కాంగ్రెస్ నేతలపై ఎంపీ బాల్కసుమన్ ధ్వజం

Updated By ManamMon, 09/03/2018 - 20:12
MP Balka suman, MLA Jeevan Reddy, Congress leaders 

MP Balka suman, MLA Jeevan Reddy, Congress leaders హైదరాబాద్: ప్రగతి నివేదిక సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారని ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొత్త బిచ్చగాడు రేవంత్, పాత బిచ్చగాడు మధు యాష్కీ, బొమ్మాళి డీకే అరుణ, గడ్డం బాబా ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు.. టీఆర్ఎస్ సభపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సభలు పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు కడుపు మంటగా ఉందో చెప్పాలన్నారు.

టీఆర్ఎస్ సభలలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్య కన్నా మొన్న రాహుల్ గాంధీ మీటింగ్‌కు వచ్చిన వారి సంఖ్య తక్కువని విమర్శించారు. కాంగ్రెస్ నేతలది సొల్లు పురాణమని, కాంగ్రెస్ నేతలు తమ సభపై తిట్లు ఆపకపోతే కాంగ్రెస్‌కు డబుల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. చాలా మందికి డిపాజిట్లు రావని టీఆర్ఎస్‌ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని, ఉత్తమ్ తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగము చేయలేదన్నారు. 

డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉత్తమ్ ఆనాడు పని చేశారని, అపుడు నిరుద్యోగులపై ప్రేమ చూపని ఉత్తమ్‌కు ఇపుడు వారు గుర్తొస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో నేతలు దొంగల ముఠాలా ఏర్పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోనియా తానే తెలంగాణ ఇచ్చినా అని చెప్పినా కరీంనగర్‌లో ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు టీఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు పేపర్ పులులు, టీవీ టైగర్లు .. ఆందోళన, భయం, ఆవేదన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్‌పై తిట్ల పురాణం అందుకుంటున్నారని మండిపడ్డారు.

గాంధీ భవన్ గోబెల్స్ భవన్‌గా మారిందని, తెలంగాణలో డ్రామాలు, ద్రోహాలకు కాంగ్రెస్ తెర లేపుతోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కోర్టుకు వెళ్తూ కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంత అడ్డుపడ్డా కేసీఆర్ ప్రకటించినట్టుగా లక్షా 12 వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు విమర్శలు మానకపోతే వారి పార్టీ కథ కంచికి, కాశికేనని ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

English Title
MP balka suman, MLA Jeevan reddy slams Congress leaders
Related News