కందుకూరి  కబుర్లు

Updated By ManamMon, 04/16/2018 - 01:23
kandukuri

image19వ శతాబ్దంలో తెలుగు సమాజం ఆధునికతకు దూరంగా, స్త్రీలు, బడుగు వర్గాలు, వీరి పట్ల  వివక్షతో  ఉండేది. ఇలాంటి  సమాజంలో  కందుకూరి వీరేశలింగం గారి పుట్టుక. వారి స్వీయ  చరిత్రలో మనకు ఆ కాలపు స్థితిగతుల గూర్చి ఆసక్తికరమైన  విశేషాలు తెలుస్తాయి. వాటిలో కొన్ని.
‘వీరి తలపాగా ధారణలో  మహారాష్ట్ర కట్టు  కనిపిస్తుంది. తమ పూర్వీకులు  దేశపాండ్య పదవులు నిర్వహించిన వారని  చెప్తారు. నెల్లూరు మండల  కందుకూరు ముత్తాతల పూర్వ  నివాస స్థలం కాగా, అక్కడ నుంచి ఏలూరు వచ్చి మహమ్మదీయ ప్రభువుల కాలంలో బహుగా బతికిన కుటుంబంగా ప్రస్తావిస్తారు. దేశంలో  మహమ్మదీయ పాలన అంతరించి,  బ్రిటిష్  పాలన కాలంలో అక్కడి  జాగీరు వారి వశం అయి కేవలం కొంత భరణం లభించే కాలంలో,  ముత్తాత కందుకూరి వీరేశలింగం  రాజమండ్రి వచ్చి అక్కడ దివానుగా పనిలో  ఎదిగి,  విశాలమైన ఇల్లు కట్టారు. వీరి  ఇల్లు ఎంత పెద్దది అంటే, ఎదురుగా అదే స్థలంలో అయిదారు ఇల్లు ఉండేవని  చెప్తారు. 

‘రాజమండ్రిలో తాతగారింట, మనవడు వీరేశలింగం  పుట్టిందే కీలక నామ సంవత్సరంలో 1848 చైత్ర శుద్ధ త్రయోదశి భానువారము నాడు, సూర్యోదయానంతరమున మూడు గడియలకు. వీరేశలింగం తాతగారికి ఇద్దరు కొడుకులు పెద్ద వాడు  వెంకటరత్నము,  చిన్న వాడు సుబ్బారాయుడు  ఈయన కుమారుడే మన కందుకూరి వీరేశలింగము. 

‘తాను పుట్టడానికి ఒక ఏడాది ముందరే,   తాతగారి  కన్ను మూత.  ఆయన తల్లి అక్కమ్మ, భార్య కామమ్మ, ఇద్దరు కుమారులూ ఉన్నారు ఆయన  మరణ సమయంలో.  వీరిది రాజమండ్రిలో గల మూడు పెద్ద ఇళ్ళలో ఒక్కటి అయినా, సంపదలు తరిగిపోతూ ఉన్న కాలంలో పుట్టిన వాడు ఈ కుర్రవాడు. బాల్యంలో  నాన్నమ్మ, అమ్మ, నాన్న, తాను బాబాయి అని పిలిచే  పెద తండ్రి, వీరితో గడిపే వాడు. చిన్నప్పుడే ఏడేళ్ళ వయసులో తండ్రి మరణం. ముత్తవ్వ చెప్పిన కథలు   వీరేశలింగం ఊహాశక్తికి  రేకలు తొడిగాయి. 
‘తొలి చదువులు చెప్పినది తొర్రి నోటి వాడైన పులిపాక అమ్మిరాజు, గూని నరసరాజు గార్లు. ఈ బాల్యంలోనే పొడుము, పొగచుట్ట  అలవాయు అయ్యాయి. స్కూళ్ళు లేవు కనుక  చదువుకున్నది ఇంటా, బయటా కూడా, బాల రామాయణము, అమర నిఘంటువు, రుక్మిణీ కళ్యాణము, సుమతీ శతకము,  కృష్ణ నామ శతకము, ఆంధ్ర నామ సంగ్రహము ఇవి రోకటి పాటగా వల్లే వేయడం మాత్రమే  వీరేశలింగం చదువు పన్నెండో ఏట దాకా. ఈ కాస్తగా తెలుగు  చదువను, రాయను వచ్చాక, రాజకీయోద్యోగము కోసం, అప్పటి కొలువుల్లో ఉన్న అధికార్ల దగ్గర  పని నేర్చుకోమని  విడిచి పెట్టేవారు. అలా  వీరేశలింగం వెళ్ళినది  తాలూకా కచేరీలో గుమాస్తా గా ఉన్న పోతరాజు రాఘవయ్య గారి వద్దకు.  తరువాత కొద్ది కాలం దూరి సోమయాజులు గారి వద్ద రఘువంశం నేర్చుకున్నారు. ఈలోగా 1857 సిపాయి  విప్లవం   అనంతరం, భారత దేశం  ఇంగ్లీష్ రాణి పాలనలోకి  వెళ్ళిన కారణంగా, ఇంగ్లీష్  చదువులు  కొద్దిగా అందుబాటులోకి వచ్చాయి. అలా వీరేశలింగం  ఇంగ్లీష్ చదువు మొదలు పెట్టె సరికి  వారి వయసు పన్నెండేళ్లు. 

