‘మహా’ ముట్టడి!

Updated By ManamTue, 03/13/2018 - 01:03
formers rally

formers rallyమహారాష్ట్రలో రైతుల మహా ధర్నా విజయవంతమైంది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్ర అసెంబ్లీని సోమవారం ముట్టడి చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) సారథ్యంలో భారీ నిరసన ర్యాలీ ఐదు రోజుల క్రితం నాసిక్ నుంచి ముంబయి దాకా జరిగింది. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, అటవీ భూములను గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు బదిలీ చేయాలని, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, రైతులకు నష్ట పరిహారం పెంచాలని,  స్వామినాథన్ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లపై దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ధర్నాలో సుమారు 40 వేలమంది రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. మార్చి 6న నాసిక్‌లో ప్రారంభమైన ఈ మహా రైతు పాదయాత్ర 180 కిలోమీటర్ల దూరంలోని అజాద్ మైదానానికి చేరుకుంది. ఈ రైతు నిరసన మహారాష్ట్ర రైతులకు పరిమితమైనది కాదు, దేశవ్యాప్తంగా రైతు దుస్థితికి, అసంతృప్తికి, ఆగ్రహానికి అద్దం పడుతుంది. రైతుల ఈ ధర్మాగ్రహ ప్రదర్శనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రధానమైన డిమాండ్లన్నిటినీ అంగీకరించక తప్పలేదు. ఎన్నికల సీజన్ కావడంతో రైతులపై అణచివేత చర్యలకు పాల్పడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేసింది. దానికి తోడు ప్రభుత్వ భాగస్వామ్య పక్షం శివసేన నేత ఏకనాథ్ షిండే, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేనలు కూడా రైతు ముట్టడికి మద్దతు ఇవ్వడంతో ఆ ఉద్యమానికి మరింత బలం చేకూరింది. 12 మంది రైతు నాయకులతో ఏర్పడిన కమిటీకి, మంత్రివర్గ కమిటీకి రైతాంగ సమస్యల పరిష్కారంపై చర్చలు సానుకూలంగా జరగడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉపద్రవం తప్పినట్టు ప్రభుత్వవర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.     

పంటలకు గిట్టుబాటు ధరల కోసం రైతాంగం నిరసన ప్రదర్శనలు చేయడం  నేడు ప్రత్యేక లక్షణంగా మారింది. అక్టోబర్, నవంబర్ మాసా లలో పప్పు దినుసులు, నూనె గింజల మార్కెట్ ధర పడిపోవడంతో  మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అసంతృప్తి కట్టలు తెంచుకుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వగైరా ఆర్థిక చర్యల కారణంగా వ్యాపారులు తగినంత పంటను నిల్వ చేసుకోక పోవడం వంటి ఇతరత్రా కారణాలు, ప్రపంచ మార్కెట్లో సోయా, మొక్కజొన్న ధర తగ్గడం వగైరా మిశ్రమ కారణాల వల్ల వాటి మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువకు దిగజారడంతో లాటర్, కల్‌బురగి రైతాంగం రోడ్లపై నిరసన ప్రదర్శనలకు దిగారు. పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు మధ్యప్రదేశ్‌లోని మందసోర్ రైతులపై కాల్పులు జరగడంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్  రాజధాని జైపూర్‌కు కూతవేటు దూరంలో నిందార్‌లో గృహ నిర్మాణ ప్రాజెక్టుకోసం ప్రభుత్వం చేసిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గాంధీ జయంతి రోజున రైతులు ప్రారంభించిన ‘భూ సమాధి సత్యాగ్రహం’ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. తమిళనాడు ఉభయ రాష్ట్రాలే కాదు, ఉత్తర భారతంలోనూ ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ రైతులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 

