పురుష ‘సౌందర్యం’

Updated By ManamThu, 08/30/2018 - 06:54
makutam

‘‘ఆడవాళ్ళు అలంకరణ మొదలు పెడితే, ఇక అంతే సంగతులు.., గంటల కొద్దీ అద్దానికి అతుక్కుపోతారు’’ అన్నది స్త్రీల మీద పురుషులు సాధారణంగా చేసే ఫిర్యాదు. నిజానికి అందంగా కనిపించాలన్న తాపత్రయానికి లైంగికపరమైన వ్యత్యాసాలు ఏవీ ఉండవు. సమకాలీన సమాజంలో పురుషులు కూడా తమ అందచందాలకు మెరుగులు దిద్దుకోవడంలో గంటలు గంటలు గడపడంతోపాటు, యథేచ్ఛగా జేబులు కూడా ఖాళీ చేసుకుంటున్నారు. పురుషుల్లో పెరిగిన ఈ సౌందర్య స్పృహ పల్లవీసింగ్‌కు ఆసక్తికరంగా మారింది. 

imageపల్లవీసింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఒక ఆర్టిస్టు. కొచ్చి బినాలె ఫౌండేషన్ వారికి సంబంధించిన ఒకానొక ప్రాజెక్టు కోసం ఆమె పని చేశారు. పల్లవి కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు, సుశిక్షితురాలైన ఒక ఫొటోగ్రాఫర్ కూడా! అందుకే ఆమె తన ప్రాజెక్టు కోసం తన చుట్టూ ఉన్న సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని ప్రధాన వస్తువుగా స్వీకరించాలని భావించారు. తన ప్రాజెక్టుకు ఆమె ‘ముదివెట్టు మ్యూజియం నిర్మాణతి’ (హెయిర్ కట్ మ్యూజియం- అండర్ కన్‌స్ట్రక్షన్) అని పేరు పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా పల్లవి కొచ్చిలోని కె.ఎం. శంషుద్దీన్‌కు చెందిన ఒక చిన్న మంగలి దుకాణానికి వెళ్ళారు. ఆయనతో మాట్లాడారు. ఫోటోలు తీశారు. కొచానాగడిలోని శంషుద్దీన్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు 75 ఏళ్ళ చరిత్ర ఉంది. కాలంతో పాటు తమ శోభను పోగొట్టుకున్న గోడలు, అద్దాలు, కుర్చీలతో శంషుద్దీన్ సెలూన్ చాలా అనాకర్షణీయంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ సెలూన్‌కు వచ్చే కస్టమర్లు మాత్రం శంషుద్దీన్ చేసే హెయిర్‌కట్‌ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. 

imageపల్లవీ సింగ్ 2010లో మొదటిసారిగా తన స్నేహితుల్లో మగపిల్లలు సౌందర్య సాధనాలైన సీరమ్స్, కండీషనర్స్‌ని ఉపయోగించడాన్ని గమనించారు. అంతవరకు అలాంటి పదార్థాల్ని స్త్రీలు మాత్రమే ఉపయోగించేవారు. భారతీయ పురుషుల్లో కొత్తగా కనిపించిన ఈ సౌందర్యాభిలాష పల్లవిలో ఆసక్తిని రేకెత్తించింది. ‘‘మహిళలు సౌందర్యపోషణలో కాలాన్ని వృథా చేస్తారని ఆరోపించడం నిజం కాదు. ఎందుకంటే పురుషులే సౌందర్య పోషణలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కానీ అందం గురించి ఆలోచించడం పురుష లక్షణం కాదన్న సంప్రదాయ ధోరణి వల్ల వాళ్ళు గుంభనంగానే ఈ పని చేస్తుంటారు. కాలాన్ని, డబ్బుని అందం కోసం వెచ్చించడంలో పురుషులు, మహిళలకు తీసిపోరు’’ అంటారు పల్లవి. తన ప్రాజెక్టు కోసం కొచ్చిలోని సెలూన్లను సందర్శించినపుడు పురుషులు హెయిర్‌కట్ విషయంలో కొత్తకొత్త ఫ్యాషన్ల కోసం ఎంతగా వెదుకుతుంటారో ప్రత్యక్షంగా చూశానని పల్లవి అంటారు. తమ జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవడం, స్ట్రెయిట్ అప్ కట్ చేయించుకోవడం, అవసరమైతే ఉంగరాల జుట్టుకోసం సెలూన్లను ఆశ్రయించడం వంటి ధోరణి పురుషుల్లో పెరిగిందన్నది ఆమె అభిప్రాయం. ‘హెయిర్ కట్ మ్యూజియం’ అన్నది పల్లవీసింగ్ తన కెరీర్‌లో నిర్వహించిన తొలి మిక్స్‌డ్ మీడియా ప్రాజెక్టు. దీని కోసం ఆమె కొచ్చిలోని పది మంగలి దుకాణాలు, సెలూన్లను సందర్శించారు. ఇంతకు మునుపు ఆమె నగర పురుషుల స్వభావం కేంద్రంగా ‘డిజైర్ టు బి డిజైర్డ్’, ‘డిజైర్ లస్ట్’ల పేరుతో పెయింటింగ్ ప్రదర్శనల్ని నిర్వహించారు.
 

