‘కాలనాళిక’-2

Updated By ManamMon, 06/18/2018 - 00:16
KAALANALIKA

imageరాజగోవిందు మనసులో ఒకటే ముసురు. సముద్రమంత ఆందోళన. ఇంతకు తనేం చేయాలి? సాయుధం కావడమంటే ఏమిటి? ఇంకోవైపు ‘సంగం’ ‘ఇక తిరుగబడితేనే విముక్తి.. లేకుంటే మరణమే’ అని జన సామాన్యాన్ని చైతన్య పరుస్తుం టుంది. రాజగోవిందు కడివెండికి చేరే సరికి దొరలతో ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధమవుతుంటుంది. చెల్లె వీరలక్ష్మి, బావ ఆడెపు కైలాసం కూడా పూర్తిగా ఉద్యమంలో దిగిపోతారు. ‘సం గం’ కార్యకర్తలు చైతన్యవంతులై దొరల గడీల్లో అక్రమంగా నిల్వ వున్న ధాన్యాన్ని తహసిల్దార్‌చేత కొలిపిస్తారు. గడీల మీద దాడులు నిర్వహించి అందులో వెట్టిచాకిరి చేస్తున్న అమాయ కులను విడిపిస్తారు. గడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవ డానికి అందులో పనిచేసే మంగలి మల్లేశంను కోవర్టుగా నియ మించుకుంటారు. కానీ గడీ రహస్యాలు సంగపోళ్లకు ఎవరి ద్వారా పోతున్నాయో తెలుసుకొని మంగలి మల్లేశంను చిత్ర హింసలకు గురిచేస్తారు. చిన్న మొంటెలో ఎర్రని నిప్పుకణికల్ని వేసి వాటి మీద చారెడు ఎండు మిరపకాయలను వేసి దాన్ని బలవంతంగా మంగలి మల్లేశం మూతికి కడుతారు. ఊపిరాడక మంగలి మల్లేశం కొన్ని నిమిషాలు నరకయాతన అనుభవించి పెద్దగా అరుస్తూ నేలకూలిపోతాడు.

గడీలో వెట్టిచాకిరి చేసే రోజుల్లో తన బతుకును కుక్కలు చింపిన విస్తరి చేసిన దొరల అంతు చూడాల్సిందేనని వీరలక్ష్మి కూడా ప్రతీకారంతో ‘స్త్రీశక్తి సంఘటన’ గ్రూపులను తయారు స్తుంది. కడివెండి వీథుల్లో దొర గూండాల, రజాకార్ల రాక్షస క్రీడ ప్రారంభం. ఇళ్లు తగలబెట్టడం. స్త్రీలను చెరచడం, కనిపించిన వారిని కనిపించినట్టు తుపాకుల్తో కాల్చిపా రెయ్యడం.. అంతా ఒక యుద్ధ బీభత్సం. ప్రజలు కకావికలై పరుగెత్తడం. రాజగోవిందు కూడా పరుగెత్తుతున్నాడు. ఎరమ రెడ్డి మోహన్ రెడ్డి, దొడ్డి మల్లయ్య, దొడ్డి కొంరయ్య, మంగలి లింగయ్య ఇలా ఎక్కడి వాళ్లక్కడ ఎదురుదాడిలో నిమగ్న మయ్యారు. ఇంతలో ఒక తుపాకి గుండు వచ్చి దొడ్డి మల్లయ్య కాలుకు తాకి మల్లయ్య కూలిపోయాడు. వెంటనే జనం గుమిగూడి మల్లయ్య కాలికి పసుపురాస్తున్నారు. ఈలోగా మరో తుపాకీ గుండు ఈ సారి దొడ్డి కొంరయ్య  కడుపులో పేగుల్ని చీల్చింది. మరోవైపు కడివెండి గడీ దొరసాని జానమ్మ, ఆమె తాబేదార్లు, గూండాలు, పోలీసులు జనసంద్రాన్ని, వాళ్ల ఆవేశాన్ని చూసి అక్కడి నుండి మాయమైపోయారు. కొద్ది సేపు మృత్యువుతో పోట్లాడి దొడ్డి కొంరయ్య ప్రాణాలు విడిచాడు. కడివెండి వీరోచిత పోరాటాన్ని కళ్లారా చూసి చెల్లెలు, బావ దగ్గర సెలవు తీసుకొని రాజగోవిందు మళ్లీ వరంగల్‌కు పయన మయ్యాడు. తిరుగు ప్రయాణంలో పొలాల్లో నాట్లేసే కూలీలు ‘అమరజీవుడవు నీవు కొంరయ్యా! అందుకో జోహార్లు కొంర య్యా!!’ అని పాడుకోవడం విని రాజగోవిందు అంతలోనే జ్ఞాపకంగా మిగిలిపోయిన కొంరయ్యను తల్చుకొని బాధపడతాడు. 

