ముస్లిం రామ్‌లీలా

Updated By ManamThu, 10/18/2018 - 01:32
 festival

ఉత్తరాదిలో దసరా పండుగ అంటే ‘రామ్‌లీలా’ నాటకం తప్పక ప్రదర్శిస్తారు. రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలతో ప్రజలను అలరించేలా దసరా పర్వదినం రోజు నాటకాన్ని ఆవిష్కరించేందుకు ఊరూరా పెద్ద ఎత్తున పోటీపడుతారు. నాటకంలో మేం పాల్గొంటామంటే మేం పాల్గొంటామంటూ రామ, లక్ష్మణ, సీత వేషాలు వేసేందుకు ఆబాల గోపాలం ఆసక్తిగా ముందుకు వస్తారు.  కానీ కొందరికి మాత్రమే ఈ రామాయణ పాత్రలు ధరించే ఛాన్స్ దక్కుతుంది.

మూడు తరాలుగా..
dasara  festivalదసరా పండుగను ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల హిందూ-ముస్లింలు కలిసి జరుపుకుంటారు. యూపీ రాజధాని లక్నోలో గత మూడు తరాలుగా ‘బక్షి కా తాలాబ్’లో ఏర్పాటు చేస్తున్న రామ్‌లీలా నాటకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ నాటకానికి దర్శకుడు మహమ్మద్ సబీర్ ఖాన్ కావడం విశేషం.  1972 నుంచి ఆయన ఇందులో కీలక పాత్ర పోషిస్తుండడం హైలైట్‌గా నిలుస్తోంది. 13 ఏళ్ల వయసు నుంచే సబీర్ ఖాన్ రామ్‌లీలాలో భాగస్వామిగా ఉంటూవచ్చారు. ప్రస్తుతం ఇతని పిల్లలు, వారి పిల్లలు అంతే ఉత్సాహంగా ఏటా రామ్‌లీలా నాటకంలో పాత్రధారులుగా అంద రినీ అలరిస్తున్నారు. అంటే మూడు తరాల సబీర్ ఖాన్ కుటుంబం రాముడి లీలను ప్రదర్శించి.. స్థానికులను భక్తితత్వంలో ముంచెత్తుతోంది. హిందూ, ముస్లింలు ఇద్దరూ కలిసి ఈ నాటకం వేసి అందరి మన్ననలు పొందుతారు. ఇక వీరు రామాయణంలోని పద్యాలు, డైలాగులు అలవోకగా పలికి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తారు. ఇదెలా సాధ్యమంటే.. రాముడి మీద ఉన్న అపార విశ్వాసమే తమతో ఇలా రామాయణం పలికించేలా చేస్తుందని సబీర్ కుటుంబం సగర్వంగా చెబుతుంది. ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని గోటెగావ్‌లో కూడా కొన్ని దశాబ్దాలుగా హిందూ, ముస్లింలు కలిసి ‘రామ్‌లీలా’ పర్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ ఏడాది కూడా వీరు మతసామరస్యానికి ప్రతీకగా రామాయణ ఘట్టాలను ప్రదర్శించనున్నారు.

రావణుడు కూడా
రామ్‌లీలా నాటకం తుది అంకం చేరాక భారీ రావణుడి విగ్రహాన్ని తగులబెట్టడం ఆనవాయితీ. అయితే ఈ కళాఖండాల తయారీ వెనుక కూడా ముస్లిం భక్తులున్నారు! 15 ఏళ్ల పిన్నవ యసు నుంచే 10 తలల రావణుడి దిష్టిబొమ్మలు తయారు చేస్తున్న హఫిజుద్దీబాయ్..ఏటా నోయిడా నుంచి ముంబై వచ్చి పెద్ద సంఖ్యలో బొమ్మలు తయారుచేస్తారు. ‘ఖాన్ సాహెబ్’గా ఈయన్ను అభిమానంగా వీరంతా పిలుస్తారు. ముంబైలోని ఆజాద్ మైదాన్, చౌపటీ, వర్సోవా, మలాద్, ఘట్కోపర్, చెంబూర్ వంటి 11 ప్రాంతాల్లో జరిగే దిష్టిబొమ్మ దగ్ధం కోసం రావణుడి విగ్రహాలను ఈయన రూపొందిస్తున్నారు. సుమారు 20 మంది ఈయనకు సహకరిస్తుండగా వీరిలోనూ చాలామంది ముస్లిం యువకులున్నారు. ఇక ఖాన్ సంతానమైన ఏడుగురు పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటారు.

రామ్‌పూర్‌లోనూ..
దశాబ్దాలుగా రావణుడి విగ్రహాలను చేస్తున్న రామ్‌పూర్‌కి చెందిన ముస్లిం కుటుంబం మతసామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. జహీద్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులంతా దసరా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు.   తరతరాలుగా తమ కుటుంబమే ఇక్కడి రావణుడి విగ్రహాలను తయారుచేస్తున్నట్టు చెప్పే జహీద్ తాను చేసే విగ్రహాలు పదుల సంఖ్యలో అమ్ముడుపోతాయని చెబుతారు. జహీద్ చేత్తో తయారయ్యే రావణుడి విగ్రహాలకున్న ప్రత్యేక డిమాండ్ ఏమిటంటే.. స్థానికంగా మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానాల నుంచి రామ్‌పూర్ వచ్చి ఈ భారీ రావణుడి విగ్రహాలు కొనుగోలు చేస్తుండడంతో యూపీలో ఈయన రావణుడి దిష్టిబొమ్మల తయారీ ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచారు. 

English Title
Muslim Ramlila
Related News