సాయిబాబా మానవాళికి స్ఫూర్తి

Updated By ManamSat, 10/20/2018 - 01:28
Modi
  • ఆయన సందేశం ఆచరణాత్మకం

  • సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో మోదీ

  • పులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

  • పీఎంఏవై లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్

imageషిర్డీ: ‘శ్రద్ధ, సబూరి’ (విశ్వాసం, ఓపిక) అన్న సాయిబాబా సందేశం మానవాళిలో స్ఫూర్తి నింపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాబా మహాసమాధి శతాబ్ధి (బాబా సమాధి చెంది100 ఏళ్లు అయిన సందర్భంగా) ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మహారాష్ట్రలోని షిర్డీలోని బాబా మందిరాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో..‘సాయి దర్శనం తరువాత నాకు ఎంతో శాంతి లభించింది’ అంటూ సందేశం రాయడం విశేషం. అన్ని మతాలు, వర్గాలకు చెందిన వారిని సమానంగా చూసే భావన షిర్డీలో కనిపిస్తుందన్నారు. ‘సబ్‌కా మాలిక్ ఏక్’ అన్న బాబా తత్వం ముందు తాను ప్రణమిల్లుతున్నట్టు, భక్తులందరికీ సాయిబాబా ఆశీర్వాదం లభించి అందరూ సంతోషంగా, ప్రశాంత జీవనం గడపాలని తాను కోరుకుంటున్నట్టు పుస్తకంలో మోదీ పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు వెలగబెట్టిందేమీ లేదు.. మోదీ
పేదరిక నిర్మూలన అంశాన్ని గత ప్రభుత్వాలు సీరియస్‌గా పట్టించుకోలేదని మోదీ నిప్పులుచెరిగారు. ఒక కుటుంబం పేరును ప్రచారం చేసి, ఓటు బ్యాంకు రాజకీయలకు పాల్పడటమే ధ్యేయంగా గత ప్రభుత్వా లు పనిచేశాయని పరోక్షంగా నెహ్రూ-గాంధీ కుటుం బాలను ఆయన పేర్కొన్నారు. షిర్డీలో సాయిబాబాను సందర్శించిన అనంతరం పలు సంక్షేమ పథకాలు, పనులను ప్రారంభించిన మోదీ..తన ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు మధ్య తేడాను ఎత్తిచూపించే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం అత్యంత వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. గత నాలుగేళ్లలో పూరిగుడిసెల్లో నివసించే 1.25 కోట్ల మందికి తమ ప్రభుత్వం నివాస సదుపాయాన్ని కల్పించిందన్నారు. గత ప్రభుత్వానికి 1.25 కోట్ల ఇళ్లు నిర్మించేందు కు 20 ఏళ్ల సమయం పట్టేదని కూడా మోదీ తన ప్రసంగంలో చమత్కరించారు. 2022లో 75వ స్వాతంత్రదినోత్సవం జరుపుకునేనాటికల్లా దేశంలో ఇల్లు లేనివారెవ్వరూ ఉండరాదన్నది తమ లక్ష్యమన్న మోదీ.. పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్టు వివరించారు.

 పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ఏకైక ధ్యేయమన్నారు. తక్కువ వర్షపాతం వల్ల గడ్డుపరిస్థితుల్లో ఉన్నimageమహారాష్ట్రను తాము ఆదుకుంటామని..ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోనూ రాష్ట్రానికి కేంద్రం సాయంచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ప్రారంభించినట్టు ప్రధాని మోదీ వివరించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పీఎంఏవై లబ్దిదారులతో షిర్డీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన ముచ్చటించారు. పక్కా ఇళ్ల లబ్దిదారులు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం ద్వారా లబ్దిపొందాలని సూచించారు. ఆయుష్మాన్ పథకం కింద ఏటా ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల విలువైన వైద్యసేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయన్నారు. పీఎంఏవై కింద నిర్మించిన ఇళ్ల నాణ్యతను లబ్దిదారులతో స్వయంగా మరాఠీలో అడిగి తెలుసుకున్నారు.  లబ్దిదారులు ఇళ్ల మంజూరుకోసం లంచమేమైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నించగా లేదంటూ లబ్దిదారులు సమాధానమివ్వడంతో ఎన్డీఏ హయాంలో మధ్యవర్తులెవ్వరూ ఏం చేయలేరన్నారు. ‘ఈ-గృహప్రవేశం’ (ఎలక్ట్రానిక్ గృహప్రవేశం)లో భాగంగా 40,000 మంది లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సాగింది. కార్యక్రమంలో భాగంగా 10 మంది లబ్దిదారులకు ఇంటి తాళంచెవులు స్వయంగా ప్రధాని అందజేశారు.

తృప్తి దేశాయ్ అరెస్ట్
 భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ను పోలీసులు  అరెస్టు చేశారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ప్రధాని మోదీతో చర్చించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని లేదంటే మోదీ షిర్డీ పర్యటనను అడ్డుకుంటామన్న తృప్తి దేశాయ్‌ను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అరెస్టు చేశారు. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రధాని మోదీని కలిసేందుకు పూనె నుంచి షిర్డీకి బయలుదేరిన ఆమెను సహకర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్టుపై పోలీసులు తీసుకున్న చొరవలో కొంతైనా శబరిమలలో మహిళల ప్రవేశంపై చూపితే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

త్వరలో ఐటీ నిపుణులతో భేటీకానున్న మోదీ
image‘సరికొత్త భారతదేశం’ నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ రంగాల పాత్రను ప్రధాని నరేంద్ర మోదీ ఐటీ నిపుణల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ‘‘డియర్ టెక్నో క్రాట్స్, టెక్నో లవర్స్.. మీకందరికీ ఓ విజ్ఞప్తి.. ‘నరేంద్ర మోదీ మొబైల్ యాప్’ అనే బహిరంగ వేదికను అనుసరించి.. ఇతరులతో మీ అభిప్రాయాలను పంచుకోండి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా ఓ లింకును కూడా ఆయన పోస్టు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్ తయారి నిపుణులతో ఈనెల 24న మోదీ భేటీ కానున్నట్టు యాప్‌లో పేర్కొన్నారు. నూతన భారత దేశ నిర్మాణంలో ఆయా రంగాల పాత్రను ఈ కార్యక్రమంలో చర్చించను న్నట్టు యాప్‌లో పేర్కొన్నారు. ఇందుకు దేశంలోని ఐటీ, ఎలక్ట్రానిక్ రంగ నిపుణలంతా ఆహ్వానితులేనని యాప్‌లో వివరాలు పొందుపరిచారు.

English Title
Modi offers prayers at Shirdi Sai Baba temple
Related News