అమ్మ ఎప్పుడూ గర్భం దాల్చలేదు

Updated By ManamWed, 07/25/2018 - 09:20
jaya

jaya చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అంటూ బెంగళూరుకు చెందిన అమృత ఆ మధ్య తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె కోర్టులో కేసు కూడా వేయగా.. దానికి సంబంధించిన విచారణ మద్రాసు హైకోర్టులో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జయలలిత తన జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు 1980 నాటి జయలలిత వీడియో క్లిప్‌లను కోర్టుకు సమర్పించింది. 

జయలలిత ఆస్తులపై కన్నేసిన అమృత వాటిని సొంతం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పేర్కొన్నారు. ఒకవేళ అమృత, అమ్మ కుమార్తెనే అయితే, తన జీవితకాలంలో ఆమెతో కలిసి ఒక్క ఫొటో కూడా ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. జయలలితకు తాను 1980లో పుట్టినట్టు అమృత తన పిటిషన్‌లో పేర్కొనడంతో, అదే ఏడాది జయలలిత ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. అమృత పుట్టినట్టు చెబుతున్న తేదీకి నెల రోజుల ముందే ఈ కార్యక్రమం జరిగిందని, ఈ వీడియోలో జయ గర్భంతో ఉన్న ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపారు. అవసరం అనుకుంటే జయలలిత బంధువల డీఎన్‌ఏతో అమృత డీఎన్ఏను పోల్చి చూడాలని వారు కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

English Title
Jayalalithaa never conceived: Tamilnadu Government
Related News