‘మీ టూ’ మహోద్యమం!

Updated By ManamSun, 10/21/2018 - 09:14
me too

దేశమంతా ‘మీ టూ’ ఉద్యమ సెగలు ఎగసిపడుతున్నాయి. ‘మీ టూ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మాట్లాడే స్త్రీల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాకులత, నిరాశ, నిస్పృహ, క్రోధం వంటి భావాలు చాలామందిలో ముప్పిరిగొంటున్నాయి. ఆ వేదిక కింద చేరుతున్నవాళ్లు సంతోషంగానో, హుషారుగానో చేరడం లేదు. తమ శరీరాలపై, తమ గౌరవంపై జరుగుతున్న అవమానాలు, వేధింపులకు నిరసనగా చేరుతున్నారు. బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా, ఒకప్పటి ఏషియన్ ఏజ్ పత్రిక ఎడిటర్, ఇప్పటి కేంద్ర సహాయమంత్రి ఎం.జె. అక్బర్‌పై ప్రియా రమణి సహా కొందరు మహిళా జర్నలిస్టులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దేశంలో ‘మీ టూ’ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఆ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచీ అనూహ్యమైన మద్దతు లభిస్తోంది.
 

image

వేధింపుల ఘటనలు కోకొల్లలు. చాలా సాధారణమైనట్లు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది బయటికొచ్చి ఎన్నడో తాము ఎదుర్కొన్న వేధింపులను ఇవాళ బహిర్గతం చేస్తున్నారు. చాలా మంది మనసులోనే పెట్టుకొని కుంగిపోతున్నారు. స్త్రీ పురుషులకు వేర్వేరు గౌరవం లభిస్తున్న మన సమాజంలో ఒక స్త్రీ తనకెదురైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం అనేది అంత సులభం కాదు. తదనంతరం ఆమెపై అందరి దృష్టీ పడుతుంది. సమాజంలో ఆమెను చూసే దృష్టి కోణం మారుతుంది. అయినా బయటకు వస్తున్నారంటే ఏ స్థాయిలో వాళ్లు మానసిక క్షోభను ఇన్నేళ్లుగా అనుభవిస్తూ వచ్చారో అర్థం చేసుకోవాలి.

సోషల్ మీడియాలో ‘మీ టూ’ కింద కనిపించే కథలు చాలా సింపుల్‌గా, అదే సమయంలో చాలా స్పష్టంగా ఉంటుండటాన్ని బట్టి, వాటిలో నిజాయితీ ధ్వనిస్తోంది.  లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, బ్యాంకర్లు, టీచర్లు, విద్యార్థులు.. ఇంకా అనేకానేక రంగాల వాళ్ల కథలు, వ్యథలు వాటిలో ఉన్నాయి. తొలిసారి ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు ఆశ్చర్యానికీ, దిగ్భ్రాంతికీ గురయ్యూమనీ, ఆ ఘటనను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని స్థితిలో పడ్డామనీ వారిలో కొంతమంది చెప్పారు. బస్సుల్లో ప్రయాణించేప్పుడు, సమూహంలో నడిచేటప్పుడు మగవాళ్ల చేష్టల నుంచి తమను తాము కాపాడుకోడానికి మోచేతుల్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నామని చెప్పిన వాళ్లున్నారు, గట్టిగా అరిచి తమ నిరసనను తెలిపామన్న వాళ్ల్లున్నారు. బంధువుల నుంచీ, సహోద్యోగుల నుంచీ, బాస్‌ల నుంచీ, కొన్నేసి సార్లు సొంత కుటుంబంలోని వ్యక్తుల నుంచీ ఇలాంటివి ఎదుర్కొన్నామన్న వాళ్లున్నారు. కొంతమంది తాము ఐదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల వయసు మధ్యలో ఉండగా, ఈత నేర్చుకొనేటప్పుడు లేదా సైకిల్ నేర్చుకొనేటప్పుడు లేదా స్కూలు వార్షికోత్సవం కోసం నాటికను ప్రాక్టీస్ చేసేప్పుడు లేదా ట్యూషన్‌లో తమను ముట్టుకొని, ఆ విషయం ఎవరితోనూ చెప్పొద్దన్న వాళ్ల గురించి ప్రస్తావించారు. 

