కౌశల్ ఆర్మీ.. ఒక స్ట్రాటజీ!

Updated By ManamSun, 09/23/2018 - 07:20
 mini screen

image‘బిగ్ బాస్’ నిర్వాహకులకే షాక్.. ఎలా స్పందించాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి. షోలో ఎవరు గెలవాలి అన్నది నిర్ణయించే స్థాయికి ఫ్యాన్స్ చేరుకోవడం టీవీ రియాల్టీ షోల్లోనే మొదటిసారి! అంతేకాదు రియాల్టీ షోలన్నాక ఎలిమినేషన్ తప్పనిసరి. ఈ ప్రక్రియలో ప్రతివారం ఫలానా వారిని ఎలిమినేట్ చేయాలని ఎజెండా సైతం సెట్ చేసే స్థాయికి అభిమానులు చేరుకున్నారంటే వింతే మరి. నేటి సమాజం ఎటువైపు పయనిస్తున్నదనే దానికి ఇది నిదర్శనం కూడా.

ఏకపక్షమేనా?
ఇండియా ట్రెండింగ్‌లో టాప్ 3కి ‘కౌశల్ ఆర్మీ’ అనే పదం వెళ్లిందంటే ఇది ఎంత ప్రభావవంతంగా మారిందో అర్థమవుతుంది. నెటిజెన్స్‌కు ఇప్పుడు ఇది హాట్ టాపిక్. నిజానికి టీవీ షోలు, లేదా హైలైట్స్ చూస్తే ఆ ఎపిసోడ్ అంతా అర్థమవుతుంది. కానీ వెరైటీగా ‘బిగ్ బాస్ 2’ చూడాలంటే ట్రాలింగ్ చూస్తే చాలు మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. రోజూ గంటన్నర టీవీ ముందు కూర్చునే బదులు మీమ్స్, ట్రాల్స్, సెటైర్లు చూస్తే క్షణాల్లో మ్యాటర్ అర్థమయ్యేలా కౌశల్ ఆర్మీ నెట్‌లో సందడి చేస్తోంది. బిగ్ బాస్ కంటెస్టంట్ అయిన నటుడు కౌశల్‌కు మద్దతుగా ఏర్పడిన అభిమాన బృందం తాజాగా చేపట్టిన టూ కే వాక్ పెద్ద హిట్ అయిందంటే కౌశల్ ఇమేజ్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు షో మొత్తం ఏకపక్షంగా సాగుతోంది.  బిగ్ బాస్ ఇంట్లో అంతా కౌశల్ వర్సెస్ మిగతా కంటెస్టంట్లుగా పోటీ సాగుతోంది.

ఆయనతో పెట్టుకుంటే ‘ఫసక్’
imageముక్కుసూటి మనస్తత్వం ఉన్న కౌశల్ చాలా క్లియర్‌గా, టైటిల్ గెలవాలన్న సింగిల్ పాయింట్‌తో గేమ్ ఆడుతున్నారు. కానీ హౌస్‌లో ఆయనతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వారి కథ ‘ఫసక్’ అనేలా సెంటిమెంట్ పుట్టి, ప్రతి వారం నిజమవుతుండడం ఇక్కడ హైలైట్. నామినేషన్‌లో ఉన్నవారు కౌశల్‌ను విమర్శించినా, పొరపాటున ఆయనతో విభేదించి గొడవపడ్డారో వారి ఖేల్ ఖతం. కిరీటి, భానుశ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందినిల ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం వారు గేమ్ ఆడిన విధానం కాదు. వీరంతా చేసిన ఏకైక తప్పు కౌశల్‌తో గొడవ పడటం అంతే! దెబ్బకు వీరంతా షో నుంచి ఔట్ అయ్యారు. తమిళ్ ‘బిగ్ బాస్’లోనూ ఓవియా అనే ఒక మహిళా కంటెస్టంట్ ఇలాగే ఓ ఆర్మీని నిర్వహించినట్టు తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తన ఫ్యాన్స్ ఆర్మీ అతి కారణంగా ఆమె విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైంది. ఇక కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని, కౌశల్ స్వయంగా క్రియేట్ చేసిన ఈ గ్రూప్ మేలో రిజిస్టరైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

సోషల్ మీడియా వార్
కౌశల్ ఆర్మీ కేరళ వరద బాధితులకు సాయం చేసి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్ పూర్తయ్యాక కూడాimage వీరు ఇలాగే సామాజిక కార్యక్రమాలను కొనసాగించేలా కనిపిస్తోంది. మరోవైపు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించకపోతే ఊరుకునేది లేదంటూ గట్టి హెచ్చరికలు చేస్తూ, మరోవైపు షో హోస్ట్ నానిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న ఆర్మీని బిగ్ బాస్ యాజమాన్యం ఎలా మేనేజ్ చేయబోతోందన్న విషయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కౌశల్ విన్నర్ అయితే మాత్రం రియాల్టీ షోలన్నీ ఇలాంటి ఆర్మీలు, అభిమానులనే రిమోట్ కంట్రోలర్‌తోనే భవిష్యత్‌లో ఆపరేట్ అవ్వడం ఖాయం. అంటే కంటెస్టంట్స్ అందరూ ఇలాంటి సర్వీసులను ఏర్పాటు చేసుకుని, ఓట్ల వర్షం కురిపించేసుకుంటే వార్ వన్ సైడ్ అయిపోతుందనే స్ట్రాటెజీలు కామన్ అయిపోతాయి. అప్పుడు పార్టిసిపెంట్ల మధ్య కాకుండా షో బయట ఆయా వ్యక్తులకున్న ఇంటర్నెట్ ఫాలోయర్ల మధ్యనే అసలు పోటీ నడుస్తోంది. అంటే ఇదంతా సోషల్ మీడియా వార్‌గా మారిపోయే ప్రమాదముంది. ఇక ఇలాంటి సర్వీసులు అందించే కన్సల్టెన్సీ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయన్నమాట. లైకుల బిజినెస్‌లా ఓట్ల బిజినెస్ అనే కుంభకోణం భవిష్యత్‌లో బుల్లితెరను ఏలబోతోందా?
 - భార్గవి కరణం

English Title
Kaushal Army .. A Strategy!
Related News