ఝులన్‌కు మడమ గాయం

Updated By ManamTue, 02/13/2018 - 20:38
Jhulan Goswami

టీ20 సిరీస్‌కు దూరం
Jhulan Goswamiపొచెఫ్‌స్ట్రూమ్:
భారత సీనియర్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమైంది. ఆమె కాలి మడమ గాయంతో బాధపడుతోందని మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముందు రోజు ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయించామని.. స్థానిక వైద్యులను సంప్రదించిన తర్వాత ఝులన్‌ను ఇండియాకు పంపాలని బీసీసీఐ మెడికల్ బృందం భావించిందని బీసీసీఐ పేర్కొంది. ‘మడమ గాయం నుంచి కోలుకునేందుకు ఝులన్‌కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం. ఇండియాలో వైద్యులను సంప్రదించిన తర్వాత ఆమె పునరాగమనంపై నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాసంలో ఉంటుంది’ అని ఆ ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఝులన్ గోస్వామి 200 వికెట్ల మైలురాయిని సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. 2002లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఝులన్ భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా కొనసాగుతోంది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. అర్జున, పద్మశ్రీ అవార్డులు ఆమెను వరించాయి. అంతేకాకుండా మహిళల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా కూడా ఝులన్ నిలిచింది.

English Title
Jhulan Goswami ruled out of South Africa T20Is due to heel injury
Related News