తప్పిపోయిన లంకె

Updated By ManamSat, 04/14/2018 - 00:09
Animal
  • మానవ ముఖాకృతులతో టాక్సిడెర్మీ జంతువులు

Animalఅమెరికాలోని బ్రూక్లిన్ నేవీ యార్డు సమీపంలో ఒక ఆర్టిస్టు స్టూడియో ఉంది. దానిలోకి అడుగు పెడితే, ఏదో జంతుప్రదర్శనశాలలో అడుగు పెట్టినట్టే ఉంటుంది. జీబ్రాలు, కోతులు, దుప్పి, జింకలు, వీటితోపాటు ఇటీవలి కాలంలో అడవుల్లో కూడా అంతర్థానమై పోతున్న జంతువులన్నీ రకరకాల భంగిమల్లో మనకు ఆ స్టూడియోలో కనిపిస్తాయి. అయితే ఒకే ఒక్క విషయం మాత్రం మనల్ని నిశ్చేష్ఠుల్ని చేసేస్తుంది. ఈ జంతువుల ముఖాలన్నీ మానవ ముఖాలే! కోతికి, పులికి, జంగుబిల్లికి, జీబ్రాకి మనిషి ముఖాలే ఉంటాయి. ఆ ముఖాలు కూడా అతికించినట్టు ఉండవు, అత్యంత సహజంగా ఆ జంతువు శరీర భాగాలుగానే ఇవి కనిపిస్తాయి. అద్భుతమైన ఈ టాక్సిడెర్మీ శిల్పాల్ని కేట్ క్లార్క్ రూపొందించారు. న్కూయార్క్‌కు చెందిన కేట్‌క్లార్క్ టాక్సిడెర్మిస్టు మాత్రమే కాదు, ఆర్టిస్టు కూడా! 


సాధారణంగా చనిపోయిన జంతుకళేబరం నుంచి కొన్ని శరీరభాగాల్ని తొలగించి, చర్మం, ఉన్ని వంటి వాటిని సంరక్షించి, జంతువు శరీరాకృతి చెడిపోకుండా ఆ శుభ్రపరిచిన కళేబరంలో ఫైబర్ వంటి పదార్థాల్ని కూర్చి, కుట్టడం ద్వారా జంతువు సజీవంగా నిలుచుని ఉన్నట్టు టాక్సిడెర్మీ ప్రతిమల్ని తయారు చేయడం రివాజు. అయితే కేట్ క్లార్క్ ఈ సంప్రదాయ టాక్సిడెర్మీ శైలికి కాస్త ఆధునికతను జోడించి, సమకాలీన టాక్సిడెర్మీ కళకు కొత్త సొబగుల్ని చేకూర్చారు.  ‘అందరూ తాజా చర్మాన్ని సేకరించి, టాక్సిడెర్మీ శిల్పాల్ని తయారు చేస్తారు. నేను మాత్రం కాస్త పాడైన, చిరిగిపోయిన, ఎక్కువకాలం ఫ్రీజర్‌లో ఉంచి, పురుగులు తినేయగా మిగిలిన చర్మాన్ని సేకరిస్తాను. ఇలా పాడైన చర్మాన్ని సేకరించిన తరువాత దానిని శుభ్రం చేసి, చిరుగులు పడిన చోటల్లా జాగ్రత్తగా కుట్లు వేస్తాను. కొన్ని చోట్ల పిన్నుల్ని వాడతాను. ముఖ్యంగా ముఖం దగ్గర ఈ పని ఎక్కువగా చేస్తాను. మనిషి ముఖాన్ని పోలి ఉండేలా నా నమూనాని తీర్చిదిద్ది ఆ ముఖానికి జంతువు చర్మాన్నే అమరుస్తాను. ఉదాహరణకు మానవ ముఖంలో మనిషి కళ్ళ చుట్టూ ఉండే భాగాన్ని జంతువు చర్మంతో నిర్మిస్తాను’ అంటూ కేట్ క్లార్క్ తనదైన టాక్సిడెర్మీ శైలి గురించి వివరించారు.  ‘ఇదేమీ ఫాంటసీ నవలల్లోంచి విచిత్ర జంతువుల పాత్రలకు రూపకల్పన చేయడం కాదు. మనిషికి, జంతుప్రపంచానికి మధ్య ఉన్న ప్రకృతి సహజమైన లంకెను పునరుద్ధరించడమే’నంటారు ఆమె. ఒక్కసారి కేట్ క్లార్క్ స్టూడియోలో అడుగు పెట్టగానే మనుషులు జంతువు ఆకృతుల్ని ఆవాహన చేసుకున్నట్టు కనిపించే శిల్పాలు మనకు భీతిని కలిగించవు. ఆ శిల్పాలు నిలుచున్న భంగిమ, మానవ ముఖాకృతిని సంతరించుకున్న వాటి ముఖాల్లోని అమాయకత్వంతో కూడిన హావభావాలు చూపరుల్ని కట్టిపడేస్తాయి. ‘పాశ్చాత్య ప్రపంచం ప్రకృతికి పూర్తిగా దూరమై పోయింది. జంతుప్రపంచంతో మాకు సంబంధాలు తెగిపోయాయి. వన్యమృగాలతో సహజీవనం ఎప్పుడైతే అంతరించి పోతుందో, అప్పుడే మనం ప్రకృతికి హాని చేసే నీచమైన స్థితికి చేరుకుంటాం. మనిషికి, వన్యప్రపంచానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజెప్పడానికే నేను ఈ శైలిని ఎంచుకున్నాను’ అని చెబుతున్నారు కేట్ క్లార్క్. టాక్సిడెర్మీ కళ మీద ఆసక్తిని పెరిగిన క్రమంలోనే తాను జంతువుల జీవన శైలిని గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టానని ఆమె చెప్పారు. జంతువు ముఖమ్మీద ఒక గాయం తాలూకు మచ్చ అది జీవించడానికి శత్రువుతో చేసిన పోరాటాన్ని గురించి చెబుతుందని ఆమె తెలిపారు. ఇలాంటి మచ్చలు కూడా జంతుప్రపంచం గురించి, ప్రకృతి సహజమైన జీవన పోరాటం గురించి చెబుతాయని కేట్‌క్లార్క్ అభిప్రాయపడ్డారు. జంతుదశను దాటి మనిషి నాగరికతలోకి అడుగు పెట్టిన చరిత్రను తన టాక్సిడెర్మీ శిల్పాల ద్వారా ప్రపంచం ముందుకు తెస్తున్నానని ఆమె అంటారు.
- కల్కి

Tags
English Title
Missing link
Related News