కాంగ్రెస్‌కు చెయ్యిచ్చిన మాయ

Updated By ManamFri, 09/21/2018 - 22:44
mayawathi
  • మూడు రాష్ట్రాల్లో పొత్తు లేనట్లే

  • ఛత్తీస్‌గఢ్‌లో జోగితో కూటమి.. మధ్యప్రదేశ్‌లో సొంతంగా పోటీ

  • రాజస్థాన్‌లో పొత్తుండదని వెల్లడి.. చీలనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు

mayawathiరాయ్‌పూర్: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగి కొత్తగా ఏర్పాటుచేసిన జనతా కాంగ్రెస్‌తో తాము పొత్తు పెట్టుకుంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ఒకవైపు అనుకుంటుండగానే అక్కడ 22 మంది అభ్యర్థుల జాబితాను బీఎస్పీ ఏకపక్షంగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో బీఎస్పీ 35 స్థానాలలో పోటీ చేయనుండగా, జేసీసీ అభ్యర్థులు 55 స్థానాలలో నిలబడనున్నారు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా అజిత్ జోగి పేరును ముందే ప్రకటించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో బీఎస్పీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా జైపూర్ నియోజకవర్గానికి చెందిన కేశవ్ చంద్ర ఉన్నారు. 2013 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసి 4.29 శాతం ఓట్లు సంపాదించింది. 84 చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. జేసీసీ ఇప్పటికే 41 మంది అభ్యర్థులను ప్రకటించింది. కానీ మరో వైపు పొత్తు ఉండటంతో ఆయా స్థానాల్లో ప్రకటించిన వారి భవిష్యత్తు ఏమవుతుందో చూడాల్సి ఉంది.మధ్యప్రదేశ్‌లో 22 మంది అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించిన మాయావతి, రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించారు. దాంతో ఇప్పుడు ఈ ఏడాది ఆఖరిలో ఎన్నికలు జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలోనూ బీఎస్పీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు లేనట్లయింది. దీనివల్ల ఆ మూడు రాష్ట్రాలలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఖాయమని తేలింది. అదే జరిగితే పాలకపక్షమైన బీజేపీకి నెత్తిన పాలుపోసినట్లే అవుతుంది. గురువారం ప్రకటించిన టికెట్లలో ముగ్గురు సిట్టింగ్ అభ్యర్థులకు మాయావతి మళ్లీ అవకాశం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో మరిన్ని స్థానాలలో పోటీకి తమకు అవకాశం కల్పించాలన్న మాయావతి డిమాండును కాంగ్రెస్ అధిష్ఠానం తప్పనసరిగా పరిగణనలోకి తీసుకునేలా ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో మొత్తం 227 స్థానాలకు గాను నాలుగు చోట్ల మాత్రమే గెలిచిన బీఎస్పీ.. మొత్తం 6.42 శాతం ఓట్లు సాధించింది. 194 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. తమకు పట్టున్న గ్వాలియర్-చంబల్ ప్రాంతం, బుందేల్‌ఖండ్, బాఘల్‌ఖండ్ ప్రాంతాలలోనే మాయావతి తాజాగా టికెట్లు ప్రకటించారు. 

Tags
English Title
The magic of the Congress
Related News