'కాశి' రివ్యూ

Updated By ManamFri, 05/18/2018 - 15:33
kaasi

kaasiచిత్రం: కాశి

నటీనటులు: విజయ్ ఆంటోనీ, అంజలి, సునయన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, నాజర్, జయప్రకాశ్, మ‌ధుసూద‌న‌రావు, వేలా రామ‌మూర్తి, యోగిబాబు తదితరులు

మాటలు, పాటలు: భాస్యశ్రీ

పోరాటాలు: శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్‌

కళ: శక్తి వెంకట్‌రాజ్.ఎం

ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్

కూర్పు: లారెన్స్ కిషోర్

సంగీతం: విజయ్ ఆంటోనీ

నిర్మాణ సంస్థలు: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, లెజెండ్ సినిమా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృతిగ‌ ఉదయనిధి

విడుదల తేది: 18 మే 2018

నిడివి: 133 నిమిషాలు

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ‌ క‌థానాయ‌కుడు విజ‌య్ ఆంటోని. ఆ త‌రువాత 'భేతాళుడు', 'య‌మ‌న్‌', 'ఇంద్ర‌సేన' చిత్రాల‌తో ప‌ల‌క‌రించినా.. నిరాశే మిగిలింది. ఈ నేప‌థ్యంలో.. మ‌రోసారి మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ చిత్ర‌మే 'కాశి'.  దర్శకురాలు కృతిగ‌ ఉదయనిధి తెరకెక్కించిన ఈ సినిమా శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాపై 'మ‌నం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

కథాంశం
kaasiచిన్న‌ప్ప‌ట్నుంచి త‌ల్లిదండ్రుల‌తో అమెరికాలో ఉంటున్న భ‌రత్ (విజయ్ ఆంటోనీ).. లండ‌న్ మెడిక‌ల్ యూనివ‌ర్శిటీలో వైద్య విద్య పూర్తిచేస్తాడు. న్యూయార్క్‌లోని బెస్ట్ హాస్పిట‌ల్స్‌లో ఒక‌టైన భ‌ర‌త్ మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎండీ అయిన భ‌ర‌త్‌.. న్యూయార్క్‌లో స‌క్సెస్‌ఫుల్ కార్డియోథెరాసిస్ స‌ర్జ‌న్‌గా పేరుతెచ్చుకుంటాడు. ఎదుటివాళ్ళు అసూయ‌గా ఫీల‌య్యేంత‌ గొప్ప జీవితాన్ని గ‌డుపుతున్న‌ప్ప‌టికీ.. ఏదో తెలియ‌ని వెలితి అత‌న్ని వెంటాడుతుంటుంది. అంతేగాకుండా.. ప్ర‌తిరోజూ  అత‌న్ని ఓ క‌ల‌ వెంటాడుతుంటుంది. అదేమిటంటే.. ఆ క‌ల‌లో ఒక చిన్న బాబు, పెద్ద పాము, ఒక ఎద్దు కనిపిస్తూ ఉంటాయి. ప్ర‌తీ సారి.. ఆ ఎద్దు పిల్ల‌వాడ్ని పొడవడానికి వస్తున్నట్టుగా కల వస్తూ ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆ బాబుని కాపాడ‌బోయిన అమ్మను ఎద్దు పొడిచిన‌ట్లుగా క‌నిపిస్తుంటుంది. ఆ క‌ల త‌న‌కు ప్ర‌తి రోజు ఎందుకు వ‌స్తుందో అర్థం కాని ప‌రిస్థితి భ‌ర‌త్‌ది. ఇదిలా ఉంటే.. అనుకోకుండా ఒక రోజు తన తల్లికి రెండు కిడ్నీలు పాడవడంతో.. తల్లిని కాపాడుకోవడం తన బాధ్యతగా భావించిన భ‌ర‌త్‌ త‌న‌ కిడ్నీనే ఇవ్వడానికి సిద్ధపడతాడు. భరత్ కిడ్నీ అత‌ని తల్లికి సరిపడదని.. అందుకు కారణం భరత్ తమ సొంత బిడ్డ కాదని, ఇండియాలో అత‌న్ని దత్తత తీసుకున్నామ‌ని భరత్ తండ్రి చెబుతాడు. త‌ల్లికి కిడ్నీ ఆప‌రేష‌న్ పూర్త‌య్యాక‌.. తన మూలాలను తెలుసుకునేందుకు భరత్ ఇండియాకి వస్తాడు. ఈ ప్రాసెస్‌లో మొద‌ట అనాథ శ‌ర‌ణాల‌యానికి వ‌స్తాడు. అక్క‌డ అందిన స‌మాచారంతో ముందుకెళ్తే.. త‌న అస‌లు పేరు కాశి అని, త‌ల్లి పేరు పార్వ‌తి అని తెలుస్తుంది. ఆమెను ఒక‌రు మోసం చేశార‌ని.. అలాగే త‌న‌ని కాపాడుకునే స‌మ‌యంలో ఎద్దు పొడ‌వ‌డంతో హాస్పిట‌ల్ పాల‌యింద‌ని తెలుస్తుంది. ఇంత‌కీ ఆమెను మోసం చేసిన వ్య‌క్తి ఎవ‌రు?  పార్వ‌తి ఆచూకీ తెలిసిందా? లేదా? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌
kaasiద‌ర్శ‌కురాలు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా.. ఉప‌క‌థ‌లు ఎక్కువ కావ‌డంతో సినిమా అంత‌గా ఆస‌క్తిని క‌లిగించ‌లేద‌నే చెప్పాలి. అలాగే.. హీరో ఫ్లాష్‌బ్యాక్‌ల‌కు సంబంధించి.. మూడు ఉప‌క‌థ‌లు ఉంటే.. వాటిలో రెండింటికి  ప్ర‌ధాన క‌థ‌తో సంబంధం లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులకు ప‌క్క‌దారి ప‌ట్టించిన భావ‌న క‌లుగుతుంది. అలాగే ఎమోష‌న్స్‌కు, ఫీల్‌కు స్కోప్ ఉన్నా.. ద‌ర్శ‌కురాలు ఆ వైపు దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో.. సినిమాలో ఎంగేజింగ్ మూమెంట్స్ మిస్ అయిన‌ట్ల‌య్యింది. ప్ర‌ధాన క‌థ‌ల‌తో పాటు.. ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే మూడు ఉప‌క‌థ‌ల్లోనూ వేరేవారి పాత్ర‌ల (మ‌ధుసూద‌న‌రావు, నాజ‌ర్, జ‌య‌ప్ర‌కాశ్‌) యంగ్ లుక్స్ కోసం విజ‌య్‌ను చూపించ‌డం అనే ఆలోచ‌న బాగున్నా.. న‌ట‌న‌లో వేరియేష‌న్స్ లేక‌పోవ‌డంతో తేలిపోయిన‌ట్ల‌య్యింది. అలాగే.. క‌థానాయ‌కుడు ఫీల్‌తో డైలాగ్ చెపుతుంటే.. క‌మెడీయ‌న్ యోగి బాబు వేసే సెటైర్స్ హీరో పాత్ర ఔన్న‌త్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్ల‌య్యిందే త‌ప్ప మ‌రొక‌టి కాదు. ఓవ‌రాల్‌గా.. ఉప‌క‌థ‌ల పురాణాన్ని ప‌క్క‌న పెడితే.. విజ‌య్ ఆంటోని గ‌త చిత్రాలు, పాట‌లను మ‌ళ్ళీ చూస్తున్న‌ట్లు, వింటున్న‌ట్లుగానే ఉంటుందే త‌ప్ప‌.. కొత్త సినిమా చూస్తున్న‌ట్లు ఎక్క‌డా తోచ‌దు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే.. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో మొద‌లై 'ఫాద‌ర్' సెంటిమెంట్‌తో ముగిసే ఈ క‌థ‌.. ప్రేక్ష‌కుల మ‌న‌సులను క‌దిలించ‌డంలో విఫల‌మైంద‌నే చెప్పాలి. 