అంటే ఏమిటి? చాలా సందర్భాల్లో ఇలాంటి పనులు చేసేది అపరిచిత వ్యక్తులు కారు. కొన్నేసి సార్లు తమ సన్నిహితులు, స్నేహితులు, ఆఖరుకి ఉపాధ్యాయులు, మేనేజర్లు, అధికార హోదాలో ఉన్నవాళ్లు. పైకి మెత్తగా, అందంగా మాట్లాడేవాళ్ల హృదయం లోపల ఎలాంటి భావాలు చెలరేగుతుంటాయో, ఎలాంటి రాక్షసత్వం ఉంటుందో ఊహించలేం. కాబట్టి స్త్రీలు తమ భద్రతలో తాముండాల్సిందే.

‘నో’ చెప్పడానికీ ధైర్యం కావాలి
imageఅతను కేవలం ఆమెను డేటింగ్‌కు రమ్మని అడిగాడు. ఆమె నిరాకరించింది. అతను వదల్లేదు. అనేకసార్లు అడిగాడు. ఆమె కాదని చెబుతూ వచ్చింది. చివరకు ఇక లాభం లేదనుకొని అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ‘ఇది లైంగిక వేధింపు కిందకు వస్తుందా? అతనడిగినప్పుడు ఆమె కాదని చెబితే సరిపోతుంది కదా?’ అని కొంతమంది అనవచ్చు. నిజానికి ‘నో’ చెప్పడం చాలా క్లిష్టమైన విషయంగా అర్థమవుతుంది. సహోద్యోగి ఎవరైనా ఎక్కడికైనా కలిసి వెళదామన్నప్పుడు, చాలామంది ఆడవాళ్లు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు, లేదా ‘కలిసి కాఫీ తాగడానికి’ ఒప్పుకుంటారు. రోజూ ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి కాబట్టి, ఇబ్బందికర వాతావరణాన్ని తప్పించడం కోసమే స్త్రీలు ‘కాఫీ డేట్’కు సరేనంటారు. అంతే తప్ప ఇష్టంలేకపోయినా ‘‘పద, నీతో కలిసి డేటింగ్‌కు వద్దామనుకుంటున్నా’’ అని ఏ స్త్రీ చెప్పదు. గణాంకాల ప్రకారం భారత్‌లో ఎక్కువ అత్యాచారాలు ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. మీడియా ప్రచారం చేస్తున్నదానికి భిన్నంగా బంధువులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, భర్తల వల్లే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. వాళ్లకు ‘నో’ చెప్పే అవకాశం ఇవ్వకుండానే ఇవి జరుగుతున్నాయి.

పని ప్రదేశాల్లోనూ ఇదే పరిస్థితి. వేధింపులు ఎదురైనప్పుడు అరుదుగా మాత్రమే వాళ్లు మాట్లాడుతున్నారు. ఇటీవలి ఒక విశ్లేషణ ప్రకారం 99 శాతం వేధింపులు రిపోర్ట్ కావడం లేదు. ప్రతీకారం తీర్చుకుంటారనే భయం కానీ, సామాజికంగా చులకనవుతామనే భీతితో కానీ స్త్రీలు ముందుకు రావట్లేదు. అత్యాచారం చోటు చేసుకున్న సందర్భాల్లో ఎక్కువ శాతం మగవాళ్లు చెప్పే సమాధానం ఆమె డ్రస్ రెచ్చగొట్టేవిధంగా ఉందనో లేక, ‘ఆమె అడ్డు చెప్పలేదు.. లేదంటే ముద్దుతోటే సరిపెట్టేవాడ్ని’ అనో. బయటికి వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారంటే ఆ స్థాయిలో వారు మానసిక క్షోభ అనుభవించారనీ, ఆ మగవాళ్లతో మిగతావాళ్లన్నా జాగ్రత్తగా ఉండమనే హెచ్చరిక ఉందనీ అర్థం చేసుకోవాలి.