image


తన తాజా ప్రాజెక్టు కోసం పల్లవి కొచ్చిలోని సెలూన్లను సందర్శిస్తున్నపుడు, పురుషులు ఫ్యాషన్ బ్లాగ్‌లలో తాము చూసిన హెయిర్‌కట్‌లు కావాలంటూ, పలురకాల హెయిర్‌కట్‌ల పేర్లను చెప్పడాన్ని చూశారు. ‘‘అరవై ఏళ్ళకు పైబడిన పురుషులు సాదాసీదా హెయిర్‌కట్‌లతో సరిపెట్టుకుంటుంటే, యువకులు మాత్రం ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, సినిమాహీరోలు, మోడల్స్ వంటి వారి ఫోటోలు పట్టుకొచ్చి, తమకు అలాంటి హెయిర్‌కట్ చేయాలంటూ బార్బర్లని అడగడం కనిపించింది. అయితే ఆధునిక హెయిర్‌కట్‌లు చేయడంలో ఎలాంటి శిక్షణ లేని ఈ సాదాసీదా మంగలి వాళ్ళు తమ క్లయింట్స్ చూపించిన ఫోటోల్ని చూసి, మక్కీకి మక్కీ అలాంటి హెయిర్‌కట్‌లనే చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని చెప్పారు పల్లవి. పల్లవీసింగ్ తాను నెలకొల్పిన హెయిర్‌కట్ మ్యూజియంలో సాదాసీదా మంగలి దుకాణాల్లో కనిపించే కతె్తర్లు మొదలుకుని ఆధునికమైన ట్రిమ్మర్లని, చెక్కపిడితో ఉన్న పౌడర్ బ్రష్, షేవింగ్ బ్రష్, చేతితో పనిచేసే హెడ్ మసాజర్ వంటి సాధనాల్ని కూడా ప్రదర్శనకు ఉంచారు. తాను సందర్శించిన మంగలి దుకాణాల నుంచి ఆమె వాటిని సేకరించారు. మన జీవితం నుంచి చిన్న చిన్న మంగలి దుకాణాలు, క్షురకులు క్రమంగా అదృశ్యమైపోతున్నారు. తమలా కాకుండా తమ పిల్లలు చదువుకుని ఉన్నతోద్యోగాలు చేయాలని వాళ్ళంతా కోరుకుంటున్నారని పల్లవీసింగ్ చెబుతారు. ‘మ్యూజియం ఆఫ్ హెయిర్‌కట్స్’ అనే ఆమె ఛాయాచిత్రాల ప్రదర్శన గత జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు కొచ్చిలోని పెప్పర్‌హౌజ్‌లో జరిగింది. సామాజిక పరిణామంలో భాగంగా క్రమంగా అదృశ్యమవుతున్న అనేకానేక చేతివృత్తులతో పాటు, క్షురకులు కూడా కనుమరుగు కావడం విషాదకరం. ఆ విషాదాన్ని మరోసారి గుర్తు చేసింది పల్లవీ సింగ్ ప్రదర్శన. 
- పసుపులేటి గీత

English Title
Masculine beauty
Related News