మమ్మల్నే కోరుకుంటున్నారు

Updated By ManamSun, 09/02/2018 - 23:55
kcr
  • త్వరలోనే ప్రజల ముందుకు ఎన్నికల మేనిఫెస్టో

  • ప్రభుత్వం ఉన్నంత కాలం ‘సంక్షేమం’ అమలు

  • కేసీఆర్‌ను గద్దె దించడం కూడా ఒక లక్ష్యమా

  • ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

kcrహైదరాబాద్: ‘తెలంగాణ ప్రజలు మరోసారి మమ్మల్నే కోరుకుంటున్నారు. తెరాసనే గెలిపిస్తామంటున్నారు. రాష్ట్రంలో ఏ ఊళ్లో అయినా ఇదే మాట వినబడుతుంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఏలాంటి నిర్ణయాలైన తెరాస ప్రభుత్వం తీసుకుంటుందనే నమ్మకం ఏర్పడింది. అందుకే మా గెలుపును ఆకాంక్షిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆదివారం కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. ఒకరి చేతిలో మనం బానిసలు కావొద్దు, నిర్ణయాధికారం మనమే ఉంచుకోవాలని ప్రజలకు చెబుతూ, చంచాగిరి చేసే గులాములం కారాదని ప్రజలు కూడా కోరుతున్నా రని ఆయన తెలిపారు. తెలంగాణ గులాబీలుగా ఆత్మ గౌరవంతో స్వపరిపాలన సాగాలని కోరుకుం టున్నారు, త్వరలోనే ప్రజల ముందుకు ఎన్నికల మేనిఫెస్టో రాబోతుంది. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసి తీరుతాము అని సీఎం తెలిపారు. అధికా రం మన దగ్గర ఉంటేనే ఆత్మగౌరవంతో బతుకుతాం...

మీ కళ్లముందుంది... చేసిన వాగ్ధానాలు, ఇచ్చిన హామీలు అమలు జరిపిన తర్వాతనే మరో సారి ప్రజా మద్దతు కోరుతాను...  ఢిల్లీకి గులాంగా ఉందామనే పార్టీలను నమ్మకండి,  పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో  పాలించుకునే ఆలోచన చేయండి... ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయి,  వాటికి మోసపోకండని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. అధికారం మన దగ్గర ఉంటేనే అత్మగౌరవంతో బతుకుతామని అన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల ప్రగతిని అవిష్కరించారు. కోటి ఎకరాలకు సాగునీరందించి ఆకుపచ్చ తెలంగాణను చూడాలనేదే తన ఆకాంక్ష అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లించిన తర్వాతనే ఓట్లడుగుతామనే వాగ్ధానానికి కట్టుబడి ఉన్నామని తెలియచేశారు. ఇప్పటికే 22 వేల గ్రామాలకు నల్లా నీళ్లు అందాయని మరో 1300ల గ్రామాలకు ఏడెనిమిది రోజుల్లో అందించడం జరుగుతుందన్నారు. ఇంటింటికి నల్లా కార్యక్రమం 46 శాతం పూర్తయిందన్నారు.  ఓట్లు అడగడానికి ముందే, దీపావళిలోపే ఇంటింటికి కృష్ణా, గోదావరి నీళ్లు వస్తాయన్నారు. రెండవ విడత రైతు బంధు చెక్కులను నవంబనర్‌లో అందచేస్తామన్నారు.  అన్ని వర్గాల సంక్షేమ, అన్ని రంగాల్లో ఆశించిన ప్రగతి సాధించేంత వరకు నిరంతర శ్రమ కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 465 రకాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. 

