రేపో మాపో శాసనసభ రద్దు!

Updated By ManamSun, 09/02/2018 - 04:01
ts
  • డిసెంబర్‌లోపే ఎన్నికలు..?

  • నేడు మంత్రివర్గ కీలక భేటీ.. పెండింగ్ ఫైళ్లకు ఆమోద ముద్ర

  • అన్ని వర్గాలపై వరాల జల్లు.. ఉద్యోగులు, నిరుద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్: శాసనసభ రద్దుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. డిసెంబర్‌లోపే శాసనసభకు ఎన్నికలు జరిపించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నందున శానసనభ రద్దు ప్రక్రియలో వేగం పెరిగింది. ప్రగతి నివేదన సభ జరగడానికి రెండు గంటల ముందే మంత్రివర్గం భేటీ కాబోతుంది. కేబినెట్ ఆమోదం పొందాల్సిన అనేక ముఖ్యమైన ఫైళ్లు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చేరాయి. వీటిలో సుమారు వందకు పైగా ఫైళ్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లకు ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. లేని పక్షంలో మరో ఆరు మాసాల పాటు వివిధ శాఖల పరిధిలో పనులు నిలిచిపోయే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

image


ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే విధంగా కొత్త నిర్ణయాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. ఉద్యోగులకు కరవు భత్యం, మధ్యంతర భృతి, వృద్ధాప్య, వికలాంగ, వితంతువుల పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, గుర్తించబడిన 31 కులాలకు సామాజిక భవనాలు కట్టించడానికి భూముల కేటాయింపు తదితర అంశాల్లో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. అన్నిరంగాల్లో ముందున్నం.. అందుకే ముందస్తుకు.. ‘రాష్ట్ర ఆదాయం 17.5 శాతం పెరిగింది. ఈ రాబడిని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం, అప్పులు చేసి ఆస్తులను కూడగడుతున్నాం, విద్యుత్ కోతలకు చరమగీతం పలికాం, సాగునీటి రంగానికి పెద్ద పీట వేశాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్ధను మెరుగుపరిచాం, వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చాం, రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం, ప్రైవేటు రంగంలో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగాం. పారిశ్రామిక పెట్టుబడులు రూ.1,23,000 కోట్లకు పెంచగలిగాం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతను ఇచ్చాం, అన్ని రంగాల్లో మెరుగైన ప్రగతిని చూపించగలిగాం, పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచాం, అందుకే ముందస్తు ఎన్నికలతో ప్రజల మద్దతు కోరుతున్నాం’ అని అధికార పార్టీ సీనియర్ నాయకులు తెలియజేశారు.

ఆదివారం సాయంత్రం నగర శివారులోని కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేశారు. సుమారు 25 లక్షల మందిని సభకు సమీకరిస్తున్నారు. ఈ సభావేదిక నుంచే కేసీఆర్, మంత్రివర్గ నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది. శాసనసభను సమావేశపర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని తెలిసింది. ఆదివారం సాయంత్రం సభ ముగిసిన వెంటనే రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలుసుకొని శాసనసభ రద్దు నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. శాసనసభలో తెరాసకు 90 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 13, మజ్లీస్‌కు 7, భాజపాకు 5, టీడీపీకి 3, సీపీఎంకు ఒక స్థానం ఉంది. గత ఎన్నికల్లో తెరాసకు 66,20, 326 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 56,68,061 ఓట్లు వచ్చాయి. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తెరాస ఓట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు మాసాలుగా అంతర్గతంగా రాజకీయ కసరత్తు చేశారు. ఢీల్లీ స్థాయిలో జరగాల్సిన పనులను చక్కదిద్దుకున్నారు. జోనల్  వ్యవస్ధకు రాష్ట్రపతి ఆమోదం పొందడంలో విజయం సాధించారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు తీపి కబురు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. పార్టీ సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ వ్యూహాన్ని వెల్లడించడంతో పాటుగా యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్దం చేశారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరిపించాలనే పట్టుదలతో కార్యక్రమాల్లో వేగం పెంచారు.

English Title
legislative termination
Related News