కేరళకు కేసీఆర్ కొండంత సాయం!

Updated By ManamFri, 08/17/2018 - 22:14
Kerala flood news: CM KCR announces Rs 25 crore flood relief

 Rs 25 Crores as immediate assistance towards KeralaFloods

హైదరాబాద్‌: గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళకు తెలంగాణ తరఫున 25 కోట్ల రూపాయల తక్షణసహాయాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ 25 కోట్ల రూపాయిల మొత్తాన్ని వెంటనే కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేసీఆర్ ఆదేశించారు. అంతేకాదు.. వరదల వల్ల జలకాలుష్యం అయిన ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల రూపాయల విలువైన ఆర్వో యంత్రాలను సైతం తెలంగాణ సర్కార్ కేరళకు పంపనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. " కేరళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా మనకుంది. కేరళ రాష్ట్రంలో విపత్తు వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్తు నుంచి కేరళ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రం తరఫున ఎలాంటి సాయం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగ ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య వేత్తలు, ఇతర రంగాల వారు కూడా ఇతోధికంగా సాయం అందించేందుకు ముందుకు రావాలి" అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తే వాటిని తక్షణమే కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. 

కష్టాల్లో ఉన్న కేరళ ప్రజలను ఆదుకోవడానికి కొండంత మనసుతో సాయం చేసిన కేసీఆర్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ వంతుగా సాయం చేసి కేరళ వాసులను కాపాడుకుందామని ఇదివరకే మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐదు కోట్ల ఆర్థికసాయం చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం తమవంతుగా కేరళకు సాయం అందిస్తున్నారు. భారీ వర్షాలతో పాటు మరోవైపు కొండచరియలు విరిగిపడుతుండటంతో కేరళ ప్రజలు విలవిల్లాడుతున్నారు. వరద బీభత్సం కారణంగా దాదాపు రెండు లక్షల మందికిపైగా నిరాశ్రయులవ్వగా, వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఇళ్లు కుప్పకూలిపోయాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగుతూనే ఉంది.

English Title
Kerala flood news: CM KCR announces Rs 25 crore flood relief
Related News