‘స్కూల్ బడి చదువుల కాలంలోనే ఇంట్లో తాటాకులపై ఉన్న  భారతంలోని ఘట్టాలు చదివే వారు. ఈయనకు ఇష్టమైనవి  ఉత్తర గోగ్రహణము, భీష్మ, ద్రోణ, కర్ణ శల్య పర్వములు. అలాగే భాగవతంలో  సప్తమ, దశమ స్కంధములు.  దేహ బలం తక్కువగా ఉండి,  బుద్ధి బలం ఎక్కువగా ఉండేదని  చెప్పుకున్నారు వీరేశలింగం. 

‘ఏకసంథాగ్రాహి కావడంవల్ల, పన్నెండేళ్ళకు  ఇంగ్లీష్ చదువులు మొదలైనా,  తరగతిలో  మొదటి వాడిగా, ఆన్ని పరీక్షల్లో నిలిచేవాడిని అని రాసుకున్నారు. 

‘పురాణాలు బాగా చదవడం వల్ల, తపసు చేస్తే, మునీశ్వరుల్లా మహిమలు సాధించవచ్చు అన్న పిచ్చి బాగాముదిరి, తన స్నేహితులు ముగ్గుర్ణి ఈ కబుర్లతో  ప్రోత్సాహపరిచారు తరుణ వయస్కుడైన వీరేశలింగం. దానితో ఆ వెర్రి తలకెక్కి ఆ ముగ్గురు, ఎప్పుడు ప్రయాణం హిమాలయలకు అంటే ఎప్పుడు అని  ఈయన ప్రాణం తీయడం మొదలెట్టారు. ఆరోగ్యం బాగులేక  తాను రాలేను అని చెప్పి ఈయన  ఊరుకున్నా, ఆ ముగ్గురు విద్యార్ధులు మాత్రం, ఈయన మాటల ప్రభావంలో పది, ఒక నాడు కూల్ కి పోతున్నాము అని చెప్పి ఊరు దాటి వెళ్లారు. ఒకరు ఊరు పొలిమేరల  నుంచే వెనక్కు రాగా, మరొకరు విజయనగరం వరకూ వెళ్లి అక్కడ నుంచి  ఇంటికొచ్చారు. మూడో అతను మాత్రం తన వెండి మొలతాడు అమ్మి, ఆ డబ్బుతో పూరీ జగన్నాధం దాకా పోయి వచ్చారు. అలా  తపసు చేసి మహిమలు సాధిద్దాము  అన్న ఉత్సాహం  అడుగంటింది.  

‘ఏడో ఏటనే ఉపనయనం జరగడం,  త్రిసంధ్యల్లో గాయత్రీ జపం, పొద్దున్నే ఇంటి చుట్టుపక్కల ఉన్న  మార్కండేయ స్వామి ఆలయం,  అటుపై వేణుగోపాలస్వామి ఆలయం దర్శనాలు చేయడం,  సహస్ర గాయత్రి వంటివి నిష్టగా చేయడం, ఇవన్నీ  చిన్ననాటి  చేష్టలుగా చెప్తారు ఈయన. 

