ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలి

Updated By ManamSat, 07/21/2018 - 22:47
mithali
  • సహచరులకు మిథాలీ సూచన .. త్వరలో శ్రీలంక టూర్  

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరొథె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జట్టు mithaliసభ్యులందరూ వీలైనంత త్వరగా ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలని మిథాలీ రాజ్ సూచించింది. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన, సీనియర్ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం వంటి కారణాలతో తుషార్ రాజీనామా చేశారు. ‘వారం రోజుల్లో మేమందరం క్యాంప్‌లో కలవబోతున్నాం.

మొట్టమొదటి అంశమేంటంటే.. మేమందరం మళ్లీ ధ్యైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఇటువంటి విషయాలు క్రీడాకారుల జీవితాల్లో మామూలే. కానీ ఎవరికి వారు ప్రాధాన్యతలను గుర్తించాలి. త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాం. అంతేకాకుండా వరల్డ్ కప్‌కు కూడా సిద్ధపడాలి. కోచ్ వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టకూడదు’ అని మిథాలీ చెప్పింది. ఉన్నఫళంగా కోచ్‌ను తొలగించడం ఇదేమీ కొత్త కాదు. 2017లో ఐసీసీ వరల్డ్ కప్‌కు రెండు నెలల ముందు కోచ్ పూర్ణిమా రావ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు. ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమిపాలైంది. ‘నేను ఎక్కువగా చెప్పలేను. మేనేజ్‌మెంట్ నిర్ణయాల్లో బీసీసీఐదే ఏకైక అధికారం. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వాళ్లు మాత్రమే చెప్పగలరు. బోర్డ్ రూమ్‌లో జరిగిన ఆ సమావేశంలో ఏం జరిగిందో నేను చెప్పలేను. కానీ ఒక సీనియర్ ప్లేయర్‌గా కోచ్‌గా ఎవరున్నా అతనికి గానీ, ఆమెకు గానీ వ్యతిరేకిని మాత్రం కాదు. ఒక ప్లేయర్‌గా కోచ్ జట్టుకు సహాయపడాలని కోరుకుంటాను.

 అమ్మాయిలందరూ క్యాంప్‌కు వచ్చినప్పుడు ఒక అనుభవజ్ఞురాలిగా వాళ్లందరికీ దిశా నిర్దేశం చేస్తాను. అటువంటి సంఘటనలు కొన్నిసార్లు జట్టు మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఎవ్వరూ వార్తా పత్రికలు చదవడం లేదని గానీ, ఎటువంటి ప్రశ్నలూ వేయడం లేదని గానీ చెప్పలేను. ఇది అన్ని చోట్లా ఉన్నదే. కానీ ఉన్నత స్థాయిలో పోటీ చేసేటప్పుడు మనకున్న వనరులలో ఉత్తమమైనదాన్ని ఉపయోగించుకోవాలి. మాది బలమైన జట్టే. కానీ ఉత్తమ వ్యూహాలు రచించుకోవాలి. ఎందుకంటే టీ20 అనేది చాలా ఫాస్ట్‌గా ఆడాల్సి వుంటుంది’ అని మిథాలీ వివరించింది.

 తదుపరి భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అంతకుముందు బెంగళూరులో 10 ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొననుంది. ‘శ్రీలంక పర్యటన మాకు చాలా ముఖ్యమైంది. వన్డేల ద్వారా పాయింట్లు వస్తాయి కాబట్టి ఈ పర్యటనలో గెలవడం కూడా చాలా ముఖ్యం. ఆసియా కప్‌లో ఓటమి తర్వాత కాస్త నిరుత్సాహాం చెందాం. కానీ ఐదు మ్యాచ్‌ల టీ20లో విజయం మాలో విశ్వాసాన్ని నింపింది. శ్రీలంక వన్డే సిరీస్‌లో గెలవడం ద్వారా వరల్డ్ కప్‌లో విశ్వాసంతో అడుగుపెడతాం’ అని మిథాలీ పేర్కొంది.

English Title
must be courageous
Related News