మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను గద్దెదించుతాం

Updated By ManamSat, 08/18/2018 - 01:29
cpi
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ

cpiకరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక యూనియన్ చట్టాలను మారుస్తూ భవిష్యత్తులో ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని, మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు గద్దెదించేం దుకు కార్మిక లోకం సిద్దం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎఐటియుసి ప్రచార బస్సు జాతా కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ వద్దకు చేరుకోగా రైల్వే హమాలీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం కార్మిక చట్టాలను ఉల్లంగిస్తూ కొత్త చట్టాలను  తీసుకువస్తూ కార్మిక లోకాన్ని ఆయోమయంలోకి నెట్టివేస్తుందన్నారు. కీలక రంగాలైన రైల్వే, బ్యాంకు, రక్షణ, ఎల్‌ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ పెట్టుబడులు 100 శాతం అనుమతులు ఇస్తూ కార్పోరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం పేద వారికి బ్యాంకు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతూ..  విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారికి వేల కోట్ల రుణాలు ఇచ్చిన సందర్బాలు ఉన్నాయన్నారు. వారు వేల కోట్లు బ్యాంకులకు ఎగనాయమం పెటి విదేశాలకు వెళ్లిపోతున్నా.. పట్టుకోలేక పోతున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ అంబానీ, అదానీల వికాసం కోసం తప్ప పేదల వికాసం చూడడం లేదన్నారు. రాష్ట్రంలో మూత పడిన పరిశ్రమలను నెలకొల్పుతామని , కాంట్రాక్టు కార్మికులను సర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ గురించి పట్టించుకోవడంలేదన్నారు. ఈ బస్సుజాతాలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఎఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాల్వ నర్సయ్య, సమ్మయ్య, రైల్వే హమాలీ అధ్యక్షకార్యదర్శులు మిడిదొడ్డి లక్ష్మయ్య, కాశెట్టి లక్ష్మణ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బోయినిపల్లి ఆశోక్, గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు. కాగా, గంజ్ కూడలీలో ఐరన్, రిక్షా, ఉల్లిగడ్డల హమాలీ, ఫర్టిలైజర్ హమాలీలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో చాడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని విమర్శించారు.

Tags
English Title
Modi and KCR governments
Related News