కబడ్డీ.. కబడ్డీ!

Updated By ManamSun, 07/29/2018 - 03:55
Kabaddi .. Kabaddi!

ఐపీఎల్‌తో భారత దేశంలో లీగుల శకం మొదలైందని చెప్పవచ్చు. అంతకు ముందు కూడా కొన్ని ప్రాంతాల్లో, పరిమిత సర్కిళ్లు, సంఖ్యలో వివిధ క్రీడా లీగులు ఉండేవి. అయితే లలిత్ మోదీ క్రికెట్ లీగ్‌కు ప్రాణం పోశాడు. అవి బాగా ఆదరణ పొందడంతో ఈ లీగుల సంస్కృతి ఇతర ఆటలకూ పాకింది. మారుతున్న లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టు ఇవి ఉండడంతో బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ కోవలోనే కబడ్డీ లీగ్ ‘ప్రో కబడ్డీ’ ప్రారంభమైంది.

kabaddi

imageమన దేశంలో వందల సంవత్సరాల నుంచే ప్రాక్టీస్‌లో ఉన్న ఈ క్రీడ.. క్రికెట్, సాకర్ వంటి కొత్తకొత్త ఆటలు అందుబాటులోకి రావడంతో పాటు, జీవన శైలి కారణంగా కూడా ఆదరణ కోల్పోయింది. అయితే, లీగుల పుణ్యమా అని క్రమేణా దీనికి ఆదరణ పెరుగుతోంది. కాబట్టే ఈ ఆటపై వందలు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. క్రికెట్ తరహాలో ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈ ఆట ఆడేవారికి డబ్బుకు డబ్బు, గుర్తింపునకు గుర్తింపు లభిస్తోంది. చాలా మంది ఈ ఆటవైపు మళ్లుతున్నారు. పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నారు. కూతపెడుతూ, హెచ్చరించుకుంటూ ప్రత్యర్థి కోర్టుకు వెళ్లి వారిని అవుట్ చేసి రావడమే కబడ్డీ. భారతీయుల అభిమాన క్రీడైన దీనిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. దక్షిణ భారతాన చెడుగుడు, హుటుటు, కబాడీ అని పిలుస్తారు. తూర్పు ప్రాంతంలో మహిళలు ఆడే ఆటను చుకిట్‌కిట్ అని, పురుషులు ఆడేదాన్ని హాడుడు అని పిలుస్తారు. ఉత్తర భారతంలో మాత్రం కబడ్డీ అంటారు. కేరళలో పందెకలి అనీ, బెంగాల్‌లో హిడుడు అని పిలుస్తారు. గతంలో కబడ్డీ మూడు రకాలుగా ఉండేది. సంజీవిని పద్ధతి, గమినీ పద్ధతి, అమర్ పద్ధతి. ప్రస్తుతం మనం సంజీవిని పద్ధతిలో ఆడుతున్నాం.

కొత్త రూపాలు    
కబడ్డీని అవుట్‌డోర్‌లోనూ, ఇండోర్‌లోనూ ఆడుకోవచ్చు. ఇతర క్రీడలతో పోల్చుకుంటే ఖర్చు కూడా తక్కువ. పైగా భౌతికంగానూ, మేధోపర వికాసాలకూ ఇది పూర్తి స్థాయిలో ఉపకరిస్తుంది. కాబట్టి ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా  దేశాలు కబడ్డీపై ఆసక్తి చూపుతున్నాయి. ఆయా దేశాల్లో కబడ్డీకి కొన్ని ఆకర్షణలు చేర్చి, నియమాలు మార్చి కొత్త వెర్షన్లను కూడా రూపొందిస్తున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ప్రో కబడ్డీ ఫార్మాట్లు కూడా రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే బీచ్ కబాడీ, సర్కిల్ కబాడీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా పలు రూపాలుగానూ మన సంప్రదాయ గ్రామీణ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా అభిమాన క్రీడగా విస్తరిస్తూండటం మనకు గర్వ కారణం. కోర్టు: కోర్టు 1310 మీటర్ల (మహిళల కోర్టు 1180 మీటర్ల) పొడవు, వెడల్పుతో ఉంటుంది. కోర్టును రెండు అర్ధ భాగాలుగా విభజిస్తారు. మధ్య పాయింట్‌ను మిడిల్ లైన్ లేదా మార్చ్ లైన్‌గా గుర్తిస్తారు. ఒక అర్ధ భాగంలో చివరి లైన్ దగ్గర నుంచి 3.25 మీటర్ల వరకు బాల్క్ లైన్‌గా పరిగణిస్తారు. దాని వెనుకగా బోనస్ లైన్ ఉంటుంది. కోర్టు చుట్టూ బయటి వైపు నాలుగు మీటర్ల స్థలం కేటాయిస్తారు. అవుటైన క్రీడాకారుల కోసం రెండు మీటర్ల దూరంలో ‘సిట్టింగ్ బ్లాక్’ ఉంటుంది. జట్టు: జట్టులో 12 మంది క్రీడాకారులుంటారు. వారిలో ఏడుగురు బరిలోకి దిగితే ఐదుగురు రిజర్వుడుగా ఉంటారు. దుస్తులు: క్రీడాకారులు బనియన్, షార్ట్ ధరించాలి. లోపల జాంగా లేదా లంగోటా కట్టుకోవచ్చు. ఒంటికి ఎలాంటి చమురు పూసుకోరాదు. అలాగే ఎలాంటి ‘మెల్’ వస్తువులు ధరించకూడదు. సాదాసీదా (ప్లేన్) రబ్బర్ సోల్ ఉన్న కాన్వాస్ బూట్లను మాత్రమే ధరించాలి. 

