క్రికెట్‌కు మిస్టర్ కూల్ గుడ్‌బై?

Updated By ManamWed, 07/18/2018 - 15:22
Ms dhoni retirement rumours
  • ఇంగ్లాండ్ వన్డేలో సూచన

MS dhoni

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్‌బై చెప్పనున్నారంటూ తాజాగా మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేనే మిస్టర్ కూల్ చివరి మ్యాచంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు, పుకార్లకు కొదవేంలేదు.

ఇప్పటికి చాలాసార్లు ఇలాగే ప్రచారం జరిగినా, ఇప్పుడు మాత్రం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో భారత ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులను నిరశపరిచింది. 

ముఖ్యంగా మూడో వన్డేలో ధోనీ ఆటపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అభిమానులతో పాటు గవాస్కర్ వంటి మాజీ ఆటగాళ్లు ధోనీ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధోనీని జట్టులో కొనసాగించడాన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మూడో వన్డేలో పరుగులు చేయడంలో మిడిలార్డర్ మరోసారి విఫలం కాగా.. వికెట్లు తీయలేక బౌలర్లు చేతులెత్తేశారు. ధోనీ క్రీజులో నిలబడినా దూకుడుగా ఆడలేకపోయాడు.

పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. వేగంగా పరుగులు రాబట్టాల్సిన పరిస్థితుల్లో మందకొండిగా ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూంకు వెళ్తున్న సమయంలో ధోనీ అంపైర్ల దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకున్నాడు. దీంతో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ రూమర్లు ప్రారంభమయ్యాయి.

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లు బంతినో వికెట్‌నో గుర్తుగా దాచుకోవడం సాధారణమే. గతంలో ధోనీ కూడా ఇలాగే ప్రవర్తించాడు. టెస్టుల నుంచి రిటైరయ్యే సమయంలో.. 2014లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ముగిశాక ధోనీ స్టంప్లను తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

తాజాగా ఇంగ్లాండ్ వన్డేలో బంతిని తీసుకెళ్లడంతో త్వరలో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మూడో వన్డే మ్యాచ్ ముగిశాక ధోనీ అంపైర్ దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English Title
MS Dhoni takes match ball from umpire after 3rd ODI, sparks retirement rumours
Related News