మరో ‘బంగారం’ బండారం

Updated By ManamWed, 03/21/2018 - 11:42
Kanishk Gold Slumps 14 Banks
  • 14 బ్యాంకులకు రూ.824 కోట్ల ఎగనామం.. కనిష్క్ గోల్డ్ భారీ మోసం

  • సీబీఐకి ఎస్బీఐ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు

Kanishk Gold Slumps 14 Banks

చెన్నై: బ్యాంకు స్కాంలు క్యూ కట్టాయి. ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. పీఎన్బీ కుంభకోణం ఇలా బయటపడిందో లేదో... దాని వెనకే మరిన్ని స్కాంలు వచ్చేస్తున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్అనే సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు సహా 14 బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. రూ.824.15 కోట్లకు ముంచింది. ఈ వ్యవహారం ఎస్బీఐ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అయితే, బ్యాంకులకు టోకరా పెట్టిన ఆ సంస్థ కుంభకోణం వడ్డీలతో కలుపుకొటే వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోతుందని ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది. 2007 నుంచి వివిధ బ్యాంకుల నుంచి కనిష్క్ గోల్డ్ సంస్థ రుణాలు పొందినట్టు చెబుతున్నారు. అయితే, ఇందులో బ్యాంకుల లోపాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. సంస్థ తీసుకుంటున్న రుణాలకు సంబంధించి బ్యాంకుల కన్సార్షియం కనీసం క్రాస్ చెక్ చేసుకోకపోగా.. ఏటికేడు రుణాల మొత్తాన్ని (వర్కింగ్ కాపిటల్)ను పెంచుతూ పోయాయని అంటున్నారు.

కాగా, కనిష్క్ సంస్థ ఎస్బీఐకి రూ.240.46 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.128.33 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.46.20 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.49.13 కోట్లు, సిండికేట్ బ్యాంకుకు రూ.54.94 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.53.68 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.45.01 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.21.99 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.22.86 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.32.78 కోట్లు, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకుకు రూ.41.37 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.27.06 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.27.61 కోట్లు, ఆంధ్రా బ్యాంకుకు రూ.32.75 కోట్లకు టోకరా వేసింది సంస్థ. అయితే, కొన్నాళ్ల క్రితం సంస్థ చైర్మన్ భూపేశ్ జైన్‌ను బ్యాంకులు సంప్రదించేందుకు ప్రయత్నించగా అతడు ఫోన్లు స్వీకరించకపోవడంతో.. రుణాల కోసం అతగాడు చూపించిన సంస్థల చిరునామాల వద్దకు బ్యాంకు అధికారులు వెళ్లారు. అయితే, ఆయా చిరునామాల్లో ఔట్ లెట్లుగానీ, ఉత్పత్తి సంస్థలు గానీ లేకపోవడంతో ఖంగు తినడం అధికారుల వంతైంది. దీంతో వెంటనే సీబీఐకి ఎస్బీఐ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. 

English Title
Kanishk Gold Slumps 14 Banks
Related News