వేదికగా సోషల్ మీడియా
ఆ మగవాళ్లు నమ్మకాన్ని దుర్వినియోగం చేసినవాళ్లు. వాళ్ల చేష్టలు ఆమోదయోగ్యం కానివి, ఆఖరుకిimage నేరపూరితమైనవి కూడా. వాళ్లు తమని తాము నీచపరుచుకున్నవాళ్లు. ఒక్క మాటలో.. వాళ్లు తప్పుడుగాళ్లు. వాళ్ల చేష్టల వల్ల స్త్రీలు మనోవేదనతో గడపాల్సి వస్తోంది. తమ ప్రవర్తనకు సామాజిక ఆమోదం ఉందనే ధైర్యంతోటే వాళ్లు ఇలాంటి నీచ కార్యాలకు పాల్పడుతున్నారు. వాళ్ల చేష్టల్ని పెద్దవాళ్లు ఖండించరు. అలాంటి ‘ఇడియట్’ పనుల్ని సినిమాలు సెలబ్రేట్ చేస్తుంటాయి. రాజకీయ నాయకులైతే ‘అబ్బాయిలు అబ్బాయిలే’ అంటుంటారు. ఇక న్యాయమూర్తులు, ప్రిన్సిపాళ్లు, బాస్‌లు వంటి పెద్దవాళ్లయితే ఆడవాళ్లు ఎలా డ్రస్ చేసుకోవాలో, వాళ్లు ఏం తినకూడదో, ఎప్పుడు బయటకు వెళ్లాలో, ఏ టైమ్‌లోపు ఇంటికి తిరిగి రావాలో, ఎవరితో మాట్లాడాలో ఉపన్యాసాలిస్తుంటారు. సెల్‌ఫోన్ వాడొద్దని కూడా సలహా ఇస్తుంటారు.

బదులుగా తమని తాము రక్షించుకొనే పద్ధతుల్ని నేర్చుకుంటున్నారు స్త్రీలు. గట్టిగా అరవడం ద్వారా, కొన్నేసిసార్లు తిరగబడటం ద్వారా, కొన్నేసిసార్లు భౌతికంగా స్పృశించడాన్ని నివారించడం ద్వారా, సినిమా చూసేప్పుడు థియేటర్లలోని లైట్లు మసకబారిన సమయంలో స్నేహితుడి చేతులు తమ భుజాలపై పడకుండా ముందుకు వంగడం ద్వారా, తారసపడినప్పుడు కావలించుకోడానికి పెద్దవాళ్లు యత్నిస్తే నవ్వుతూ నమస్కరించడం ద్వారా స్పందించడం నేర్చుకున్నామని చాలా మంది స్త్రీలు తమ భావాలను రాశారు. వీళ్లంతా ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి చెందినవాళ్లు, పరిమితమైనవాళ్లు కారు. అనేక దేశాలవాళ్లు, వివిధ మతాలకు, కులాలకు, భాషలకు చెందినవాళ్లు. అయితే వాళ్లందరికీ సంబంధించిన సార్వత్రిక అంశం.. వాళ్లు ప్రత్యేకించి ఒక సామాజిక-ఆర్థిక తరగతికి చెందినవాళ్లు, సోషల్ మీడియూకు అందుబాటులో ఉన్నవాళ్లు. తమ గళానికి ఒక వేదికగా ఉన్నందునే సోషల్ మీడియూ ద్వారా వాళ్లు తమ అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోగలుగుతున్నారు. ఈ వేదికకు దూరంగా ఉన్న వేలాది, లక్షలాది స్త్రీల మాటేమిటి? 

విద్యా సంస్థల్లోనూ వేధింపులెక్కువే
imageచాటు నుంచి బయటకు వచ్చి మానసికంగా, భౌతికంగా తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్న స్త్రీలకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. వారి గళాలకు బలాన్ని చేకూర్చేలా మరింత మంది తమ అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. ‘మీ టూ’ ఉద్యమం భారత్‌లో మరోసారి ఒక కెరటంలా విరుచుకుపడుతోంది. గత ఏడాది ప్రారంభమైన ఉద్యమానికి ఇది కొనసాగింపు. రెండు సందర్భాల్లోనూ స్త్రీలు ఇప్పటివరకూ తాము మానసికంగా అనుభవిస్తూ వచ్చిన నరకాన్ని బహిర్గతం చేయడం, తమను అలాంటి స్థితికి గురిచేసిన మగవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం గమనించవచ్చు. అయితే ఆరోపణలకు గురవుతున్న వాళ్లలో అతి తక్కువ మందే తమ తప్పును అంగీకరిస్తుండగా, ఎక్కువ మంది మౌనం పాటిస్తుండటమో లేదా ఖండిస్తుండటమో చూస్తున్నాం.

