అందుకే ఇలా సాయం చేస్తున్నా

Updated By ManamMon, 09/24/2018 - 15:32
Manam Saitham
Manam Saitam

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మనం సైతం’ సేవా సంస్థ మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం చేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు నందినీ రెడ్డి, నటుడు రాజీవ్ కనకాల, నటి రజిత, డాన్స్ మాస్టర్ సత్య, గాయని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా పేదలకు చెక్‌లను అందజేశారు.

అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘పరిశ్రమలో మంచి మనుషులు పెరుగుతూనే ఉన్నారు. వాళ్లలో కొందరు మన కార్యక్రమానికి వచ్చారు. నేను జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటి సమయంలో నాకు సాయం చేయండి అని అడగలేదు. కానీ ఇవాళ మనం సైతం కోసం వెళ్తున్నప్పుడు ప్రతి పెద్ద వాళ్లూ నన్ను ఆదరిస్తున్నారు. మాకు సహాయం చేయాలని ఉంటుంది కానీ నిజాయితీ గల వేదిక దొరకడం లేదు. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి అని ప్రోత్సహిస్తున్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. పేదరికాన్ని రూపుమాపకున్నా వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేదే నా ధ్యైయం, లక్ష్యం. కులాలను బట్టి కాకుండా ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు పెట్టాలని మేము ప్రభుత్వాలకు ప్రతిపాదిస్తున్నాం. పేదవాడిని పట్టించుకునే ప్రభుత్వాల, నాయకుల వెంట మాత్రమే మనం సైతం ఉంటుంది’’ అని అన్నారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘మాటలు చెప్పడం సులువు. మైక్ ఇస్తే ఎవరైనా ప్రసంగాలు చేస్తారు. కానీ ఒక మంచి పని చేయడం చాలా కష్టం. కాదంబరి కిరణ్ అలాంటి శ్రమను తీసుకున్నాడు. తన ఆలోచనను ఆచరించి చూపిస్తున్నాడు. ఇంకా చాలా మందికి కాదంబరి సేవ చేయాలి. గొప్పగా ఉన్నామనుకునే పరిశ్రమలో ఉండి తోటి పేదలకు సహాయం చేయలేకపోవడం సిగ్గుచేటుగా ఉంది’’ అని అన్నారు.

మనం సైతం సభ్యులు, ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ మాట్లాడుతూ.. ‘‘కాదంబరి కిరణ్ అన్న పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం ఆపేసి నాలుగేళ్లవుతోంది. ఎందుకంటే అప్పుడే మనం సైతం సేవా సంస్థను స్థాపించాం. కొద్దిమందితో ప్రారంభమైన మనం సైతం ఇవాళ లక్షలాది మందికి చేరువవుతోంది. మనం సైతం వెంట మా సభ్యులంతా ఉంటాం’’ అని తెలిపారు.

English Title
Kadambari Kiran on Manam Saitham programme
Related News