తర‘గతి-గమ్యం’

Updated By ManamSat, 09/08/2018 - 05:31
maithri

ఈ భూమ్మీద మన ఉనికి ప్రతి క్షణం ‘నేర్చుకోవడానికి’ ఉద్దేశించిందే! జీవితానికి మించిన గురువు లేడు. ఆ గురువుకు కూడా అక్షరాభ్యాసం చేయించేది ‘తరగతి గది’. మనిషి సమాజంతో కలిసి చేసే ప్రయాణానికి తొలి అడుగు కూడా తరగతి గదితోనే మొదలవుతుంది. అలాగే పిల్లవాడు అడిగే ప్రతి ప్రశ్న విలువైందే, అయితే ఆ ప్రశ్నకు వెంటనే జవాబివ్వాలన్న తాపత్రయం ముఖ్యం కాదు, ఆ ప్రశ్న దానికదే ఎంతో విలువైందన్న స్పృహను కలిగి ఉండడమే ప్రధానం. ఆ ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్నను మొగ్గలోనే చిదిమేయకుండా కాపాడుకోవాలి. నేర్చుకోవడమే వేడుకైన ‘బాల్యం’ ఒక నిరంతర అధ్యయనశీలి. ఆ అధ్యయనాన్ని కొనసాగనివ్వాలి. బొమ్మల్ని పగలగొట్టి, తిరిగి అతికిస్తూ జీవితపాఠాల్ని నేర్చుకునే బాల్యానికి తరగతి గది ఒక చుక్కాని. అలాంటి ‘తరగతి’ని గురించిన విశేషాలతో ఇవాల్టి ‘మైత్రి’ మిమ్మల్ని పలకరిస్తోంది. 
 

image


తెలంగాణ చదువులకు కొత్త ఊతం
ఎప్పటికీ కలుసుకోని పట్టాల మీద నడుస్తూ, ఎన్నెన్నో దూరాల్ని అలాగ్గా, చులాగ్గా కలిపేసే రైలు భారతీయుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రైలు అనే మాట వినగానే ప్రయాణం గుర్తుకు వస్తుంది. రైలంటే పెద్దలకే కాదు, పిల్లలకి కూడా చాలా ఇష్టం. రైలు ప్రయాణం పిల్లల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో, ఈ విషయాన్ని కనిపెట్టి మరీ ఒక చిత్రకారుడు ఆ బడిపిల్లలకి అపురూపమైన కానుకనిచ్చాడు. ఏకంగా బడినే రైలు బండిగా చిత్రించేశాడు. ఇప్పుడా ఊళ్ళో పిల్లలు బడికి వెళ్ళడం లేదు, ఉత్సాహంగా ‘బండెక్కుతున్నారు’. రంగులు వెలిసి, పగుళ్ళు వారిన గోడలతో నిస్సారంగా ఉసూరుమని పించే ఆ ‘బడి’ ఇప్పుడు ఆ పిల్లల పాలిట ‘చికుబుకు రైలైంది’! అందరికీ ఇప్పుడు ఆ బడి ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ అయింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలోని పిల్లలకు రైలంటే ఏమిటో తెలియదు. వాళ్ళు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక రైలును చూశారు. అది కూడా తమ గ్రామంలో, తాము చదువుకుంటున్న బళ్ళోనే వాళ్ళు ఆ రైలును చూశా రు. టీచర్లు కూర్చునే స్టాఫ్ రూమ్‌ను ఇంజన్‌గాను, తరగతి గదుల్ని రైలుబోగీ లుగాను చిత్రించారు స్థానిక చిత్రకారుడు నరోజు చందు. తరగతిగదిలో చదువుకుంటున్న పిల్లలు గది ద్వారం దగ్గర నిలబడితే, అచ్చం రైలు బోగీ ద్వారం దగ్గర నిలబ డినట్టే ఉంటుంది. వాళ్ళు కిటికీల దగ్గర కూర్చుంటే అచ్చం రైలుబోగీలో కూర్చుని ప్రయాణిస్తున్నట్టే ఉంటుంది. బడి వరండా రైల్వేస్టేషన్‌లా ఉంటుంది.