ఇవాళ ధైర్యంగా ముందుకు వచ్చి ఒకప్పుడు తమకు ఎదురైన వేధింపుల గురించి మాట్లాడుతున్న వాళ్ల సంఖ్యimage క్రమేపీ పెరుగుతున్నా ఆ సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. వాళ్లకు ఎన్నో రెట్లమంది నలుగురిలో చులకనై పోతామనే ఉద్దేశంతో నోరు మెదపడం లేదు. సినీ పరిశ్రమకు చెందినవాళ్లు, మీడియాలో పనిచేస్తున్నవాళ్లు కొంతమంది బయటికొచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్తున్నారు. విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్లు, ప్రొఫెసర్ల గురించి అప్పుడప్పుడూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. బయటికి వస్తున్న అలాంటి ఘటనలు స్వల్పం. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు భయూనక స్థితిలో ఉంటున్నాయని అంతర్గత సమాచారం. కెరీర్ గురించిన భయంతో అధ్యాపకుల నుంచి తమకు ఎదురవుతున్న వేధింపుల గురించి బయటకు చెప్పడానికి విద్యార్థినులు వెనుకంజ వేస్తున్నారు. అధికారాన్ని, అవకాశాన్ని అడ్డం పెట్టుకొని విద్యార్థినులను లైంగికంగా వేధించే అధ్యాపకులకు కొదవలేదని చెప్పడానికి సంశయించాల్సిన పనిలేదు. అదే విధంగా ఇప్పుడు బయటికొచ్చి మాట్లాడుతున్న వాళ్లంతా సమాజంలో ఎంతో కొంత పేరు సంపాదించుకున్నవాళ్లు, సంపన్నులే. కానీ దళిత, ఆదివాసీ, బహుజన మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి అందరికీ తెలిసిందే. వాళ్ల గొంతుకలు ఎక్కడా వినిపించడం లేదు. అలాంటి మహిళల గురించి కూడా ‘మీ టూ’ ఉద్యమం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయం కోసం పోరాటం చేయలేని స్థితిలో ఉన్న పేద మహిళలకు అండగా నిలిచి, న్యాయపోరాటానికి వాళ్లకు వనరులను సృష్టించాల్సిన అవసరం కూడా ప్రస్తుత ఉద్యమానికి ఉంది. అలాగే ట్రాన్స్‌జెండర్ మహిళల, స్వలింగ సంపర్కుల గళాలను కూడా కలుపుకోవాలి.

ఫిర్యాదుల కమిటీ
imageవెల్లువెత్తుతున్న ‘మీ టూ’ ఆరోపణల నేపథ్యంలో అన్ని రంగాల్లోని సంస్థలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల విషయంలో మరింత సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపుల చట్టం 2013 గైడ్‌లైన్స్ ప్రకారం కనీసం నలుగురు సభ్యులతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేయూలి. అక్కడి అనుభవజ్ఞురాలైన స్త్రీని చైర్‌పర్సన్‌గా నియమించాలి. ఇద్దరు సభ్యులు అక్కడి ఉద్యోగినులై ఉండాలి. బయటి నుంచి ఒక స్వతంత్ర వ్యక్తిని సభ్యురాలిగా నియమించాలి. అయితే యూజమాన్యంలో అత్యున్నత స్థాయిలో స్త్రీలు లేనప్పుడు కమిటీని ఏర్పాటు చేయడం సంస్థలకు క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ఈ బృందంలో ఎక్కువ మంది స్త్రీలే అయి ఉండాలి కాబట్టి. అలాగే బయటి వ్యక్తుల్ని నియమించాల్సి రావడం కూడా సంస్థలకు ఇబ్బంది కలిగించే వ్యవహారం. ఐసీసీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం చట్టరీత్యా తప్పనిసరి. కానీ దానికి అంత ప్రాధాన్యం ఎవరూ ఇవ్వట్లేదు. ఒక విచారణ కమిటీగా అది సహజ న్యాయసూత్రాలను అనుసరించాలి, ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, ప్రత్యేకించి ఫిర్యాదుపై విచారణ జరపాలి. అంటే చట్టం, ప్రక్రియలపైనే కాకుండా, పక్షపాతాన్ని అధిగమించి న్యాయం చేకూర్చేలా సభ్యులు శిక్షణ పొందడం అవసరం. పెద్ద పెద్ద సంస్థల్లో తప్ప ఇలాంటివి ప్రాక్టికల్‌గా సాధ్యం కాని విషయం.

