స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం తగ్గకుండా చూడాలి

Hanumantha Rao
  • వచ్చే శాసనసభ సమావేశాల్లో  ప్రభుత్వంపై వత్తిడి తేవాలి: వీహెచ్

హైదరాబాద్: జనవరిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పీసీసీ మాజీ చీఫ్ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. శనివారం గాంధీభవన్‌లో వీహెచ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టానికి  రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సవరణల మూలంగా ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 34 శాతం ఉన్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని 23 శాతానికి తగ్గించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే అంటూ జరిగితే వెనుకబడిన వర్గాలు ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్లు తగ్గించకుండా చేపట్టాల్సిన చర్యలపై సీఎల్పీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. త్వరలో మొదలు కానున్న శాసనసభ సమావేశాల్లో కూడా ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాలని కోరారు.ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కకు విహెచ్ వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత వార్తలు