ల్యాబ్‌లో మానవ అండాల తయారీ..

Updated By ManamSun, 02/11/2018 - 01:34
baby
  • అండాశయ కణజాలాలే మూలం.. ఎలుకలపై ప్రయోగం విజయవంతం

  • పూర్తిస్థాయి అండాలు త్వరలో రెడీ.. సంతానరాహిత్యానికి శాస్త్రీయంగా చెక్

  • టెస్ట్‌ట్యూబ్ బేబీల కంటే విభిన్నం.. బ్రిటిష్.. అమెరికన్ శాస్త్రవేత్తల విజయం

  • ఫలదీకరణం చెందించడమే తరువాయి.. అది పూర్తయితే సృష్టికి ప్రతిసృష్టే

babyపురాణాలలో విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ.. ఏకంగా త్రిశంకు స్వర్గాన్నే సృష్టిస్తాడు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు నిజంగానే ప్రతిసృష్టి కలను సాకారం చేస్తున్నారు. ఇప్పటివరకు మనిషి నుంచి సేకరించిన అండాలు, శుక్రకణాలను కృత్రిమంగా టెస్ట్‌ట్యూబ్‌లలో ఫలదీకరణం చెందించి తర్వాత మళ్లీ వాటిని గర్భంలో ప్రవేశపెట్టి టెస్ట్‌ట్యూబ్ బేబీలను పుట్టించేవారు. కానీ ఇప్పుడు ఏకంగా కృత్రిమంగా అండాలనే సృష్టించి.. సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ పరిశోధనలు మరింత ముందుకెళ్తే.. ఇక సంతానరాహిత్యం అనే సమస్యే ఉండదు. అండాశయ కణజాలాల నుంచి కృత్రిమంగా మానవ అండాలను ప్రయోగ శాలలో తయారుచేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ముందుగా ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో ఈ తరహా అండాలను రూపొందించి, బుల్లి ఎలుకలను కూడా పుట్టించారు. మానవ అండాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినా.. వాటిపై మరింతగా ప్రయోగాలు జరగాల్సి ఉంది. అది పూర్తయితే ఇక ప్రపంచంలో సంతానరాహిత్యం అనే సమస్య ఎప్పటికీ ఉండదు. నిజానికి ఇప్పటికే టెస్ట్‌ట్యూబ్ బేబీల ప్రక్రియ ఉన్నా.. అందులో ఆరోగ్యకరమైన అండాల సేకరణ అనేదే అతిపెద్ద సమస్యగా ఉండేది. అలా సేకరించిన తర్వాత వేగంగా ఉండే శుక్రకణాలతో వాటిని పరీక్షనాళికల్లో ఫలదీకరించేవారు. ఆరోగ్యకరమైన అండాల ఉత్పత్తి లేనివారికి ఇదే పెద్ద సమస్య అవుతుంది. సరిగ్గా ఈ విషయంలోనే శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించి.. పాక్షిక విజయం కూడా సాధించారు. ఈ పరిశోధనలు మాలిక్యులర్ హ్యూమన్ రీప్రొడక్షన్ అనే పత్రిక తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. బ్రిటన్, అమెరికాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలలో పాల్గొన్నారు. 

ప్రయోగాలలో భాగంగా ముందుగా ఎలుకల అండాలను ప్రయోగశాలలో వాళ్లు తయారుచేశారు. వాటి నుంచి పూర్తిస్థాయి ఎలుకలను కూడా పుట్టించారు. ఆ తర్వాతి దశలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన మానవ అండాలను కూడా సిద్ధం చేశారు. ఎడిన్‌బర్గ్, న్యూయార్క్‌లోని సెంటర్ ఫర్ హ్యూమన్ రీప్రొడక్షన్‌లలో గల రెండ పరిశోధక ఆస్పత్రులలో ప్రపంచంలోనే తొలిసారిగా మానవ శరీరం వెలుపల.. మానవ అండాలను సిద్ధం చేశారు. అవి పూర్తిస్థాయి అండాలుగా కూడా ఎదగడం విశేషం. వీటి సాయంతో ఇక సంతాన సాఫల్య చికిత్సల తీరు పూర్తిగా మారిపోతుందని పరిశోధనలకు సహ నేతృత్వం వహించిన ఎవెలిన్ టెల్ఫర్ చెప్పారు. ఇప్పుడు అండం ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందేందుకు కావల్సిన పరిస్థితులపై దృష్టిపెట్టామని, ఆ తర్వాతి కాలంలో శుక్రకణాలతో వీటిని ఫలదీకరణ చెందించడమే మిగిలి ఉంటుందని వివరించారు. ఈ పరిశోధనలపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో.. ఫలదీకరణ అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ఈ దశ కూడా సాధ్యం అవుతుందని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఎండోక్రినాలజీ సీనియర్ క్లినికల్ లెక్చరర్ అలీ అబారా తెలిపారు. ప్రస్తుతానికి ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. వీటిని మరింత సురక్షితంగా కొనసాగించి, ఫలదీకరణ సమయంలో కూడా అవి సాధారణ స్థితిలోనే ఉండేలా చూసుకోవడం ముఖ్యమని తెలిపారు. సాధారణంగా ఈ అండాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి పెరిగే వాతావరణం చాలా ముఖ్యం.

             అందుకే ఇప్పటికి 30 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా, ప్రయోగాలన్నీ విఫలం అవుతూ వచ్చాయి. ఇపుడు ముందుగా జంతువుల మీద చేసిన ప్రయగాలు సఫలం అవుతుండటంతో.. అండాశయ కణజాలాలు విస్తారంగా అందుబాటులో ఉంటే మరింత ఆరోగ్యవంతమైన, సఫలం కాగల అండాల ఉత్పత్తి సాధ్యం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం అండాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశం మీదే శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇది విజయవంతం అయితే.. తర్వాతి దశలో ఫలదీకరణం విషయం చూసి.. ఇక పూర్తిగా కృత్రిమ మనిషిని సృష్టించే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకు సినిమాల్లో చూసినవి.. కథల్లో చదివినవి ఇక మీదట వాస్తవాలుగా మన కళ్లముందే సాక్షాత్కరించే అవకాశమూ లేకపోలేదు.

Baby Experiment

Tags
English Title
Manufacturing of human parts in the lab ..
Related News