వరంగల్‌కు వచ్చినా రాజగోవిందు మనసంతా కడివెండి దృశ్యాలే కదలాడుతున్నాయి. మనసంతా నిప్పుల చెరువై అలుగు దుంకుతుంది. రజాకార్ల, దొరల గూండాల దౌర్జన్యా లను అడ్డుకోవడానికి ఏదో ఒకటి చేయాలని తొక్కులా డుతున్నాడు. తెల్లారి ‘సి’ పైలీ దిగగానే బత్తిని మొగిలయ్యగౌడ్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రజాకార్ మూకల చేతిలో ప్రజల సాక్షిగా, రాజగోవిందు సాక్షిగా బత్తిని మొగిలయ్య గౌడ్ అనే వీరుని మరణం. రాజగోవిందు మరచిపోలేని రక్తచరిత్ర. ఈ సందర్భంగా కాళోజీ రాసిన ‘ఖామోష్’ కవిత గోల్కొండ పత్రిక లో అచ్చయింది. తరువాత ‘సంగం’ నాయకుల, కార్యకర్తల సహాయంతో చాకలి ఐలమ్మ దొరల గూండాలను ఎదిరించి తన పొలంలోని పంటను తానే కోసుకుపోవడం శౌర్యాన్ని కలిగిస్తే, పోలీసులకు దొరికిన బి.ఎన్.యాదగిరిరావు, నల్లు ప్రతాప్‌రెడ్డి, సీతాకుమారిలను పెట్టిన చిత్రహింసలకు రక్తం ఒక్కసారి పోటెత్తుతుంది. ఉద్యమం కోసం వాళ్ళు భరిస్తున్న హింసకు తలుచుకుంటే ప్రాణముండగానే దేహాన్ని మంటల్లో కాల్చుతున్న ఫీలింగ్ కలిగి పిడికిళ్లు బిగుసుకుంటాయి. ఈ లోపు రాజగోవిందు ఎప్పుడో పూర్తిస్థాయిలో ఉద్యమంలో చేరి పోయి పెండ్యాల రాఘవరావు దళంలో పనిచేస్తుంటాడు. తరు వాత కొన్ని రోజులకు రాజగోవిందు రావి నారాయణరెడ్డికి వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేస్తాడు. ఈ మధ్యలో ఉద్య మంలో ఎన్నో ఉత్థానపతనాలు. ఎక్కడెక్కడి డెన్‌లలోనో ఎంతో మంది తలదాచుకోవడం, కొన్ని వేల మంది ఉద్యమంలోకి రావడం జరుగుతుంది. ఎంతో మంది అగ్రశ్రేణి నాయకులతో కలిసి పనిచేస్తాడు రాజగోవిందు. 15 ఆగష్టు 1947న బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్య్రం లభిస్తుంది. వెంటనే ఆంధ్రమహాసభ తెలంగాణ అంతటా జాతీయ జెండాలు ఎగరవేయాలని అవసరమైతే అరెస్టయి జైళ్లకు కూడా పోవడానికి వెనకాడకూడదని పిలుపునిస్తుంది. కానీ నిజాం ప్రభువు హైద రాబాద్ రాష్ట్రంలో వేరే ఏ జెండా ఎగరడానికి వీలులేదని, అలా చేస్తే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారని ఒక ఫర్మానా జారీ చేస్తాడు. అట్లా కొంతమంది అరెస్టయి జైళ్లకు వెళ్తారు. దేశ మంతా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనుభవిస్తుంటే తెలంగాణ మాత్రం ఇంకా నిజాం పాలన అనే చీకటిలోనే మగ్గిపోతుంది.