kaasiన‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ ఆంటోని ఎప్ప‌టిలాగే ప‌రిమిత హావభావాల‌తో స‌రిపెట్టేశారు. మొత్తం నాలుగు పాత్ర‌ల్లో క‌నిపించినా.. న‌ట‌న ప‌రంగా మెప్పించిన సీన్స్ లేవ‌నే చెప్పాలి. ఇక‌ కాశిని ప్రేమించే నాటు వైద్యురాలు శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో అంజ‌లి కొన్ని స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైంది. న‌ట‌న‌కు స్కోప్ లేని పాత్ర‌లో ఏదో ఉన్నానంటే ఉన్నాననిపించుకుంది. భువ‌నేశ్వ‌రి పాత్ర చేసిన‌ సున‌య‌న త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. అలాగే నాజ‌ర్ ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే శిల్పా మంజునాథ్ విష‌యానికి వ‌స్తే సీనియ‌ర్ న‌టి లిజీ ఫీచ‌ర్స్‌తో చ‌క్క‌గా ఉంది. చ‌నిపోయే సీన్‌లో హావ‌భావాల ప‌రంగా మెప్పించింది. అలాగే మ‌ధుసూద‌న్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే అమృత కూడా చ‌క్క‌గా న‌టించింది. నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, మ‌ధుసూద‌న‌రావు పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా ఉన్నంత‌లో మెప్పించారు. యోగిబాబు కామెడీ అక్క‌డ‌క్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యింది. ముఖ్యంగా మెడిక‌ల్ క్యాంప్ పెట్టిన‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాల్లో అత‌ని కామెడీ బాగానే ఉంది.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ ఆంటోని సంగీతంలో రూపొందిన పాట‌ల‌న్నీ సంద‌ర్భోచితంగా ఉన్న‌ప్ప‌టికీ.. గుర్తుండిపోయే పాట‌లైతే కాదు. అయితే.. నేప‌థ్య సంగీతం బాగా కుదిరింద‌నే చెప్పాలి. రిచ‌ర్డ్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. ముఖ్యంగా ప‌ల్లెటూరి అందాల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అలాగే శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్ స్టంట్స్ మాస్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ‌విలువ‌లు బాగున్నాయి.  
ప్లస్ పాయింట్స్            

కాన్సెప్ట్

నేప‌థ్య సంగీతం

ద్వితీయార్థం

ఛాయాగ్ర‌హ‌ణం

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్       

సినిమాలో ఫీల్, ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాలేదు

ఎంగేజింగ్ మూమెంట్స్ త‌క్కువ‌

స్క్రీన్‌ప్లే

డైరెక్షన్

చివ‌ర‌గా.. 'కాశీ' మ‌జిలీ క‌థ‌లు
రేటింగ్‌: 2.25/5

English Title
'kaasi' review
Related News