kcrప్రభుత్వం సాధించిన ప్రగతి కళ్లముందు కనిపిస్తుందన్నారు.  తాను తెలంగాణ పిచ్చోడిని కాబట్టే ఇన్ని పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.  తెరాస ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు బంధు పథకం అమలవుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి సరైన సమయంలో  రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తిరిగి కేసీఆర్ రావాలి, తెరాస రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అద్బుతమైన తెలంగాణ కావాలి, సంక్షేమం పెరగాలి, పెరిగిన ఆదాయం పేదలకు పంచుకుందాం, పింఛన్లు పెంచుకుందాం, నిరుద్యోగులను ఆదుకుందాం అని అన్నారు. భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి  తెరాస ప్రధాన కార్యదర్శి   కేశవరావు అధ్యక్షతన మ్యానిఫెస్టో  కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదని, ప్రజలు ఆశీర్వదిస్తే అశించిన ప్రగతిని సాధించి తీరుతామన్నారు. తెలంగాణలో ఆశించిన అభివవృద్దిని సాధించడానికి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజానీకం తనను ఆశీర్వదించాలని విన్నవించుకున్నారు. జోనల్ వ్యవస్ధను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద పట్టుబట్టి సాధించుకున్నామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకపోతే ఇది సాధించుకోవడం సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలపై మీడియా కథనాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా  ప్రస్తావించారు. ఎన్నికలకు మరో ఆరు మాసాల సమయం ఉందని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయన్నారు.  
ముఖ్యమంత్రి హోదాలో కొత్త పథకాలు ప్రకటించడం అనైతికం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఇప్పటికే అనేక పథకాలు అమలు జరుపుతున్నామన్నారు. సాగునీటి విషయంలో ఎంతో పురోగతిని సాధించామన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించామన్నారు. కోటి ఎరకాల్లో ఆకుపచ్చ తెలంగాణను  చూపిస్తానన్నారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి వల్ల తెలంగాణ ఎంతగా నష్టపోయిందో ప్రజలకు తెలియంది కాదన్నారు. రాజకీయ అవితీని నిర్మూలించి అన్ని రంగాల్లో అశించిన ఫలితాలను రాబడుతున్నామన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడం ఒక లక్ష్యమా అని విపక్షాలను ప్రశ్నించారు. అలవికాని విపక్షాల మాటలు విని మోసపోవద్దని ప్రజలను కోరారు. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులం కారాదని, ఆత్మగౌరవంతో తెలంగాణలో పాలన సాగవలసి ఉందన్నారు. స్వతంత్ర జీవనం గడపడానికి గులాబీలుగా వికసించవలసి ఉందన్నారు. పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఆకుపచ్చ తెలంగాణ సాధించడంతో పాటుగా ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు లభించే విధంగా జోనల్ వ్యవస్ధను సాధించుకున్నామని వివరించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ప్రజలు ఆలోచించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం అని తెలియచేశారు.  రాష్ట్ర ఆర్థిక ప్రగతి 17.17 శాతానికి పెరిగిందన్నారు. ఆర్థిక పురోగతిని రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడుతామన్నారు.  పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుకపై  రూ. 9.60కోట్లు రాగా తెరాస నాలుగున్నరేళ్ల పాలనలో రూ. 1980 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం గురించి ఈ సందర్భంగ వివరించారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆత్మగౌరవంతో స్వీయపాలనతోనే అది సాధ్యమన్నారు. అందుకే మరో సారి పరిపాలనకు అవకాశం ఇవ్వండని కోరుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

విశేషాలు...
600 ఎకరాల్లో సభా ప్రాంగణం
వేదిక ముందు 16 గ్యాలరీలు
50 భారీ ఎల్‌ఈడీ తెరలు
15వేల ఎల్‌ఈడీ లైట్లు
24 ట్యాంకర్లు, 8 ట్రిప్పుల్లో నీటి సరఫరా
25 లక్షల మంచినీళ్ల బాటిళ్లు,  25లక్షల ప్యాకెట్లు
30 అంబులెన్స్‌లు, 8 మెడికల్ క్యాంపులు
1400 ఎకరాల్లో 9 పార్కింగ్ స్థలాలు
15 పార్కింగ్ లాట్లు
400 మంది వలంటీర్ల సేవలు
20 వేల మంది పోలీసుల మోహరింపు
డీజేపీ నేతృత్వంలో కంట్రోల్ కమాండ్
డ్రోన్ కెమెరాలతో పరిశీలన
300 సీసీ కెమెరాలతో నిఘా
ఆయుధాలతో ఆక్టోపస్ పహారా
సెల్ఫీలతో సందడి చేసిన కవిత

సభ సాగిందిలా.. సాయంత్రం
4.15: రెండు హెలికాప్టర్లలో ప్రగతి నివేదన సభాస్థలికి మంత్రలు చేరుకున్నారు.
5.45: బేగంపేట విమానశ్రయం నుంచి సీఎం కేసీఆర్ సభకు బయల్దేరారు. 
6.10: ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కొంగరకలాన్ చేరుకున్నారు. 
6.15: హెలీకాప్టర్ నుంచి సభా ప్రాంగణాన్ని కేసీఆర్ పరిశీలించారు.
6.25 : సీఎం కేసీఆర్ సభ వేదికపైకి వచ్చారు. సీఎంతో టీఎస్ ఎండీసీ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.
6.26: తెలంగాణ అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు.
6.27: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహ్మద్ అలీ.. సీఎం కేసీఆర్‌కు దట్టీ కట్టారు.
6.30: రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావు, మంత్రులు కడియం శ్రీహరి, మహ్మద్ అలీ ప్రసంగించారు.
6.40: జై భారత్ అని ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
7.27: ముగిసిన సీఎం కేసీఆర్ ప్రసంగం
7.28: సభా వేదిక నుంచి వెనుదిరిగిన గులాబీ బాస్
7.30: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధన్యవాద ప్రసంగం చేశారు.
ప్రజలకు అభివాదం చేస్తూ బస్సులో ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం

కళాకారుల ధూంధాం..
ప్రగతి నివేదన సభా ప్రాంగణం కళాకారుల ఆటపాటలతో మార్మోగింది. వేదిక మీద టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతత్వంలోని సాంస్కృతిక సారథి బృందం పాటల రూపంలో వివరించింది. ఇప్పటి వరకు ప్రభు త్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు విడ మరిచి చెప్పారు. గాయని మంగ్లీ తన ఆటపాటలతో అలరించింది.

English Title
Maybe we want it
Related News