పార్టీ రాజగోవిందుని పరకాల ప్రాంతానికి బదిలీ చేస్తుంది. అదే సమయంలో రజాకారు మూకలు జనగామ తాలూకాలోని బైరాన్‌పల్లిపై దాడిచేస్తారు. ఈ దాడిని ‘సంగం’ దళాలు సమర్థ వంతంగా తిప్పికొడుతాయి. 
సెప్టెంబర్ 1 నుంచి ‘సంగం’ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా భారత జాతీయ జెండాను ఎగరవేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో అనేక మందిని రజాకార్లు చంపేస్తారు. ఎంతో మందిని గాయపరుస్తారు. ఇక  నిజాం రాజు పాలన కూలిపోయే రోజులు దగ్గర పడుతున్నాయని భావించి ‘సంగం’ సభ్యులు బండియాదగిరి రాసిన ‘బండెనక బండి గట్టి/ పదహారు బండ్లుగట్టి/ఏబండ్లెపోతవు కొడుకో/నైజాం సర్క రోడా!’ అంటూ పాటనెత్తుకుంటారు.

రాను రాను తెలంగాణ అన్ని జిల్లాల్లో సామాన్యుల జీవ నం అత్యంత దీనంగా తయారై హింసాత్మకంగా పరిణమిం చింది. అన్ని గ్రామాల్లో ‘గ్రామ రక్షక దళాలు’ ఏర్పడి శత్రువు దాడిని తిప్పికొడుతున్నారు. అనూహ్యంగా శత్రు మూకలు దాడిచేయగానే స్త్రీలు, పురుషులు, కర్ర, కారం, పలుగు, రాళ్లు, వడిశెల, కొడవలి... ఇలా ఏది అందితే దాన్ని చేతబూని శత్రువును ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. నిజాంను గద్దె దించ డానికి మనం సాయుధపోరుకు దిగాల్సిందేనని హైదరాబాద్ రాష్ర్టం భారతయూనియన్‌లో చేరాలనే ప్రధాన డిమాండ్‌తో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియొద్దీన్ తదితరులు రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ప్రతీకార ద్వేషంతో రజాకార్లు పెట్రేగిపోయి కొన్ని వందల గ్రామాలను దహనం చేశారు. గుంజలకు కట్టేసిన పశువులైతే ఎటూ పారిపోలేక అలాగే ఎముకల గూడులాగా కాలిపోయి కూలిపోయాయి. ఈ అకృత్యాలను చూసి చలించిపోయి రైతు కూలీలు పిడికిట్లో నిప్పుల సముద్రాన్ని నింపి ముందుకు దూకారు. ఈ ఆవేశంతోనే ఎన్నో గ్రామాల దొరలపై మూకు మ్మడిగా దాడులు చేసి వారిని ప్రజలందరూ కలిసి సంహరిం చారు. ఒక్కసారిగా తెలంగాణ అంతా అగ్నిగుండమైపోయింది. ప్రజలు యూనియన్ సైన్యాన్ని, మిలటరీని, రజాకార్లను, దొరల గూండాలను ఎవరినీ లెక్కచేయకుండా ఎదుర్కుం టున్నారు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ అయితే ఈ ఎదురుదాడిని జీర్ణించుకోలేకపోతున్నాడు. రజాకార్లను ఎదుర్కొ న్న కొందరు స్త్రీలను నగ్నంగా తయారుచేసి వారిచేత పాశవి కంగా నడి బజారులో బతుకమ్మ ఆడించి పైశాచికా నందం పొందుతాడు. అదే క్రూరత్వంతో  రజాకార్లు మళ్లీ బైరాన్‌పల్లి మీద దాడి చేసి తుపాకులతో మరో జలియన్ వాలా బాగ్ దురంతాన్ని గుర్తుచేసేలా 118 మందిని హతమార్చారు. రాజగోవిందు ఆ బైరాన్‌పల్లి శవాల గుట్టల నుంచి ఒక ఐదేళ్ల పిల్లవాడిని భుజానికి వేసుకొని వస్తాడు. తరువాత ఈ పిల్లవాడికే ‘సూర్యుడు’ అని పేరుపెడతాడు. తనది ప్రత్యేక దేశమని నా దేశం మీద భారత ప్రభుత్వం సైనిక దాడి చేస్తోం దని నిజాం ప్రభువు ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తాడు. కాని సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంపై భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ నిర్వహించి హైదరాబాద్ రాష్ట్రంపై భారత జెండాను ఎగరవేస్తుంది. తరువాత తాత్కాలిక ప్రభుత్వ సైనిక పరిపాలనాధికారిగా ఉన్న డి. ఎస్. బాఖ్లే శాంతి భద్రతల పేర రజాకార్ సంస్థ, ఆంధ్రమహాసభ, తెలంగాణ కమ్యూనిష్టు పార్టీ, ఆంధ్ర కమ్యూనిష్టు పార్టీలపై నిషేధం విధిస్తాడు.