‘పన్నెండో ఏట  వీరేశలింగం పెళ్లి  జరిగింది కాతేరు  గ్రామములోని అద్దంకి వారి అమ్మాయి బాపమ్మతో. పెళ్లి తరువాత ఆమె పేరు రాజ్యలక్ష్మిగా మార్చారు వీరేశలింగం  అమ్మగారు. ఈ పెళ్లి గురించి వీరేశలింగం తన స్వీయచరిత్రలో  ఇలా నమోదు చేశారు. పూర్వులాది యందు బాల్యవివాహమన్న పేరే వినియుండరు. వేదములయందు అతి బాల్య వివాహమన్న మాటే మృగ్యము. అస్వాభావికమైన ఈ  అతి బాల్య వివాహ పీడ, యాచారపిశాచావేశబలము చేత వచ్చినదే కానీ విధి విహితమైనది కాదు. మావారు వివాహ నిశ్చయము చేయునప్పటికి, పన్నెండేళ్ళ వాడినైన నాకు వివాహోద్దేశమే తిన్నగా తెలియదు. నా కంటెను నాలుగేండ్లు చిన్నదైన నా భార్యకు మొదలే తెలియదని వేరుగా చెప్పవలయునా? నాకు పదమూడవ ఏటను, నా సహధర్మ చారిణికి తొమ్మిదవ ఏటను, బొమ్మల పెండ్లి వలె మా వివాహ మహోత్సవము నడచినది. పిండి వంటలు తినుటయు, వాద్యములు వినుటయు, వేశ్యల నృత్యములు గనుటయు మాకప్పుడు ఆహ్లాదకరముగానే యుండి యుండును. 

‘ఇప్పట్లో మనం  ఇగ  (సివి)  కరికులం విటే - రాస్తూ ఉంటాము కదా - ఆ రోజుల్లోనే  ఒక  సీస పద్యంలో తన సివి రాశారు కందుకూరి.  అది ఇదీ.                        
బ్రాహ్మణుండను  హూణ భాష నేరిచి యందు
నే బ్రవేశపరీక్షనిచ్చినాడ!
నాంధ్రమున నొకింత యభిరుచి గలవాడ
దేశాభివృద్ధికై  లేశమైన
బ్రాలుమాలక పాటుపడనిచ్ఛ  గలవాడ
గవితా పటిమ  గొంత గలుగువాడ
నోపిక సర్వజనోపయుక్తములైన
విషయములను, నీతి విషయములను
సులభ శైలి నందరకు తెలియునట్లు
కఠిన సంధులు లోనుగా గలవి విడిచి
వ్రాయుదు నొక్కప్పుడన్య  దేశీయములను
లోనుగా గలవానిని బూని కూర్తు
వీరేశలింగం 1874 నుంచి  వివేకవర్ధని పేరిట పత్రిక  నడిపారు.  ఆ పత్రిక పేరు దిగువన విదుర నీతి వాక్యం ఉంచడం కూడా  కందుకూరి వారే ప్రారంభించారు.   ముఖ తిలకముగా  భారత నీతి  వాక్యం  ఉంచాము అని చెప్పారు.   ఆ నీతి వాక్యం  ఇలా తరువాతి పత్రికల్లో కూడా సంపాదకీయ  పేజీలో కనపడేది.

ఒరులేయవి  యొనరించిన నరవర, యప్రియము తన మనమునకగు దా
నొరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మపదములకెల్లన్

(సరళీకరణ - సంకలనం)
 రామతీర్థ 
98492 00385
(నేడు కందుకూరి వీరేశలింగం 170వ జయంతి. అలాగే  మే 27వ తేదీ నుంచి వారి శత వర్ధంతి సంవత్సర ఆరంభం అవుతున్న  సందర్భంగా నేటి తరాల కోసం సరళ భాషలో కందుకూరి వీరేశలింగం గారి జీవితం నుంచి...)

Tags
English Title
Kandukuri chat
Related News