మార్కెట్లలో ‘రిలీఫ్ ర్యాలీ’

Updated By ManamThu, 09/06/2018 - 22:13
bse

bseముంబై: వరుసగా ఆరు సెషన్లలో నష్టాలు చవిచూసిన మార్కెట్లు గురువారం పటిష్టమైన పునరాగమనాన్ని ప్రదర్శించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72 స్థాయిని మించి క్షీణించినప్పటికీ, ఇటీవల దెబ్బతిన్న హెల్త్‌కేర్, ఎనర్జీ, విద్యుత్ రంగ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 224.50 పాయింట్లు పుంజుకుని 38,242.81 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 59.95 పాయింట్లు లాభపడి 11,536.90 వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో దెబ్బతిన్న చౌకకు లభిస్తున్న విలువైన షేర్లను మదుపరులు సెషన్ చివరలో కొనుగోలు చేయడంతో సూచీలు చాలా వరకు లాభపడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సన్ ఫార్మా షేర్లు ఎక్కువ ఆదరణకు నోచుకున్నాయి. మార్కెట్ విడతల వారీగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చింది. ప్రత్యేకించి కొన్ని షేర్లలో లావాదేవీలు ముమ్మరంగా సాగాయి. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ 37,912.50 నుంచి 38,320.96 మధ్య ఊగిసలాడింది. గత ఆరు సెషన్లలో ‘సెన్సెక్స్’ 878.32 పాయింట్లు కోల్పోయింది. ‘నిఫ్టీ’ కూడా కీలకమైన 11,500 స్థాయిని తిరిగి అందుకుంది. ఇంట్రా-డేలో 11,436.05 కనిష్ఠ స్థితిని చూసిన ‘నిఫ్టీ’ 11.536.90 వద్ద ముగియడానికి ముందు 11,562.25 గరిష్ఠ స్థాయిని తాకింది. దేశీయ మదుపు సంస్థలు బుధవారం రూ. 176.95 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 383.67 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది.

English Title
Markets 'relief rally'
Related News