ఖాసీం రజ్వీని, ప్రధానమంత్రి లాయక్ అలీని అరెస్టు చేసి గృహనిర్భందం పేర వారికి సకల మర్యాదలు కల్పిస్తారు. తరు వాత వీళ్లిద్దరూ పోలీసుల సహకారంతోనే పాకిస్తాన్‌కు పారిపో తారు. ‘‘తెలంగాణ విముక్తి కోసం పోరాటం జరిపిన అనేక మంది వీరులపై, రాక్షస హింస జరిపిన అనేక మంది రజాకా ర్లపై ఒకే సమయంలో విచారణ జరిగింది కోర్టుల్లో. కాని అనేక హత్యాచారాలు, అత్యాచారాలు జరిపిన రజాకార్లకు ఇంట్లోను, జైలులోను సకల మర్యాదలతో రోజులు గడిచినై. ఒక్క ద్రోహికి కూడా ఏ శిక్షా పడలేదు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అనేక త్యాగాలు చేసిన కమ్యూనిష్టు యోధులకు మాత్రం అనేక సంవత్సరాల జైలు శిక్షలు.. కొంత మందికి ఉరి శిక్షలు కూడా పడ్డాయి. స్వతంత్ర భారతదేశం అవతరించిన తొలి రోజుల్లో పౌరులకు మన భారతదేశ ప్రభుత్వంలో లభించిన ‘సమన్యాయం’ ఇది.’’

1949 డిసెంబర్ 1న జనరల్ చౌదరి పాలన రద్దయ్యింది. ఎం.కె. వెల్లోడి ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్ప డింది. 1950 జనవరి 26న దేశంలో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశం రిపబ్లిక్‌గా మారింది. సంస్థానాలన్నీ రాష్ట్రాల హోదాను పొందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాలకుడైన నిజాంను భారత ప్రభుత్వం ‘రాజ్ ప్రముఖ్’గా నియమించింది. ఆయనకు సాలీనా పన్నులేని కోటీ యాబై లక్షల రూపాయలను ఇవ్వడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఆనాటి సైనిక గవర్నర్ జె.ఎన్.చౌదరి  కమ్యూ నిష్టుల్ని, ‘సంగం’ సభ్యుల్ని ఏరేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ప్రజలపై అపారమైన హింస చోటు చేసుకుంది. అగ్ర నాయకులెంతో మంది అరెస్టయ్యారు. రాజగోవిందు చెల్లెలు, బావ కూడా అరెస్టయి జైలు పాలవుతారు. డెన్‌లన్నీ మూత పడ్డాయి. చివరికి రాజగోవిందు ఒక్కడే ఒంటరిగా మిగిలాడు. 
    
- డాక్టర్ వెల్దండి శ్రీధర్ 
98669 77741. 

English Title
"Kalanalika-2
Related News