ధైర్యం కావాలి
ఇదే అవకాశమని కొంతమంది స్త్రీలు మగవాళ్లనందర్నీ ఒకే గాటన కట్టి అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. మగవాళ్లందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిందిగా ఫోర్స్ చేస్తున్నారు. దీనివల్ల బాధిత మహిళల అవమానాలకు విలువ లేకుండా పోయే ప్రమాదముంది. ఇప్పటికే కొంతమంది మగవాళ్లు ‘ఎన్నడో తమకు ఎదురైన ఘటన అంటూ మాట్లాడుతున్న స్త్రీలు నమ్మదగ్గవాళ్లేనా? అవమానం ఎదుర్కొన్న వెంటనే మాట్లాడకుంటా ఉండి, ఇన్నాళ్ల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ సంచలన ఉదంతం బయటికొచ్చాక తాము కూడా లైమ్‌లైట్‌లోకి రావాలని ప్రయత్నించడంలో ఇదొక భాగమా?’ అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నిజాలు కాకపోవచ్చు. కానీ ఇలాంటివి మాట్లాడేందుకు తప్పకుండా ధైర్యం కావాలి. నిజానికి, స్త్రీలకు సంబంధించి ఇలాంటివి బహిరంగంగా మాట్లాడటం వీరోచిత చర్యగా ఉండకూడదు. అలాగే మర్యాదగా ప్రవర్తించడం మగవాళ్లకు వీరోచిత చర్యగా ఉండకూడదు. అవి స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా వ్యక్తం కావాలి. కూతుళ్ల స్వేచ్ఛను తగ్గించడానికి బదులుగా, వాళ్లతో ఎలా ప్రవర్తించాలో కొడుకులకు తల్లిదండ్రులు నేర్పాలి. ఇది చాలా సులభం.

నోబెల్ సాహిత్య పురస్కారానికీ దెబ్బ
image‘మీ టూ’ స్కాండల్ దెబ్బతో 2018 నోబెల్ సాహిత్య పురస్కారాన్ని స్వీడిష్ అకాడమీ వచ్చే ఏడాదికి వారుుదా వేసింది. అంటే 2019 సంవత్సరం పురస్కారంతో పాటే 2018 పురస్కారాన్నీ అందజేస్తారు. సాహిత్యానికి సంబంధించి 1901 సంవత్సరం నుంచీ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని అందిస్తూ వస్తున్నారు. ఆల్బర్ట్ కామూ, శామ్యూల్ బెకెట్, రవీంద్రనాథ్ ఠాకూర్, ఎర్నెస్ట్ హెమింగ్వే వంటి మహా గొప్ప సాహిత్యకారులు ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు. కానీ 2016లో ఎంతోమంది మహా మాహా సాహిత్యకారుల్ని కాదని అమెరికన్ రాక్ స్టార్ బాబ్ డైలాన్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతినివ్వడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దాంతో జాగ్రత్తపడిన అకాడమీ 2017లో బ్రిటన్‌లో స్థిరపడిన జపనీస్ రచయిత కజువో ఇషిగురోకు సాహిత్య పురస్కారాన్ని అందించి, గౌరవం నిలుపుకోవాలని భావించింది.

 అయితే ఆయన పేరు ప్రకటించిన మూడు వారాలకే ఒక అకాడమీ సభ్యురాలి భర్త అయిన జీన్-క్లాడ్ ఆర్నాల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మరోసారి వివాదం తలెత్తింది. స్టాక్‌హోమ్‌లోని అతని కల్చరల్ క్లబ్‌కు అకాడమీ నుంచి నిధులు మళ్లుతున్నాయనే వాస్తవం అకాడమీ అంతర్గత విచారణలో వెలడైంది. 2011లో ఒక మహిళపై అత్యాచారం జరిపాడనే అభియోగం ఎదుర్కొన్న అతను ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఉదంతం స్వీడిష్ అకాడమీపై తీవ్రప్రభావాన్నే చూపింది. నోబెల్ పురస్కారాల ఎంపికపై ప్రపంచవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తారుు. దాంతో గత 70 సంవత్సరాల కాలంలో తొలిసారిగా నోబెల్ సాహిత్య పురస్కారాన్ని వారుుదా వేస్తున్నట్లు ఈ ఏడాది మేలో అకాడమీ ప్రకటించింది.

English Title
'me Too' movement
Related News