ఎలా ఆడతారంటే..
ప్రారంభంలో టాస్ వేస్తారు. టాస్ గెలిచిన జట్టు ఆట ప్రారంభాన్ని నిర్ణయిస్తుంది. అంటే మొదటగా తాము ‘దాడి’ (రైడింగ్) చేస్తారా? ప్రత్యర్థి జట్టుకు అవకాశమిస్తారా? అనేది నిర్ణయించుకుంటుంది. ఈ అవకాశం పొందిన వారు రైడ్ చేయడం ద్వారా ఆటను ప్రారంభిస్తారు. ఆట సగంలో ఇరు జట్లు కోర్టు మారతాయి. రైడింగ్‌కు వెళ్లిన రైడర్, ప్రత్యర్థి కోర్టులోని బాల్క్ లైన్‌ను తాకి రావాలి. ప్రత్యర్థి కోర్టులోని జట్టు సభ్యులను తాకి కూతను ఆపకుండా తమ కోర్టులోకి వస్తే ఒక పాయింటు వస్తుంది. ప్రత్యర్థి కోర్టులో ఉన్నప్పుడు రైడర్ కూతను ఆపితే తనే అవుటవుతాడు. బాల్క్ లైన్ వెనకనున్న బోనస్ లైన్‌ను తాకి వస్తే రైడర్‌కు ఒక బోనస్ పాయింట్ వస్తుంది. ఆడే సమయంలో క్రీడాకారులెవరైనా బౌండరీ దాటి బయటకు వస్తే ‘రిఫరీ’ వారిని అవుటైనట్టు ప్రకటిస్తారు. రైడర్‌ను పట్టుకున్న సమయంలో ప్రత్యర్థి కోర్టు బయటకు వస్తే వారే అవుటవుతారు. ఆట సమయంలో ‘లాబీ’ భాగాన్ని కూడా కోర్టుగానే భావిస్తారు. ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెట్టేటప్పుడు రైడర్ కబడ్డీ.. కబడ్డీ.. అనే కూత మొదలు పెట్టాలి. ఒకవేళ ఆలస్యంగా కూత మొదలుపెడితే రిఫరీ అతన్ని వెనక్కి పంపించి ప్రత్యర్థికి దాడిచేసే అవకాశమిస్తాడు. ఈ నియమాన్ని రైడర్ కావాలని ఉల్లంఘించినట్టు భావిస్తే రిఫరీ ప్రత్యర్థి జట్టుకు పాయింట్  కూడా ఇవ్వవచ్చు. రైడర్ దాడి అనంతరం తన కోర్టులోకి వచ్చిన ఐదు సెకన్లలోపు అవతలి వారు తమ రైడర్‌ను వీరి కోర్టుకు దాడికై పంపించాలి. ఈ విధంగా దాడికి, దాడికి మధ్యన ఐదు సెకన్లకన్నా ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఒక సమయంలో ఒక రైడరే దాడి చేయాలి. ఒకరికన్నా ఎక్కువ మంది దాడిచేస్తే వారి రైడింగ్ అయిపోయినట్టు ప్రకటించి ప్రత్యర్థికి అవకాశమిస్తాడు రిఫరీ. ప్రత్యర్థులు రైడర్‌ను పట్టుకుని బలవంతంగా నోరు మూసి కూతను ఆపితే వారిని ఆట నుంచి బయటకు పంపించే అవకాశముంది. రైడింగ్‌ను ప్రారంభించిన రైడర్ తన కోర్టులోకి వెళ్లక ముందే రైడింగ్ చేస్తే చేసిన వారినే అవుటైనట్లు ప్రకటిస్తారు. 

