రిచర్డ్స్ రికార్డుకు చేరువలో కోహ్లీ

Updated By ManamWed, 02/21/2018 - 00:38
virat kohli

Virat Kohli సెంచూరియన్: రెయిన్‌బో దేశంలో అదరగొడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డులకు మరింత చేరువయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో (3 టెస్టులు, 6 వన్డేలు, 1 టీ20) 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు చేసిన కోహ్లీ ఒకే టూర్‌లో 1000 పరుగులకు మరో 130 పరుగుల దూరంలో ఉన్నాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 87.00 సగటుతో 82.38 సగటుతో 870 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 91 ఫోర్లు ఉన్నాయి. పురుషుల క్రికెట్ చరిత్రలో విదేశీ పర్యటనలో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్. ఈ ఘనతను రిచర్డ్స్ 1976లో సాధించారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆయన 1045 పరుగులు చేశారు. రిచర్డ్స్ వన్డేల్లో 216, నాలుగు టెస్టుల్లో 829 పరుగులు చేశారు. కోహ్లీ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 289 పరుగులుచేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. 6 వన్డేల్లో 558 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. అలాగే జొహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో కోహ్లీ 26 పరుగులు చేశాడు. దీన్నిబట్టి చూస్తే రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇక ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఐదు టెస్టుల్లో 974 పరుగులు చేశారు. ఈ రికార్డుకు కోహ్లీ 104 పరుగుల దూరంలో ఉన్నాడు. 

విరాట్ ఖాతాలో అరుదైన రికార్డు
రికార్డులను బద్దలు కొట్టడాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అలవాటుగా పెట్టుకున్నాడు. కానీ ఇది ప్రత్యేకం. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్ రేటింగ్స్‌లో కోహ్లీకి అత్యధికంగా 909 పాయింట్లు వచ్చాయి. 27 ఏళ్లలో ఇంతటి అత్యధిక పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. అసక్తికరమైన అంశమేంటంటే.. అన్ని ఫార్మాట్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా కోహ్లీనే. వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో ఉన్న కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (947) తర్వాత 912 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో బాబర్ ఆజామ్ (786), ఆరోన్ ఫించ్ (784) తర్వాత 776 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 1991లో డీన్ జోన్స్ తర్వాత కోహ్లీ మాత్రమే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించాడు. గతంలో వివియన్ రిచర్డ్స్ (1985లో 935), జహీర్ ఖాన్ 1983లో 931), గ్రెగ్ చాపెల్ (1981లో 921), డేవిడ్ గోవర్ (1983లో 919), జావెద్ మియాందాద్ (1987లో 910) అత్యధిక పాయింట్లు సాధించారు. అయితే 900 పాయింట్ల మార్క్‌ను చేరుకున్న భారత తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 123 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

English Title
Kohli closest to Richards' record
Related News