క్యాబ్ డ్రైవర్‌లా వచ్చి.. మహిళపై లైంగిక వేధింపులు

Updated By ManamTue, 03/13/2018 - 14:28
Uber Driver, Man Posing As Uber Driver, Locks Delhi Woman In Car, Harasses Her

Uber Driver, Man Posing As Uber Driver, Locks Delhi Woman In Car, Harasses Her న్యూఢిల్లీ/హరియాణా: క్యాబుల్లో ప్రయాణించే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉబర్ క్యాబ్‌ డ్రైవర్‌ పేరిట ఓ 22ఏళ్ల వ్యక్తి.. ఢిల్లీ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. విచారణలో అతగాడు క్యాబ్ డ్రైవర్ కాదనే తేలడంతో పోలీసులు విస్తుపోయారు. క్యాబ్ డైవర్ స్థానంలో ఇతగాడు వెళ్లి మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగిందంటే.. ఎంఎన్‌సీలో అడ్వైజర్‌గా పని చేస్తున్న 29ఏళ్ల మహిళ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఈ నెల 9న ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. తాను బుక్ చేసుకున్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ ముఖం.. ఇతగాడి ముఖం సరిపోలకపోవడంతో మహిళకు అనుమానం వచ్చింది. అప్పటికే మద్యం సేవించిన అతడు.. వెళ్లాల్సిన మార్గం నుంచి కాకుండా మరో మార్గంలో కారును తీసుకెళ్లడంతో ఆమె భయాందోళనకు గురైంది.

కారు డోర్లు లాక్ చేసి..
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో నుంచి దిగేందుకు బాధితురాలు యత్నించడంతో డ్రైవర్ కారు డోర్లను లాక్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కొద్దిసేపటి తరువాత సీఎన్‌జీ స్టేషన్ దగ్గర జీటీకే డిపో వద్ద కారును నెమ్మదిగా పోనిచ్చాడు. ఇదే అవకాశాన్ని అనువుగా భావించిన బాధితురాలు కారు డోర్లను అన్‌లాక్ చేసి తప్పించుకుంది. ఆ తరువాత బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారుతో పరారైన నిందితుడిని చివరికి పోలీసులు ఉబర్ క్యాబ్ వాహనం వివరాల ఆధారంగా ట్రేస్ చేయడంతో హరియాణాలోని సోనిపట్ గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. కారులో మద్యం మత్తులో పడివున్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలు క్యాబ్ డ్రైవర్‌పై ఉబర్ చర్యలు.. 
నిందితుడు సంజీవ్‌ అలియాస్‌ సంజు హరియాణాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ వివరాలు సంజయ్‌ పేరు మీద నమోదు కాలేదు. అసలు ఇతగాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదట. ఉబర్ క్యాబ్ డ్రైవర్ అసలు వ్యక్తి సంజుకి స్నేహితుడు కావడంతో అతనికి వచ్చే బుకింగ్‌లను తాను రిసీవ్ చేసుకుని మహిళలపై లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉబెర్‌ స్పందిస్తూ... సదరు ఉబర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. తాను నడపాల్సిన క్యాబ్‌ను వేరొకరికి ఇచ్చినందుకు అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నామని, విచారణలో పోలీసులకు పూర్తి సహకారాన్ని అందిస్తామంటూ ఓ ప్రకటనలో వెల్లడించింది.

English Title
Man Posing As Uber Driver Allegedly Locks Delhi Woman In Car, Harasses Her
Related News