స్కోరు ఎలా ఇస్తారంటే..
ఒక టీములోని సభ్యులందరినీ అవుట్ చేసిన జట్టుకు ‘లోనా’ ప్రకటిస్తారు. అంటే వారు చేసిన స్కోరుకు రెండు పాయింట్లు అదనంగా కలుపుతారు. దీని తరువాత 10 సెకన్లలోపు సభ్యులందరూ కోర్టులోకి వచ్చి ఆటను కంటిన్యూ చేస్తారు. జట్టులోని సభ్యులు ఎక్కువ మంది అవుటై ఒకరో, ఇద్దరో మిగిలినప్పుడు ఆ జట్టు కెప్టెన్ అప్పటికి అవుటైన వారినందరినీ వెనక్కి పిలుచుకునే అవకాశం కల్పిస్తారు. అలాంటి సమయంలో ఎదుటి జట్టుకి ‘లోనా’ ప్రకటిస్తారు. రైడర్‌ను పట్టుకునేటప్పుడు అతని కాళ్లు, చేతులు, శరీరం తప్ప జుత్తుగానీ, దుస్తులు గానీ పట్టి లాగ కూడదు. కావాలని అలా చేసినట్లు రెఫరీ భావిస్తే పట్టుకున్న వారినే అవుటైనట్టు ప్రకటిస్తాడు. జట్టు పాయింట్ గెలుచుకుని అవుటైన వారిని తిరిగి కోర్టులోకి రప్పించుకునేటప్పుడు ఏ క్రమంలో వారు బయటకు వెళ్లారో ఆ క్రమంలోనే తిరిగి కోర్టులోకి రావాలి. ఎదుటి వారిని అవుట్ చేసిన ప్రతిసారీ జట్టుకు ఒక పాయింటు చొప్పున వస్తుంది. ‘లోనా’ వస్తే దీనికి మరో రెండు పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఒక వేళ ‘టై’ ఏర్పడితే మరో ఐదు రైడింగ్‌ల ఆటను ఆడిస్తారు. ప్రతి గేమ్ పురుషులకైతే 40 నిమిషాలు, స్త్రీలకైతే 30 నిమిషాల పాటు జరుగుతుంది. గేమ్‌ను సగం విభజించి 20/15 నిమిషాల చొప్పున ఐదు నిమిషాల విరామంతో రెండు మ్యాచ్‌లుగా ఆడతారు. ఏదైనా అంతరాయం వల్ల ఆట ఆగిపోయి, 20 నిమిషాల లోపు తిరిగి ప్రారంభమైతే ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే కంటిన్యూ చేస్తారు. అలా కాకుండా 20 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఆగిపోతే ఆ మ్యాచ్ తిరిగి మొదటి నుంచి ఆడాల్సి ఉంటుంది.

ఉపయోగాలు
కబడ్డీ వల్ల కాళ్లు, చేతులు దృఢంగా, పటిష్ఠంగా తయారవుతాయి. ఎముకల దృఢత్వం పెరుగుతుంది. శరీరంపై పూర్తి పట్టు సాధించగలుగుతారు. నిరంతర వ్యాయామంగా కూడా ఇది ఎంతో ముఖ్యమైన ఆట. అందుకని ఎదిగే దశలో ఉన్న పిల్లలకు ఇది చెప్పలేనంత ఉపకారి. చలనశీలత, క్రియాశీలత, సహానుభూతి తదితర మేధోపరమైన లక్షణాలతో పాటు కండరశీలత వంటివి పెంచడం ద్వారా పిల్లల దేహాన్ని బలోపేతం చేస్తుంది. ఆ విధంగా ఇది శారీరక, మానసిక పెంపుదలకు దోహదం చేస్తుంది. ధైర్యసాహసాలు పెంచుతుంది. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకుంటూ వాటిని టీంవర్క్‌కూ అన్వయించుకోవడంతో సామాజికత కూడా అలవడుతుంది. దానితో పిల్లలు ప్రయోజకులుగా తయారవుతారు. ప్రతీ గ్రామం, ప్రతీ చోటా కబడ్డీ పోటీల్లో పాల్గొనే అవకాశముంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లలేని వారు గుర్తింపు కోసం బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందుబాటులో ఉన్న  పోటీల్లో పాల్గొన్నా కూడా స్థానికంగా అదే స్థాయిలో గుర్తింపు వస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలు పొందవచ్చు.
నేలంటి మదనయ్య

నాలుగేళ్ల ప్రాక్టీస్‌తో..
శరీరాకృతి స్థిరపడే దశ అంటే 10-12 ఏళ్ల వయసులో ఆరంభిస్తే రెండేళ్లలో క్రీడలోని మెళకువలను నేర్చుకోవచ్చు. ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే 4, 5 ఏళ్ల రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం. ఎత్తు బాగా ఉండి కాళ్లు, చేతులు పొడవుగా ఉన్నవారికి ఈ ఆట అనువుగా ఉంటుంది.

English Title
Kabaddi .. Kabaddi!
Related News