భూతాపం పెరుగుతుండడంతో భూగోళంపై అనూహ్య రీతిలో ఆకస్మిక వాతావరణ మార్పులు సంభవిస్తుండడం రుతుపవనాలు దారితప్పడంతో దేశం లో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏకకాలంలో నెలకొని పంట నష్టాలు సంభ విస్తున్నాయి. వరుస పంట నష్టాలనైనా భరించగలిగిన రైతాంగం అంతకంటే ముఖ్యంగా పెరుగుతున్న ఉత్పాదక ఖర్చుల దెబ్బకు విలవిల్లాడుతూ, గిట్టుబాటు ధరలేక అప్పుల విషవలయంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం భరించలేని స్థాయికి చేరుకుంది. ఉత్పాదక ఖర్చులు, పంటల ధరలు రైతాంగానికి వ్యతిరేకంగానూ, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. ‘హరిత విప్లవం’ ప్రయోగం ప్రారంభంలో దేశంలో తిండి గింజలు కొరత తీర్చినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వంటి ఖర్చులు పెరిగిపోయి, గిట్టుబాటు ధరలు లేకపోవడమే కాకుండా, భూసారం దెబ్బతిని వ్యవసాయ దిగుబడులు గణనీ యంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయరంగ సంక్షోభానికి పరిష్కారంగా రెండవ హరిత విప్లవం తీసుకురావాలని పాలకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విధానంతో దేశం పునరుద్ధరించడానికి వీలులేని ఆర్థిక, పర్యావరణ, సామాజిక సంక్షోభాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.

సంక్షోభంలోకి కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని పునర్జీవింపచేయడానికి బదులుగా, ఆ రంగంపై ఆధారపడుతున్న ప్రజలను ఇతర రంగాలలో అను బంధ, నైపుణ్యరహిత కార్మికులుగా మళ్లే విధంగా ప్రభుత్వాలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి. పేదరిక నిర్మూలనంటే పేదలను నిర్మూలించినట్లుగా, వ్యవ సాయ రంగ పరిష్కారానికి వ్యవసాయదారుల జనాభాను పారిశ్రామిక రంగ అను బంధ నైపుణ్యరహిత చౌక శ్రమశక్తిగా మార్చే ప్రభుత్వ విధానాల వల్ల రైతాంగ ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయి. అందులో భాగంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరు మీద వ్యవసాయోగ్యమైన భూమిని ప్రభుత్వం కారుచౌకగా సేకరించి పారి శ్రామిక వర్గాలకు ధారాదత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పంట భూములను బల వంతంగా తీసుకోవద్దని రైతాంగం ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.  రుణాలను అందించడం, గిట్టుబాటు ధరల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికల్ని అమలులోకి తీసుకు రావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ మౌలిక సదు పాయాలు, ఉత్పాదకాల కోసం ప్రణాళికాబద్ధంగా తగు పరిమాణంలో ప్రభుత్వం మదుపులు పెట్టకపోతే... మద్దతు ధరలు, ధర పరిహార చెల్లింపులు, రుణ పరిమా ణాన్ని పెంచడం వంటి చర్యలు రైతు కన్నీటిని తుడవలేవు. నర్మదా నదీ పరివాహ ప్రాంతం, తూర్పు, పడమటి కనుమల ప్రాంతాల్లో మరాఠీ, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడే డెక్కన్ ప్రాంత రైతాంగం 1875-77 మధ్యకాలంలో ‘దక్కన్ ఉపద్రవం’ పేరుతో బ్రిటీష్ వ్యాపారస్తులు, వారి అండదండలతో దారుణాలకు ఒడిగట్టిన స్థానిక వడ్డీవ్యాపారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల వ్యవసాయ, పారిశ్రామిక విధానాల కారణంగా దక్కన్ ప్రాంతంలో అలనాటి ఆత్మహనన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దడంలో ప్రభుత్వాలు విఫలమైతే మరో ‘దక్కన్ ఉపద్రవాన్ని’ పాలకులు ఎదుర్కొనడం ఖాయం.

English Title
Maharashtra farmers rally
Related News