సిరిసిల్ల రాజన్న జిల్లాలోని దాదాపు 15 పాఠశాలల రూపురేఖల్ని తన సృజనాత్మక శక్తితో పూర్తిగా మార్చేశారు నరోజు చంద్రు. తన నియోజక వర్గ మైన ఈ జిల్లాలోని వీరనపల్లిని సందర్శించిన కె.టి.రామారావు జిల్లా లోని పాఠశాలల పరిస్థితిని మెరుగు పరచాలని భావిం చారు. దాంతో అధికారులు వెంటనే పాఠశాలల సుందరీ కరణ పనుల్ని చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా వాళ్ళు చందును సంప్రదించారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల పట్ల విద్యార్థులు ఆకర్షితులవుతుండడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే, పాఠశాలల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం తలెత్తింది. మంత్రి ఆదేశాలతో పాఠశాలల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేం దుకు ప్రయత్నాల్ని ప్రారంభించిన అధికారులకు చందు సృజనాత్మకత తోడైంది. ప్రాంతాన్ని బట్టి, ఇతర పరిస్థితుల్ని బట్టి ఏ పాఠశాలను ఏ విధంగా తీర్చిదిద్దితే, ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నది ప్రధానాంశమైంది. ఈ కోణంలో ఆలోచించిన చందు ఒక్కోపాఠశాలను ఒక్కో విలక్షణ మైన రీతిలో తీర్చిదిద్దారు. ఉదాహరణకు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాలను ‘గోల్కండ’ కోటలాగా తీర్చిదిద్దారు. ఇంతవరకు బడికి వెళ్ళా లంటేనే ఉసూరుమనే పిల్లలు ఈ కొత్త ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ లోకి వెళ్ళి, కిటికీల దగ్గర కూర్చుని, బయటనున్న వారికి చేతు లూపుతూ ‘టాటా’లు చెబుతున్నారంటే, చందు సృజనాత్మకతతో కూడిన ఈ విలక్షణమైన ప్రయోగం ఎంతటి సత్ఫలితాల్ని ఇచ్చిందో ఇట్టే తెలిసి పోతోంది. ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఒక్కో బడిని పెయింట్ చేయడానికి నాకు పదిహేను రోజులు పట్టింది’ అని చెప్పారు చందు. గంభీరరావు మండలం, రాజంపేట, ఎల్లారెడ్డిపేట మండలం, చికోడ్, ముస్తాబాద్ మండ లం, రామన్నపేట, హరిదాస్‌నగర్, పదిరా, నారాయ ణ్‌పూర్, వీరనపల్లిల్లోని పాఠశాలలకు చందు ఇలా తన కుంచె ప్రతిభతో కొత్త రూపాన్నిచ్చారు.  

‘రైలు బొమ్మని వేసిన తరువాత దాదాపు గ్రామంలోని పిల్లలందరూ ఈ బడికి హాజరు కావడం మొదలైంది. బడికి వస్తే, రైలెక్కినట్టుగా ఉందని చాలామంది పిల్లలు నాకు చెప్పారు. రైలును ఇంతవరకు చూడని గ్రామీణులైన ఈ పిల్లలకు రైల్వేస్టేషన్‌ను చూడడం ఒక కొత్త అనుభూతని స్తోంది’ అంటూ చందు వివరించారు. ‘మేము ఒక్కో బడికి రెండు, మూడు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. మేము ఆరుగురం ఒక బృందంగా పని చేశాం. బళ్ళని ఇలా తీర్చిదిద్దడం వల్ల పిల్లలకు కూడా కొత్త విషయాల్ని నేర్చుకునే ఆస్కారం ఏర్పడింది’ అని ఆయన అన్నారు. వెంకటాపురం పాఠశాలను గోల్కొండకోటలాగా తీర్చిదిద్దడంతో గ్రామస్తులు కూడా బడిని చూడడానికి వస్తున్నారు. పిల్లల హాజరు కూడా గణనీయంగా పెరిగిందని పాఠశాల హెడ్‌మాస్టర్ పి.దేవయ్య చెప్పారు. వీరనపల్లిలోని ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’లో పిల్లలు ఇప్పుడు ‘ఛుక్‌ఛుక్ రైలు వస్తోంది..., దూరం దూరం జరగండి’ అని పాడుకుంటూ, బడికి మరింత దగ్గరవుతున్నారు. గ్రామాల్లోని పిల్లలకి చదువు పట్ల ఆసక్తిని కల్పించడానికి చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. తెలంగాణలోని మిగతా ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇది స్ఫూర్తిదాయకంగా మారుతోంది.

English Title
manam maithri special
Related News