సాధారణం కంటే తక్కువ

Updated By ManamThu, 08/02/2018 - 23:20
farmer
  • ఈ ఏడాది వర్షపాతం అంచనా.. వేడెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం

  • మళ్లీ ఎల్ నినో ముప్పు తప్పదు.. బలహీనపడ్డ నైరుతి రుతుపవనాలు

  • ముఖం చాటేసిన వరుణుడు.. దేశానికి 25 శాతం కరువు ముప్పు

  • పెరగనున్న ఆహారోత్పత్తుల ధరలు.. వాతావరణంపై స్కైమెట్ నివేదిక 

farmerన్యూఢిల్లీ:  ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే పడే అవకాశముందని స్కైమెట్ నివేదిక వెల్లడించింది. స్కైమెట్ వెదర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తేల్చిన తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవ్వనుంది. వీరి అంచనాలకు అటో ఇటో 5 శాతం మాత్రమే వ్యత్యాసం ఉండే అవకాశాలుండగా ఈ వార్త రైతులకు పిడుగులా మారింది. దీంతో వంటనూనెలు, చిరుధాన్యాలు, చక్కెర వంటి దిగుమతులు తప్పకపోవచ్చని ఈ వెబ్‌సైట్ భావిస్తోంది. దక్షిణాసియాలో అత్యధికంగా వరి, గోధుమ, చక్కెర, పత్తి ఉత్పత్తి చేసే దేశంగా ఉన్న మనదేశంలో వ్యవసాయం వర్షాధారితమైనదే. నైరుతి రుతుపవనాలు ఆగస్టులో మరింత బలహీనపడనున్న నేపథ్యంలో రెండవ విడతలో తక్కువ వర్షపాతం నమోదవ్వచ్చని నివేదిక చెబుతోంది.  రుతుపవనాలను చురుగ్గా చేసే పరిస్థితులు సముద్రంలో ప్రస్తుతం లేకపోవడంతో ఇదంతా జరుగుతోందని స్కైమెట్ వివరించింది.  పసిఫిక్ మహాసముద్రం వేడెక్కుతోందని, దీంతో ఎల్ నినో ముప్పు తప్పేలా లేదని హెచ్చరించింది.  దీని ప్రభావంతో ఆసియా, ఆస్ట్రేలియాల్లోని పలుప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగనుంది. హిందూమహాసముద్రంలోని రెండు ధ్రువాల్లో ప్రస్తుతం వాతావరణం తటస్థంగా ఉన్నట్టు వీరు వివరిస్తున్నారు.  సెప్టంబరు లేదా ఆతరువాత కూడా ఈ పరిస్థితుల్లో మార్పుఉండకపోవచ్చని స్కైమెట్ వివరించింది.  ఈ ఏడాది ఆగస్టు వరకూ 96శాతం వర్షాలు కురిసే అవకాశాలుండచ్చని ముందుగా అంచనా వేసిన ప్పటికీ దీర్ఘకాలిక సగటును తీసుకుంటే ఇప్పటివరకూ దేశంలో 88శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక గత అంచనాల ప్రకారం సెప్టంబరు మాసాంతానికి 101శాతం వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా తాజాగా స్కైమెట్ వేసిన అంచనాల ప్రకారం ఇది 93శాతం మాత్రమే ఉండనుంది.  భారత వాతావరణ పరిశోధనాశాఖ వెల్లడించిన సమాచారం మేరకు సాధారణ వర్షపాతం కంటే 6 శాతం తక్కువ వర్షపాతం జూన్ 1 వరకూ నమోదైంది.  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేక రైతులు విలవిల అంటూంటే స్కైమెట్ వెల్లడించిన సమాచారం రైతన్నలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.  మనదేశంలో వ్యవసాయం నైరుతి రుతుపవనాలపైనే అత్యధికంగా ఆధారపడి ఉండడంతో ఈ ఏడాది ధరాఘాతం తప్పేలా లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఎండుతున్న పంటలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వచ్చినా.. ప్రారంభంలో విస్తారంగా వర్షాలు పడినా.. ఇటీవల వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వర్షాధార పంటలకు నష్టం ఏర్పడుతోంది. రాయలసీమలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాధారంతో సాగు చేసే వేరు శనగ, కంది పంటలు దెబ్బతింటున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు పడటంతో రైతులు పంటలను సాగు చేశారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకుంటే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని, పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English Title
Less than normal
Related News