నిపుణులకు, రూల్స్ కమిటీలకు చర్యలు తీసుకునేందుకు అనువైన నియమాలను అర్థమయ్యేలా తెలియజేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని జానారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వం రద్దుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. 

మరి, పార్లమెంటులో టీఆర్ఎస్‌నూ సస్పెండ్ చేయాలి
పార్లమెంటులో అదే టీఆర్ఎస్ పార్టీ పదిరోజులుగా సభను ఆటంకపరుస్తోందని, కానీ, ఇప్పుడేమో ఇక్కడ మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలపై మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. కాబట్టి పార్లమెంటు కూడా అక్కడ ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడంపై ఆలోచించాలని ఆయన కోరారు. మంగళవారం జరిగిన ఘటనతో నియంతృత్వానికి, చట్ట వ్యతిరేకతకు నిదర్శనంగా సభ నిలవబోతోందని ఆయన అన్నారు. అయితే, సోమవారం జరిగిన ఘటనలో తనకు ఏ పాత్రా లేకపోయినా.. ప్రతిపక్ష నేతనైన తననూ సస్పెండ్ చేయడం ఘోరం, దారుణమని మండిపడ్డారు. నాలుగేళ్లుగా బడ్జెట్‌లోని లోపాలను అడుగడుగునా సంయమనంతో ఎత్తి చూపామని, ఈ సారి ఆ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేసేందుకే సోమవారం జరిగిన ఘటనను సాకుగా తీసుకుని తమను సస్పెండ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ మూలాన బడ్జెట్‌పై ప్రజా వాణిని సభలో వినిపించలేకపోతున్నామని, కానీ, మీడియా సాక్షిగా, ప్రజా సమూహం సాక్షిగా ఆ లోపాలను ఎత్తి చూపుతామని ఆయన చెప్పారు. శాసనసభలో బడ్జెట్‌పై నిలదీయలేకపోయినప్పటికీ.. ప్రజా సభలో ఆ లోపాలపై నిలదీస్తామని చెప్పారు. 

English Title
Janareddy Fires On TRS Act In Assembly
Related News