కోహ్లీ బ్యాటింగ్‌పై నమ్మకముంది

Ishant Sharma
  • టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఫ్రంట్ ఫూట్ నో బాల్స్‌పై శనివారం స్థానిక మీడియా టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మను టార్గెట్ చేసి పరిహాసమాడింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఇషాంత్ కొన్ని నోబాల్స్ వేశాడు. ఫీల్డ్ అంపైర్లు గమనించక పోవడంతో తప్పించుకున్నాడు. ఈ ఓవర్ స్టెప్ వల్ల రెండు సందర్భాల్లో టీమిండియాకు వికెట్లు లభించలేదు. అంపైర్ల పేలవ అంపైరింగ్‌కు ఆతిథ్య దేశం చిరాకు పడింది. ‘ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియన్ మీడియా జవాబు చెప్పాలి. నేను కాదు. చాలా కాలంగా నేను క్రికెట్ ఆడుతున్నాను. ఇలాంటివి జరిగాయి. మనం మానవమాత్రులం. తప్పులు జరుగుతుంటాయి. వాటి గురించి నాకు బాధలేదు’ అని ఇషాంత్ జవాబిచ్చాడు. రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే కీలకపాత్ర పోషించారు. ‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే మాలో విశ్వాసం పెరుగుతుంది. రెండో రోజు ఆటను మేము పటిష్ట స్థితిలో ముగించాం. వాళ్లిద్దరూ బ్యాటింగ్ కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మ్యాచ్ సమతుల్యంగా ఉంది. ఆదివారం తొలి సెషన్‌లో మా ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తున్నాను’ అని ఇషాంత్ అన్నాడు.

సంబంధిత వార్తలు